*రాజమండ్రి జైలుకు చంద్రబాబు.. ఖైదీ నంబర్ 7691
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీసులు భారీ భద్రత నడుమ రోడ్డుమార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వర్షం కురుస్తుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమహేంద్రవరం చేరుకోవడానికి 5 గంటలకు పైగా పట్టింది. కోర్టు ఆదేశాల మేరకు బాబు కోసం జైలు అధికారులు స్నేహ బ్లాక్ ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. జైలు దగ్గర 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించేందుకు కోర్టు అంగీకరించింది. భద్రతా కారణాల రీత్యా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక రూం ఇవ్వాలని, చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని కోర్టు సంబంధిత అధికారులకు ఆదేశించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారంతో పాటు మెడిసిన్ తీసుకొచ్చేందుకు అనుమతించాలని జైలు అధికారులకు కోర్టు ఆదేశించింది. జైలు దగ్గర ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరుగకుండా భారీగా మొత్తంలో పోలీసులు మోహరించారు. చంద్రబాబు వెంటే ఆయన కుమారుడు నారా లోకేశ్ కూడా రాజమండ్రికి వెళ్లారు. అయితే.. భద్రతా కారణాల రీత్యా ఎవర్నీ కూడా జైలు బయటే నిలిపివేశారు. అయితే బాబుకు బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు ప్రయత్నిస్తున్నారు. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. ఇక బాబును విచారణ నిమిత్తం జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించాలని సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపుకు జనసేన మద్దతు ఇచ్చింది. ఈ బంద్‌కు బీజేపీ దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
*ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. జనసేన మద్దతు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు తరలించడంపై రాష్ట్రంలో టీడీపీ భగ్గమంటోంది. చంద్రబాబు అరెస్ట్‌నకు నిరసన టీడీపీ సోమవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో తెల్లవారు జాము నుంచే టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి తమ నిరసన పాటిస్తున్నారు. మరోవైపు పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. టీడీపీ కీలక నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ బంద్ పిలుపుకు జనసేన, సీపీఐ, లోక్‌సత్తా సహా వివిధ వర్గాలు మద్దతు తెలిపాయి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చంద్రబాబు గొంతు నొక్కేందుకు అక్రమ అరెస్టు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ చేయనున్నట్లు తెలిపింది. టీడీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనసేన పార్టీ సంఘీభావం ప్రకటించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజా కంటక చర్యలకు పాలక పక్షం ఒడిగడుతోందంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాపక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపుతో కేసులు, అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ అప్రజాస్వామిక చర్యలను జనసేన ఎప్పుడూ సహించదని బంద్‌లో జనసేన శ్రేణులు శాంతియుతంగా పాల్గొనాలని కోరారు. టీడీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు సీపీఐ కూడా సంఘీభావం ప్రకటించింది. రాష్ట్ర బంద్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. బంద్ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన రౌండ్‌టేబుల్ సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేశామని ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. అలాగే లోక్‌సత్తా పార్టీ, జై భీమ్ పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపాయి. ఇదిలా ఉండగా.. రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నారంటూ బీజేపీ లెటర్ హెడ్‌తో ఒక నకిలీ లేఖ కలకలం సృష్టించింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరిట ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఓ ఫేక్ లెటర్ హెడ్ వాట్సాప్ గ్రూప్‌లలో ప్రత్యక్షమైంది. ఈ మేరకు పురంధేశ్వరి వివరాలను వెల్లడించారు. అది నకిలీదని, దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర బంద్ నేపథ్యంలో పాఠశాలలకు ఒక రోజు సెలవు ఇస్తున్నట్లు పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. పిల్లల భద్రత, రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాయి. మరోవైపు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరైనా ఆందోళనలు, సంబరాలు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల డీఎస్పీలకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారు.
