*ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం
కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలను వమ్ము చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెలంగాణలో కాంగ్రెస్ 63–73 స్థానాలతో విజయం సాధించే అవకాశం ఉందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ శుక్రవారం అంచనా వేసింది. కాంగ్రెస్ 42 శాతం ఓట్లతో గెలుపొందనుందని, కె చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 119 అసెంబ్లీలలో 34-44 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్. అంచనా వేసిన ఓట్ల శాతం ప్రకారం బీఆర్‌ఎస్‌కు 36 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 14 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. అంతేకాకుండా బీజేపీకి 4-8 సీట్లు, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు 5-8 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.గురువారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్‌దే విజయం అని అంచనా వేయడం గమనార్హం.
*ఎల్లుండి తెలంగాణ ఎన్నికల కౌంటింగ్.. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
తెలంగాణలో గురువారం ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఎల్లుండి (ఆదివారం) జరగనుంది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ఇక.. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేశారు. కాగా.. ఓ డీసీపీ స్థాయి అధికారి ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్‌ఐలతో పాటు కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు పలు ఆంక్షలతో పాటు 144 సెక్షన్ విధించారు. మరోవైపు.. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. నలభై కంపెనీల బలగాలతో పటిష్ట భద్రత ఉండనుంది. ఇదిలా ఉంటే.. కౌంటింగ్ కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు, 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు అధికారులు.
*ముగిసిన నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదం..
నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదం ముగిసింది. నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగిస్తూ.. ఈ డ్యామ్ నిర్వహణను కృష్ణ వాటర్ మేనేజ్మెంట్ కు అప్పగించడంతోపాటు సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ప్రతిపాదనలకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. నాగార్జున సాగర్ డ్యామ్ నుండి నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా సాయుధ దళాలను మోహరించి.. కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన సందర్భంగా వివాదం తలెత్తింది. ఈ క్రమంలో.. నేడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జల సంఘం, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, నవంబర్ 29న రాత్రి ఆంధ్రప్రదేశ్ కు చెందిన దాదాపు 500 మంది సాయుధ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ పైకి వచ్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు.. 5, 7 గేట్ల వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్లను తెరిచి దాదాపు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని పేర్కొన్నారు. తెలంగాణా శాసన సభ ఎన్నికల నిర్వహణలో ఉండగా ఏపీ ప్రభుత్వం చేసిన చర్య తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధమైన అతిక్రమణలు పాల్పడడం ఇది రెండవసారి అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఈ చర్య వల్ల హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల.. రెండు కోట్ల ప్రజల తాగునీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని శాంతి కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుండి కొనసాగుతున్న మాదిరిగానే స్టేటస్-కో ని కొనసాగించాలని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. కాగా.. నాగార్జున సాగర్ డ్యాం పై గతంలో ఉన్న మాదిరిగానే స్టేటస్-కో కొనసాగించాలని, ఈ డ్యామ్ ను తాత్కాలికంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల పర్యవేక్షణలో ఉంటుందని కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు భల్లా పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు డీజీపీ అంజనీ కుమార్, నీటి పారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్.కె.జైన్, ఐజి షా నవాజ్ కాశీం, నీటిపారుదల శాఖ సలహాదారు మురళీధర్, ఓ.ఎస్.డి శ్రీధర్ దేశ్ పాండే లు పాల్గొన్నారు.
*ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తుపై పవన్ క్లారిటీ
బీజేపీ లాంటి పార్టీ తెలంగాణలో జనసేనతో పని చేసిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో అమిత్ షా వచ్చి ప్రచారం చేశారని.. బీజేపీకి క్యాడర్ లేక నేతలు లేక కాదు, జనసేనలో యువత కమిట్‌మెంట్ చూసి పార్టీని గుర్తించారన్నారు. ఏపీలో ఇంకా 100 రోజుల సమయం ఉందన్నారు. 3 నెలల్లో సమిష్టిగా మనం చేసే పని 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తుందన్నారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జన సేన పీఏసీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబుతో పాటు పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టే బీజేపీ జనసేన పార్టీని దగ్గరకు తీసుకుందన్నారు. కమిట్‌మెంట్‌తో పని చేయటమే ఇందుకు కారణమన్నారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తుపై పవన్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీ జనసేన కలవటంపై వైసీపీ విమర్శలు చేస్తోందన్నారు. ప్రజల మంచి కోసమే నిర్ణయాలు తీసుకుంటాయని.. దీని వెనుక వ్యూహాలు ఉంటాయని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. అసలు ఈ మాట అనటానికి వైసీపీకి అర్హత లేదన్నారు. తెలంగాణలో ఓటింగ్‌పై పవన్ వ్యాఖ్యానించారు. హైద్రాబాద్‌లో 50 శాతం కూడా పోలింగ్ జరగలేదన్నారు. యువత ఓటింగ్‌కు దూరంగా ఉండటం బాధ కలిగిందన్నారు. తాను ఏం చేసినా కోట్లాది మందిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తానని పవన్ చెప్పారు. టీడీపీ, జనసేన కలిసి వెళ్లటానికి కారణాలు ఉన్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయని.. వైసీపీని ఎదుర్కొంటానికి టీడీపీ, జనసేన కలిశాయన్నారు. ప్రతిపక్షం బతకాల్సిన పరిస్థితి ఉందన్నారు. వైసీపీ పాలనలో మెగాస్టార్‌ను, సూపర్ స్టార్‌ను బెదిరించే పరిస్థితి ఉందని తీవ్రంగా మండిపడ్డారు. సీఎం పదవి ఎవరిది అని ప్రశ్నిస్తున్నారని.. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించలేదు.. నాకు ఓటు వేసిన వారు ఈ ప్రశ్న అడిగితే గౌరవంగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. కానీ ఓటు వేయని వారు ఇపుడు సీఎం చేస్తాం అంటున్నారన్నారు. తనకు అన్నీ కులాలు సమానమేనన్న పవన్ కళ్యాణ్.. కులాలను ప్రోత్సహిస్తే కుల నాయకుడు అవుతామన్నారు. తాను గత ఎన్నికల్లో ఓటమి పాలైతే అందరూ విమర్శలు చేశారని.. నాదెండ్ల మాత్రం నా వెనుక ఉన్నారు అందుకే ఆయన అంటే గౌరవమన్నారు.
జనసేన పీఏసీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. టీడీపీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో జన సేన పార్టీ నేతలు కూడా పాల్గొనాలని సూచించారు. భవిష్యత్ గ్యారెంటీ పత్రంలో చంద్రబాబు, పవన్ ఇద్దరి ఫోటోలు ఏర్పాటు చేశారన్నారు. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తున్న విషయం ప్రజల్లోకి కలిసి పని చేయటం ద్వారా మరింత తీసుకు వెళ్ళాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని కార్యకర్తలకు సూచించారు.
*ఇంత బడ్జెట్‌తో ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ క్రీడలు నిర్వహించలేదు..
