*కొనసాగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఇక 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే ఏర్పాట్లు కూడా ఎన్నికల సంఘం చేసింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు కావాల్సి ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ , కాంగ్రెస్, జేడీఎస్ పోటీ పడుతున్నాయి. 224 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఎన్నికల బరిలో 918 మంది స్వతంత్రులతో కలిపి 2,613 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగళూరులోని ప్యాలెస్ రోడ్డులోని పోలింగ్ కేంద్రాలలో ఫేస్ రికాగ్నైజేషన్ అమలు చేస్తున్నారు.
*నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు.. ఈ సారి కొత్త రూల్స్
తెలంగాణలో ఫార్మసీ, మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (EAMCET) కోసం సర్వం సిద్ధమైంది. నేటి నుంచి (మే 10) పరీక్షలు ప్రారంభమై మే 14 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12, 13, 14న జరగనున్నాయి. JNTU హైదరాబాద్ MSET నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. TS EAMCET కోసం 3,20,384 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. మే 10, 11 తేదీల్లో నిర్వహించే ఏఎం స్ట్రీమ్ పరీక్షకు మొత్తం 1,14,981 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మే 12, 13, 14 తేదీల్లో జరగనున్న ఇంజినీరింగ్ పరీక్షకు 2,05,031 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. తెలంగాణలోని 104 కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 33 కేంద్రాల్లో అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో కంటే కొత్తగా 28 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్‌లను ఇప్పటికే https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
*నేడు పది ఫలితాలు
తెలంగాణ 10వ తరగతి ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 10వ తరగతి ఫలితాలను ఇవాల మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. టెన్త్ ఫలితాల కోసం ntvtelugu.com , https://results. tsbse.telangana.gov.in, https//results. tsbsetelangana. వెబ్‌సైట్‌లలో చూడవచ్చు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పది పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 10వ తరగతి పరీక్షలకు 99.63 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పది పరీక్షలకు 4,86,194 మంది రెగ్యులర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4,84,384 మంది పరీక్షలు రాశారు. 1,809 మంది పరీక్షలకు హాజరు కాలేదు. ప్రైవేటు విద్యార్థులు 443 మంది దరఖాస్తు చేసుకోగా, 191 మంది మాత్రమే హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న (మంగళవారం) విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించారు. రెండింటిలోనూ బాలికలు రాణించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొత్తం 4 లక్షల 33 వేల 82 మంది హాజరు కాగా వారిలో 2,72,208 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం 63.85 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1,60,000 మంది ఏ గ్రేడ్‌లో, 68,335 మంది బీ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు.
*చాటింపుతో ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర
తిరుపతి గంగమ్మ జాతర చాటింపుతో నేటి నుంచి ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. జాతర నేపథ్యంలో గ్రామస్థులు ఊరును విడిచి వెళ్లరాదని చాటింపు వేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రి పూట ఇక్కడ బస చేయకుండా వెళ్లిపోవాలి. జాతర ప్రారంభమైనందున అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహించుకోవాలి.. అంటూ సంప్రదాయం ప్రకారం కైకాల వంశస్తులు తిరుపతి గంగజాతర మంగళవారం అర్ధరాత్రి తర్వాత చాటింపు వేశారు. భేరివీధిలో తొలి చాటింపు పూజ నిర్వహించిన అనంతరం నాటి నగర శివారు ప్రాంతాలైన నాలుగు కాళ్ల మండపం, హెడ్‌పోస్టాఫీస్, కృష్ణాపురం ఠాణా, పాత మెటర్నిటీ ఆసుపత్రి సర్కిల్ ప్రాంతాల్లో అష్టదిగ్బంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టారు. ఆ చాటింపుతో తిరుపతి శ్రీతాతయ్యగుంట చిన్నగంగమ్మ (తిరుపతి గ్రామదేవత) జాతర అత్యంత వేడుకగా ఆరంభమైంది. తిరుపతి గ్రామదేవత శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర బుధవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఘనంగా జరగనుంది.
*రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
ఏపీ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పాలిసెట్–2023 పరీక్ష ఇవాళ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి మంగళవారం ప్రకటించారు. మొత్తం 61 పట్టణాల్లో 499 కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. పాలిసెట్‌కు మొత్తం 1,59,144 మంది దరఖాస్తు చేశారని వివరించారు. వీరిలో 96,429 మంది బాలురు, 62,715 మంది బాలికలు ఉన్నారన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 21 వేల దరఖాస్తులు పెరిగాయని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో 26,698 మంది ఎస్సీ, 9113 మంది ఎస్టీ అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు.