*నేడు సంగారెడ్డిలో బీజేపీ బహిరంగ సభ
బీఆర్ఎస్ కు ముదిరాజ్ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు రాజీనామా చేశారు. నేడు ( సోమవారం ) బీజేపీలో చేరబోతున్నానని ఆయన ప్రకటించారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. అయినా తనకు టికెట్ రాలేదని వాపోయారు. ఇవాళ సంగారెడ్డి స్టేడియం గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీలో చేరబోతున్నానని పులిమామిడి రాజు పేర్కొన్నారు. ఈ రోజు జరిగే బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు హాజరవుతారని, వారి సమక్షంలో బీజేపీలో చేరుతానని సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజు చెప్పారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా తమకు ఎక్కడా టికెట్లు ఇవ్వని సీఎం కేసీఆర్.. కనీసం సంగారెడ్డి నియోజకవర్గంలో అయినా తమకు ఛాన్స్ ఇవ్వాలని ముదిరాజ్ లు డిమాండ్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ముదిరాజ్ కులస్తుల సూచనలు, సలహా మేరకు ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, బీఆర్ఎస్ నేత పులిమామిడి రాజు రాజీనామా చేయడంతో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. నియోజకవర్గంలో ముదిరాజ్ కులస్తుల ఓటు బ్యాంకు సుమారు 40 శాతంకు పైగా ఉంది. పైగా ముదిరాజ్ సంఘం తరఫున రాజు కొన్నేళ్లుగా నియోజకవర్గంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో సంఘం పెద్దలు, కుల ఓటర్లు ఆయన అభ్యర్థిత్వానికే సపోర్ట్ తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనకు ముందే ముదిరాజ్ సంఘం తరఫున సంగారెడ్డి నుంచి రాజు పేరు ప్రతిపాదించారు. అయితే, బీఆర్ఎస్ అధిష్టానం ఆ ప్రతిపాదనను పట్టించుకోకపోవడంతో.. తాజాగా పులిమామిడి రాజు రాజీనామాతో బీఆర్ఎస్ పై నియోజకవర్గంలో ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది.
*కాళోజీ నారాయణరావు తనయుడు రవికుమార్ మృతి
ప్రజాకవి కాళోజీ నారాయణరావు తనయుడు రవికుమార్ కన్నుమూశారు. హన్మకొండ జిల్లాలోని దామెర మండల శివారులోని ప్రతిమ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో నిన్న (ఆదివారం) ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య వాణీదేవి, కుమారుడు సంతోష్ కుమార్ ఉన్నారు. అయితే, రవికుమార్ కొడుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు. రవి కుమార్ అనారోగ్యం రీత్యా ఇటీవలే హన్మకొండకు వచ్చారు. రవికుమార్ నక్కలగుట్టలోని కాళోజీ నారాయణరావు ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అయితే, రవి కుమార్ కొంతకాలం ఆంధ్రా బ్యాంక్‌లో ఉద్యోగం చేసి, స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. సాహిత్యం అంటే మక్కువే.. కాళోజీ స్థాపించిన మిత్రమండలిలో ఆయన సభ్యుడిగా ఉంటూ దాదాపు అన్ని సమావేశాలకు హాజరయ్యేవారు. రవికుమార్ మృతిపై కాళోజీ ఫౌండేషన్ పక్షాన నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, అంపశయ్య నవీన్ తో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నేడు (సోమవారం) ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక, రవి కుమార్ భౌతికకాయాన్ని హన్మకొండలోని నక్కలగుట్టలోని ఆయన నివాసానికి తరలించారు. కాగా, కాళోజీ కుమారుడు రవికుమార్ మృతి చెందడం బాధాకరమని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రవికుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
*కుప్పకూలిన లిప్ట్ .. ఏడుగురు కూలీలు మృతి
మహారాష్ట్రలోని థానే నగరంలోని బల్కమ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ లిఫ్ట్ కుప్ప కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో ఓ కార్మికుడు గాయపడి థానే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే థానే మున్సిపల్ కార్పొరేషన్ బృందం, పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీంతో ఈ ఘటన థానే జిల్లాలో సంచలనం రేపుతుంది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. థానేలో రన్వాల్ పేరుతో కొత్తగా నిర్మించిన ఈ 40-అంతస్తుల బిల్డింగ్ లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ బహుళ అంతస్తుల భవనం పైకప్పుపై వాటర్ ప్రూఫింగ్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ భవనంలో పని చేస్తున్న కార్మికులందరు తమ పనులు ముగించుకుని కిందకు వస్తున్నా.. క్రమంలో లిఫ్ట్ చప్పుడుతో కింద పడిపోయింది. ఒక్కసారిగా లిఫ్ట్ క్రింద పడటంతో అక్కడికక్కడే తోపులాట జరిగింది. దీంతో ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు మరణించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతులంతా కూలీలే. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది.