ఇంత బడ్జెట్‌తో ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ క్రీడలు నిర్వహించలేదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వంద కోట్ల బడ్జెట్ క్రీడలకు కేటాయించారన్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్ ,బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి రోజా పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్రాలో మ్యాచ్‌లు ఆడేవారిలో విజేతలకు 12 కోట్ల వరకూ బహుమతులున్నాయన్నారు. ఆడుదాం ఆంధ్ర ట్రైలర్ సక్సెస్ ఫుల్‌గా జరిగిందని.. 7 లక్షల మంది 72 గంటల్లో రిజిస్టర్ చేసుకున్నారన్నారు. సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో ఓటు పెట్టుకుని ఇక్కడ ఆడతాం అంటే కుదరదని మంత్రి పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో దొంగలా పారిపోయి వచ్చిన చంద్రబాబును ఎవరూ అడగగలరని ఆమె విమర్శించారు. పర్మనెంట్ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ లేవని.. అకాడమీలు కట్టడం కోసమే కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధులకు ల్యాండ్ ఇచ్చామన్నారు. సాకేత్‌కు కూడా ల్యాండ్ ఇస్తామని మంత్రి తెలిపారు. ఆడుదాం ఆంధ్రాలో గెలిచిన వారికి ఏం చేయాలో స్పోర్ట్స్ కోటా విషయమై ఆలోచిస్తామన్నారు. వాలంటీర్లతో పాటు పీటీలు కూడా ఉంటారని ఆమె చెప్పారు. సచివాలయం, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. 50రోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయని వెల్లడించారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఆడపిల్లలు క్రీడాల్లో రాణించాలని సూచించారు. ఆన్‌లైన్, సచివాలయాల్లో ఈ క్రీడాల్లో పాల్గొనే వాళ్లు నమోదు చేసుకోవాలని మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. కొవిడ్ తరువాత వైసీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసిందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఇంటి తలుపు ప్రభుత్వం తడుతోందన్నారు. 2400 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. పాత ప్రభుత్వం నుంచీ ఇప్పటి వరకూ ఉన్న బకాయిలు అన్నీ తీర్చడం జరిగిందన్నారు. కోటి మంది వరకూ రిజిష్టర్ అవుతారని మా అంచనా అని.. వాలంటీర్లు ఆటలకు రిఫరీలుగా ఉంటారన్నారు. గ్రామ స్థాయి నుంచీ రాష్ట్ర స్ధాయి వరకూ పోటీలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. గెలిచిన వారికి బహుమతులతో పాటు స్పోర్ట్స్ కిట్స్ ఇస్తామన్నారు. క్రికెట్‌లో బాగా ఆడిన వారికి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ద్వారా కోచింగ్ ఇప్పిస్తామన్నారు. కృష్ణ జింకను ఈ ఆటలకు గుర్తుగా పెట్టి, దానికి కిట్టు అని పేరు పెట్టామని చెప్పారు. 24 మంది అంతర్జాతీయ క్రీడాకారులను బ్రాండ్ అంబాసడర్‌లుగా పెట్టామని స్పష్టం చేశారు.
*రూ.5000 కరెంట్ బిల్లుకు, రూ. 195 కోట్ల రసీదు.. ఏం జరిగిందంటే..?
ఇటీవల కాలంలో కరెంట్ బిల్లుల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలతో కొందరి కోట్ల రూపాయల బిల్లులు రావడం చూస్తు్న్నాం. తర్వాత విద్యుత్ అధికారులు తమ తప్పులను తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇలాగే ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ మహిళకు రూ.4950 విద్యుత్ బిల్లు వచ్చింది. అయితే దీనికి విద్యుత్ శాఖ ఏకంగా రూ. 197 కోట్ల చెల్లింపు రసీదును ఇచ్చింది. బిల్లులను టాలీ చేసుకునేప్పుడు, లెక్కలు చిక్కకపోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. లక్నోలోని సీనియర్ విద్యుత్ అధికారులు కూడా ఈ బిల్లు వ్యవహారంపై సమచారాన్ని కోరారు. అసలు ఈ తప్పిదం ఎలా జరిగిందంటే.. విద్యుత్ కనెక్షన్ నెంబర్ 197****000 కలిగిన మహిళకు రూ. 4950 విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ బిల్లును చెల్లించేందుకు తన కొడుకును పంపింది. విద్యుత్ బిల్లు చెల్లించిన తర్వాత ఆపరేటర్ రూ.197 కోట్ల రసీదు ఇచ్చాడు. అయితే విద్యుత్ ఆపరేటర్ బిల్లుకు కేటాయించిన కాలమ్‌లో వినియోగదారుడి 10 అంకెల కనెక్షన్ నెంబర్ ఎంటర్ చేశాడు. దీంతో ఈ చిన్న తప్పు మొత్తం విద్యుత్ డిపార్ట్మెంట్‌లో గందరగోళాన్ని సృష్టించింది. ఆ తర్వాత లక్నోలని శక్తి భవన్‌లో ఉన్న డేటా సెంటర్ సూచనల మేరకు చెల్లింపు రద్దు చేశారు. బిల్లు అమౌంట్‌కు బదులుగా క్యాషియర్ వినియోగదారుల కనెక్షన్ ఐడీ నంబర్‌ను నమోదు చేశారని గోరఖ్‌పూర్ డిస్ట్రిబ్యూషన్ చీఫ్ ఇంజనీర్ అషు కలియా తెలిపారు. టైప్ చేస్తున్న సమయంలో లోపం ఏర్పడటంతో ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు.