*ఏటా 10లక్షల శిశువులు మరణిస్తున్నారు.. డబ్ల్యూహెచ్‌ఓ సంచలన విషయాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) , యునిసెఫ్ మంగళవారం విడుదల చేసిన సంయుక్త నివేదిక ప్రకారం ప్రపంచంలో ఏటా ఒక మిలియన్ కంటే ఎక్కువ నెలలు నిండకుండానే శిశువులు మరణిస్తున్నారు. 2020 సంవత్సరంలో ప్రపంచంలోని 45 శాతం శిశువులు నెలలు నిండకుండానే జన్మించారు. వారు ఎక్కువగా ఐదు దేశాల్లో పాకిస్థాన్, నైజీరియా, చైనా, ఇథియోపియా, భారతదేశంలో జన్మించారు. 2020లో బంగ్లాదేశ్‌లో 16 శాతం కంటే ఎక్కువ ముందస్తు జనన రేటు ప్రపంచంతో పోలీస్తే అత్యధికంగా నమోదైంది. సంఖ్యాపరంగా చూస్తే 30.16 లక్షల జననాలతో భారతదేశం మొదటి స్థానంలో ఉంది.2020లో 9.14 లక్షల మంది పిల్లలతో పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉంది. గత దశాబ్దంలో 152 మిలియన్ శిశువులు నెలలు నిండకుండానే జన్మించారు. పుట్టిన ప్రతి 10 మందిలో ఒకరు నెలలు నిండకుండానే ఉన్నారు. ప్రతి 40 సెకన్లకు ఈ పిల్లలలో ఒకరు చనిపోతున్నారు. ఒక దశాబ్దంలో ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ అకాల జనన రేటులో ఎటువంటి మార్పు లేదు. సంఘర్షణ, వాతావరణ మార్పు, కోవిడ్ ప్రతిచోటా మహిళలు, శిశువులకు ప్రమాదాలను పెంచుతున్నాయి.
*ఖరీదైన ఇల్లు కొనుక్కున్న సమంత.. ధర తెలిస్తే షాకే
ఎప్పటి నుంచో తాను కంటున్న కలను నెరవేర్చుకుంది సమంత. హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు కావాలని ఎప్పటి నుంచో కోరుకుంటుంది. తన కోరిక ఇప్పటికి నెరవేరింది. చాలా మంది హీరోలు, హీరోయిన్లు దేశంలోని ప్రధాన నగరాల్లో విలాసవంతమైన విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం ఆ వార్త మీడియా సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లో జయభేరి ఆరెంజ్ కౌంటీలో ఖరీదైన ఫ్లాట్ తీసుకున్నట్లు పేర్కొంది. ఈ అపార్ట్‌మెంట్‌లోని 13వ అంతస్తులో సమంత ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. ఇది 3 bhk ఫ్లాట్ అని తెలుస్తోంది. ఈ ఇంటి ఇంటీరియర్ పనులు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ ఇల్లు రెడీ చేసినట్లు తెలుస్తోంది. సమంత కొనుగోలు చేసిన ఇంట్లో ఆరు పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. ఈ ఇంటి కోసం సమంత 7 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టింది. లగ్జరీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా సకల సౌకర్యాలతో ఈ ఇంటిని డిజైన్ చేసింది సమంత. సమంత ఇల్లు చాలా లావిష్ గా ఉండనుంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా జీవిస్తోంది. అయితే ఇప్పుడు తను కొన్న ఈ ఇంటి పనులు పూర్తికావడంతో త్వరలో ఈ ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తోంది. సమంత రీసెంట్‌గా శకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన సమంత నటిస్తోంది. దర్శక ద్వయం రాజ్, డీకే సిటాడెల్ సిరీస్‌ని రూపొందిస్తున్నారు. ప్రైజ్ ఒరిజినల్ సిరీస్‌గా భారీ బడ్జెట్‌తో సిటాడెల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించి సమంత లుక్ వైరల్‌గా మారింది. దీంతో పాటు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సమంత ఖుషీ సినిమా చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా చాలా గ్రాండ్‌గా రూపొందుతోంది.