*పాములు పట్టేవారు డబ్బులు ఇవ్వలేదని..
ట్రైన్ లో ఓ బోగీలో ఉన్నవారికి చుక్కలు చూపించారు పాములు ఆడించేవారు. తమకు కావల్సినంత డబ్బులు ఇవ్వలేదని వారిపైకి పాములను వదిలారు. భోగిలోని వారందరిని బిక్కు బిక్కుమంటూ బతికేలా చేశారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హౌరా, గ్వాలియర్‌ల నడుమ ప్రయాణిస్తుంది చంబల్ ఎక్స్ ప్రెస్. శనివారం సాయంత్రం బందా స్టేషన్ లో అందరితో పాటే ఓ నలుగురు పాములు పట్టుకునే వారు రైలు ఎక్కారు. వారు కొంచెం ఆగి రైలు కదలడం మొదలవగానే బుట్టలో నుంచి పాములను బయటకు తీసి ఆడించడం మొదలు పెట్టారు. వాటి ఆటను చూసిన కొంతమంది ప్రయాణీకులు వారికి డబ్బులు ఇచ్చారు. మరికొంతమంది ఇవ్వలేదు. అయితే వారు వస్తాయనుకున్నన్ని డబ్బులు రాకపోవడంతో పాములు ఆడించేవారికి చిరెత్తుకొచ్చింది. బుట్టలో నుంచి పాములను తీసి బయటకు వదిలారు. ఆ పాములు రైలులో తిరగడం మొదలు పెట్టాయి. దీంతో జనం ఒక్కసారిగా భయంతో ట్రైన్ లోనే పైన సీట్లలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కొంత మంది టాయిలెట్ లో దాక్కున్నారు. బిక్కుబిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించారు. దాదాపు అరగంట పాటు ఈ తతంగం అంతా కొనసాగింది. చాలా మంది రైల్వే కంట్రోల్ రూం కి ఫోన్ చేసి తమను కాపాడాలని కోరారు. రైలు ఎక్కిన గంట తరువాత ఆ పాములు ఆడించేవారు మహోబా స్టేషన్ లో దిగి వెళ్లిపోయారు. అయితే ప్రయాణీకులు కూడా అక్కడే దిగి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. రైల్వే పోలీసులు వచ్చి బోగీ మొత్తం తనిఖీ చేసి పాములు లేవని నిర్ధారించారు. పాములు ఆడించేవారు వారితో పాటు తీసుకొని వెళ్లవచ్చని చెప్పారు. అయితే పోలీసులు వచ్చే లోపే వారు జారుకోవడంతో వారిని పట్టుకోలేకపోయారు. ప్రయాణీకులు మాత్రం తమను ఇంతగా భయపెట్టిన వారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని పట్టుకొని కచ్ఛితంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
*గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.. నిన్నటి దరలే ఈరోజు కూడా నమోదు అయ్యాయి. గత కొన్ని రోజుల క్రితం భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో స్థిరంగా నమోదు అవుతున్నాయి.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54, 850 లు ఉండగా.. 24క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,840 పలుకుతోంది. ఇక వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇక వెండి ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం కిలో రూ.73,500లకు లభిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఇలాగే ఉన్నాయి.. ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,110గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,850, 24 క్యారెట్లు రూ.59,840 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,100, 24 క్యారెట్లు రూ.60,110 ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,850 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,840గా ట్రెండ్ అవుతోంది. అదే విధంగా కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850, 24 క్యారెట్ల ధర రూ.59,840గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,850గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,840గా ఉంది. ప్రధాన నగరాల్లో వెండి ధర విషయానికొస్తే.. వెండి కిలో ధర రూ.73,500 ఉంది. ముంబైలోనూ ఇదే ధరకు లభిస్తోంది. ఇక చెన్నైలో రూ.77,000 పలుకుతుండగా, బెంగళూరులో రూ.73,000 లుగా ఉంది. కేరళ, కోల్‌కతా నగరాల్లో రూ.73,500లు పలుకుతోంది.. హైదరాబాద్ లో మాత్రం రూ.77,000 గా ఉంది..
*సేమ్ సీన్ రిపీట్.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో మళ్లీ ఖాళీ..!
సాధారణంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. మ్యాచ్ ఎక్కడ జరిగినా అభిమానులతో స్టేడియం నిండిపోతుంది. ఇక మేజర్ టోర్నీలు అయితే స్టేడియంలో ఒక్క సీట్ కూడా ఖాళీగా కనిపించదు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయాక.. ఇండో-పాక్ పోరుకు డిమాండ్ మరింత పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. స్టేడియాలు కిక్కిరిసిపోయాయి. అయితే ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగున్న ఆసియా కప్ 2023లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆసియా కప్ 2023 లీగ్ దశలో జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు పెద్దగా అభిమానులు రాలేదు. అక్కడక్కడా స్టాండ్స్ ఖాళీగా కనిపించాయి. ఆదివారం (సెప్టెంబర్ 10) సూపర్-4 మ్యాచ్‌లోనూ అదే దృశ్యం పునరావృతమైంది. ఇండో-పాక్ మ్యాచ్‌కూ కొలంబోలోని ప్రేమదాస స్టేడియం నిండలేదు. స్టాండ్స్ ఖాళీగా ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లకూ వర్షం ముప్పు ఉండడంతో అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదని అధికారులు భావిస్తున్నారు. ఇక ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను వరుణుడు వదలలేదు. ఆసియా కప్ 2023లో ఇప్పటికే ఇండో-పాక్ మధ్య లీగ్ మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు.. ఆదివారం సూపర్-4 మ్యాచ్‌కూ అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 24.1 ఓవర్లలో 147/2తో ఉన్న దశలో భారీ వర్షం పడింది. ఆట మళ్లీ పునఃప్రారంభం కాలేదు. వర్షం తగ్గినా మైదానం ఆటకు అనువుగా లేకపోవడంతో.. రిజర్వ్ డే అయిన సోమవారానికి మ్యాచ్‌ను వాయిదా వేశారు. నేడు ఆగిన చోటి నుంచే మ్యాచ్ కొనసాగనుంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (58; 52 బంతుల్లో 10×4), రోహిత్ శర్మ (56; 49 బంతుల్లో 6×4, 4×6) హాఫ్ సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లీ (8), కేఎల్ రాహుల్ (17) క్రీజులో ఉన్నారు.
*యూఎస్ ఛాంపియన్‌గా జకోవిచ్.. మార్గరెట్ కోర్ట్ రికార్డు సమం!
సెర్బియన్ స్టార్, టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన జకోవిచ్.. టెన్నిస్‌లో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (24) రికార్డును సమం చేశాడు. యుఎస్ ఓపెన్ 2023 టైటిల్ గెలిచిన జకో.. ఈ అరుదైన రికార్డును సాధించాడు. యుఎస్ ఓపెన్ ఫైనల్లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదెవ్‌ను 6-3, 7-6(7-5), 6-3 తేడాతో చిత్తు చేశాడు. ఆదివారం జరిగిన యుఎస్ ఓపెన్ 2023 ఫైనల్ ఫోరు హోరాహోరీగా సాగుతుందని భావించినప్పటికీ.. నోవాక్ జకోవిచ్ జోరు ముందు మెద్వెదెవ్ నిలబడలేకపోయాడు. తొలి సెట్‌లో 6-3 తేడాతో మెద్వెదెవ్‌ను చిత్తు చేసిన జకోకు రెండో సెట్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఓ సమయంలో రెండో సెట్‌ను మెద్వెదెవ్ గెలిచేలా కనిపించినా.. జకో అనూహ్యంగా పుంజుకుని 7-6 తేడాతో కైవసం చేసుకున్నాడు. కీలక మూడో సెట్‌లో మెద్వెదెవ్ తేలిపోవడంతో జకోవిచ్ 6-3 తేడాతో గెలిచి టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ మూడు గంటల 17 నిమిషాల పాటు సాగింది. యూఎస్ ఓపెన్ 2021 ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించి తొలిసారిగా గ్రాండ్‌స్లామ్‌ను దక్కించుకున్న మెద్వెదెవ్.. ఈ సారి మాత్రం బోల్తా పడ్డాడు. ఈ విజయంతో జకోవిచ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక ఈ ఏడాది జకోవిచ్ జోరు కొనసాగుతోంది. నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు వెళ్లిన జకో.. ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్‌లో విజయం సాధించాడు. వింబుల్డన్‌లో మాత్రం యువ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ చేతిలో ఓడిపోయాడు.