*ఇజ్రాయిల్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ..
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ యూఏఈకి వెళ్లారు. COP28 సందర్భంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ప్రధాని భేటీ చర్చనీయాంశం అయింది. హమాస్ యుద్దంలో ప్రభావితమైన ప్రజలకు మానవతా సాయం నిరంతరం అందించాల్సిన అవసరాన్ని ప్రధాని మరోసారి పునరుద్ఘాటించారు. ఇజ్రాయిల్-హమాస్ వివాదంపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు, అక్టోబర్ 07 నాటి ఉగ్రవాద దాడిలో జరిగిన ప్రాణనష్టానికి ప్రధాని మోడ సంతాపాన్ని వ్యక్తం చేసినట్లు, బందీల విడుదలను స్వాగతించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఎక్స్(ట్విట్టర్)లో వెల్లడించారు. టూ స్టేట్ పరిష్కారానికి ఇజ్రాయిల్, పాలస్తీనా సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పాటించాల్సిన సార్వత్రిక బాధ్యత ఉందని, ఉగ్రవాదంపై పోరు చేయాల్సిన అవసరం ఉందని భారతదేశం పేర్కొంది. ఈ సదస్సులో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో ప్రధాని శుక్రవారం భేటీ అయ్యారు. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్, 1200 మంది ఇజ్రాయిలీలను చంపేసింది. దీంతో పాటు 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 16 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. గత శుక్రవారం నుంచి ఇరు పక్షాలు సంధి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ రోజుతో సంధి ముగిసింది. మరోసారి యుద్ధం ప్రారంభమైంది.
*జాంబియాలో కుప్పకూలిన కాపర్ మైన్.. 30 కార్మికులు ట్రాప్..
ఆఫ్రికా దేశం జాంబియాలో గని ప్రమాదం జరిగింది. అక్రమంగా ఓపెన్ కాస్ట్ తవ్వకాలకు పేరుగాంచిన జాంబియాలో రాగి గని కుప్పకూలడంతో 30 మంది అందులోనే చిక్కుకుపోయినట్లు ఆ దేశ మంత్రి శుక్రవారం తెలిపారు. చింగోలాలోని ఈ ప్రమాదం జరిగినట్లు హోం వ్యవహరాల మంత్రి జాక్‌మ్వింబు పార్లమెంట్‌లో తెలిపారు. అయితే గని కూలడంతో 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని వెల్లడించారు. అయితే మరణాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రాజధాని లుసాకాకు ఉత్తరాన 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింగోలా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జాంబియా ప్రపంచంలోని అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉంది. చింగోలా జాంబియాలో అతిపెద్ద కాపర్ నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ కాస్ట్ రాగి గనులలో ఒకటి.
*సలార్ ట్రైలర్ వచ్చేసింది .. ప్రభాస్ బీభత్సమే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ట్రైలర్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూసిన రోజులు చాలా ఉన్నాయి. ఎట్టకేలకు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. ట్రైలర్ మొత్తం ప్రభాస్ భీబత్సం కనిపిస్తుంది. అసలు ఆ మ్యూజిక్ కు .. ప్రభాస్ ఎలివేషన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఇంతకు ముందెన్నడూ ప్రభాస్ ను ఇలా చూడలేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినిమా మొత్తం ప్రభాస్ వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పొచ్చు. గూస్ బంప్స్ వచ్చేలా ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్.
