రెండో రోజు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి..
రెండో రోజు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న (మంగళవారం) రాత్రి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఎంపీ మాణిక్కం ఠాగూర్ తో ఆయన సమావేశం అయ్యారు. అయితే, ఇవాళ ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ తో ఆయన భేటీ కానున్నారు. తెలంగాణ కేబినెట్ కూర్పుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే రేపు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారమహాత్సవానికి వారిని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అయితే, అంతకు ముందు నెలకొన్న ఉత్కంఠ వాతావరణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం అధికారికంగా వెల్లడించింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతుంది. రేపు కొత్త సర్కారు కొలువుదీరనుంది. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. ఎమ్మెల్యేల విధులు, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై వారికి అవగాహన కల్పిస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లలో గెలిచింది. ఈసారి ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో వారితో పాటు ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ ప్రజా ప్రతినిధిగా వ్యవహరించాల్సిన తీరు, హక్కులు, బాధ్యతలు, విధులు, అసెంబ్లీ నియమ నిబంధనల గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు. హోటల్ ఎల్లాలో వారికి శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రజలు అలర్ట్.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు..
మిచౌంగ్ తుఫాన్ తో దెబ్బకు తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడుతున్నాయి. ఇక, నిన్న (మంగళవారం) బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్ వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా భారీగానే పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇక, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావం ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో సైతం పలు చోట్ల భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
ఆంధ్ర ప్రదేశ్ లో తీరం దాటిన తీవ్ర తుఫాన్ మిచౌంగ్ ప్రభావంతో తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యమంగా ఏపీకి ఆనుకొని ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలహీనపడిన మిచౌంగ్ తీవ్ర తుఫాన్ వాయుగుండంగా ఖమ్మంకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో మరింత బలహీన పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా ఇల్లందు సింగరేణి ఏరియాల్లో ఎడ తెరిపిలేని వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల గనిలో 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 45 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయింది. మరో వైపు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో కురుస్తున్న వర్షానికి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.
నేడు బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులు
నేడు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీంరావు అంబేద్కర్ 67వ వర్ధంతి.. ఈ సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పూజ్యమైన బాబా సాహెబ్ అంబేద్కర్ జీ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి వ్యక్తి అని కోనియాడారు. దళిత కుటుంబం నుంచి వచ్చి.. అణగారిన వర్గాల ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంతో భారత రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా అంబేద్కర్ నిలిచారు అంటూ ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
యూపీలో ఒంటరిగా కాంగ్రెస్.. భాగస్వామ్య పార్టీల మధ్య దూరం..
మధ్యప్రదేశ్, రాజస్థాన్ తో పాటు ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా మారే అవకాశం ఉంటుంది. అయితే, యూపీ నుంచి 80 మంది ఎంపీలను లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో కాంగ్రెస్ పార్టీ మధ్య యూపీలో ‘భారత కూటమి’లోని భాగస్వామ్య పార్టీల మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉంది. ఇక, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూటమి సమావేశానికి హాజరు కావడానికి నిరాకరించడంతో ఇండియా కూటమి మధ్య గ్యాప్ పెరిగుతుంది.
దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ దాడి, 45 మంది పాలస్తీనా పౌరులు హతం
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ తర్వాత మరోసారి యుద్ధం మొదలైంది. ఇంతలో ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై దాడి చేసింది. 45 మంది మరణించారు.. అనేకమంది గాయపడ్డారు. అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటివరకు ఇరువైపులా 16 వేల మందికి పైగా మరణించారు. కాల్పుల విరమణ తర్వాత, దక్షిణ గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఆ తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన దాడి. ఇజ్రాయెల్ దళాలు జబాలియా, తూర్పు షుజయ్య, ఖాన్ యూనిస్‌లోకి ప్రవేశించాయని ఆయన చెప్పారు. కాగా మా యోధులు 24 ఇజ్రాయెల్ సైనిక వాహనాలను ధ్వంసం చేశారని హమాస్ పేర్కొంది. దీనితో పాటు స్నిపర్లు ఇజ్రాయెల్ ఆర్మీ సైనికులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. దీని కారణంగా చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
రోహిత్, హార్దిక్ వద్దు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతడే ‘సరైనోడు’!
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ వయసు 36 ఏళ్లు కాబట్టి.. భవిష్యత్తు కెప్టెన్ కోసం ముంబై ప్రాంచైజీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఐపీఎల్ 2024 మినీ వేలంకు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ట్రేడ్ చేసుకుంది. వచ్చే సీజన్ కాకపోయినా.. ఆ తర్వాతి ఎడిషన్‌లలో హార్దిక్ జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. అయితే ముంబై కెప్టెన్‌గా హార్దిక్ కంటే సూర్యకుమార్ యాదవ్ సరైనోడని భారత మాజీ క్రికెటర్ అజేయ్ జడేజా అంటున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఐపీఎల్ 2024 సీజన్ ఆడకుండా రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవాలని అజేయ్ జడేజా పేర్కొన్నాడు. రోహిత్ మాత్రమే కాదు ఇతర భారత ఆటగాళ్లు కూడా టీ20 ప్రపంచకప్ కోసం ఐపీఎల్ 2024 ఆడకుండా ఉండాలన్నాడు. ‘ఐపీఎల్ 2024 సీజన్ నుంచి రోహిత్ శర్మ బ్రేక్ తీసుకుంటే.. సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టును నడిపించాలి. ఐసీసీ టోర్నీల్లో రాణించాలంటే.. భారత ఆటగాళ్లు ఐపీఎల్‌కు బ్రేక్ ఇచ్చి ఫిట్‌నెస్‌పై దృష్ఠి పెట్టాలి. విదేశీ ఆటగాళ్లు ఇదే చేస్తున్నారు. కానీ భారత ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ ఆడుతున్నారు. కనీసం టీ20 ప్రపంచకప్ 2024 కోసమైనా ఐపీఎల్ 2024 ఆడకుండా ఉండాలి’ అని జడేజా సూచించాడు.