Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*నిర్మల్‌ జిల్లాలో కేసీఆర్‌ పర్యటన
నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. కొత్తగా నిర్మించిన ఈ కొత్త పాలనా సౌధంతో జిల్లాలో ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట లభించనున్నాయి. ఈ సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ప్రారంభించనున్నారు. నిర్మల్‌ రూరల్‌ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో సుమారు రూ.56 కోట్లతో కొత్త కలెక్టరేట్‌ను నిర్మించారు. దాదాపు 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్‌ టు విధానంలో దీనిని నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్ల కార్యాలయాలతో పాటు రెండు వెయిటింగ్‌ హాళ్లు, రెండు వీడియోకాన్ఫరెన్స్‌ హాళ్లు, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్‌ హాల్‌ను కూడా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిర్మించారు. మొదటి అంతస్థులో మంత్రి చాంబర్‌తో పాటు వివిధ శాఖల కార్యాలయాలకు అధికారులు కేటాయించారు. కలెక్టరేట్‌ను పూర్తి ఆక్సిజన్‌ జోన్‌గా రూపొందించారు. ఈ భవనంలో రెండు లిఫ్టులున్నాయి. ఇక్కడ గ్రానైట్‌ పనులు పూర్తికావడంతో సువిశాల కారిడార్లు కనువిందు చేస్తున్నాయి. ప్రహరీతో పాటు ముఖద్వార ఆర్చ్‌, సెక్యూరిటీ గార్డు గది నిర్మాణం పూర్త అయింది. అండర్‌ గ్రౌండ్‌లో 80 వేల లీటర్ల సామర్థ్యంతో సంప్‌, 20 వేల లీటర్ల సామర్థ్యంతో రెండు ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిర్మించారు. కలెక్టరేట్‌ ముందు ఆవరణలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌ సముదాయానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్తును అందించేందుకు ప్రత్యేక సబ్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు.

*రాష్ట్రంలో భగభగలే
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు సెగలు కక్కుతున్నాడు. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావానికి రాష్ట్రంలో మరోమారు తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే మంటలు మొదలవుతుండగా.. ఉక్కపోతతో వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడుతున్నారు. బయట అడుగుపెట్టాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇంటి నుంచి బయటకు రావట్లేదు. ఒకవేళ బయటకు వచ్చినా.. గొడుగు వెంట బెట్టుకుని వస్తున్నారు. లేకుంటే స్కార్ఫ్, టవల్ వంటి వాటిని ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు వినియోగిస్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువగా నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం 135 మండలాల్లో, సోమవారం 276 మండలాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. శనివారం పల్నాడు జిల్లా రావిపాడులో 45.6, గుంటూరు జిల్లా మంగళగిరి, తూర్పు గోదావరి జిల్లా పెరవలి, బాపట్ల జిల్లా వేమూరు, మన్యం జిల్లా పెదమేరంగిలో 45.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 143 మండలాల్లో వడగాడ్పులు వీచినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.

*అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం
అమెరికాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి గుర్రపు శైలేశ్ దుర్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన గత సెప్టెంబర్ లో ఉన్నత చదువుల కోసం శైలేశ్ అమెరికాకు వెళ్లారు. అక్కడ బయోమెడికల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు. అయితే న్యూ జెర్సీలో యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్ లో మాస్టర్ ఆ బయో మెడికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు శైలేష్. శనివారం శైలేష్ కారులో వెళుతుండగా న్యూజెర్సీలోని సెల్టన్ కూడలి వద్ద మరోవైపు నుంచి వచ్చిన కారు నేరుగా పెట్రోల్ ట్యాంకును ఢీకొంది. దీంతో, శైలేశ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆయన సజీవ దహనమయ్యారు. శైలేశ్ మరణంతో ఆయన స్వగ్రామం బడా భీంగల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. శైలేష్ తండ్రి గతంలో గల్ఫ్‌కు వెళ్లివచ్చారు. ఆయన తల్లి గృహిణి. శైలేశ్ కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. దీంతో శైలష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని ప్రభుత్వానికి మృతుని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

*ఒడిశా రైలు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ప్రయాణికులెవరూ లేరు
ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన, మరణించిన వారిలో ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన ప్రయాణికులెవరూ లేరని తెలంగాణ ప్రభుత్వం శనివారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒడిశా ప్రభుత్వానికి రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలకు తన సహాయాన్ని అందించింది. శుక్రవారం, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, SMVT-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పదిహేడు కోచ్‌లు పట్టాలు తప్పాయి, ఇది గత 15 సంవత్సరాలలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైల్వే ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. తాజా లెక్కల ప్రకారం, ఈ ప్రమాదంలో 288 మంది మరణించారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి సిగ్నలింగ్ వైఫల్యమే కారణమని ముందుగా చెప్పగా, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్‌లోకి ప్రవేశించి స్టేషనరీ గూడ్స్ రైలును ఢీకొట్టిందా లేదా అది మొదట పట్టాలు తప్పిందా.. లూప్ లైన్ ప్రవేశించిన తర్వాత ఆగి ఉన్న రైలును ఢీకొట్టిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదని రైల్వే అధికారులు తెలిపారు. అంతకుముందు రైలు ప్రమాదంపై కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటనగా పేర్కొంటూ, ప్రాణ నష్టం, గాయపడిన వారి పట్ల విచారం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ అమలు చేసిన యాంటీ-కొలిజన్ పరికరాల సామర్థ్యాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు ఒక ట్వీట్‌లో ప్రశ్నించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

*ప్రమాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య దాదాపు 290 మందికి పైగా చేరింది. అదే సమయంలో 1000 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొంతుదున్న బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. అయితే ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ అన్నారు. ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు. రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమన్న మోడీ.. ఈ ఘటనలో చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో ఒడిశా ప్రభుత్వం అన్ని విధాల సహకరించిందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన అదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఒడిశా ఘటనపై ప్రపంచ దేశాలకు చెందిన పలు దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.

*8 ఏళ్ల బాలికపై 80ఏళ్ల వృద్ధుడు లైంగికదాడి
కామాంధులకు వావి వరుసలు,వయస్సుతో సంబంధంలేదు.. కేవలం కామ కోరికలను తీర్చుకోవాలి.. ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాలను తీసుకొచ్చిన కూడా ఈ మృగాల్లో ఎటువంటి మార్పులు రావడం లేదు.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. 8 బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.. బాలిక తండ్రి గమనించి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనశ్యామ్ దాస్ యూపీలోని బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే పక్కన ఉన్న దేవాలయ సముదాయంలో నివసిస్తున్నాడు. ఘనశ్యామ్ దాస్ పూజలు చేసి ఆలయాన్ని చూసుకుంటారు. హమీర్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆలయ ప్రాంగణం పక్కనే గుడిసె వేసుకుని కుటుంబంతో జీవిస్తున్నాడు.. అతనికి ఇద్దరు కూతుళ్లు..ఈ క్రమంలో ఆ 80 ఏండ్ల పూజారి.. ఓ 8 ఏండ్ల చిన్నారిపై కన్నేశాడు. ఒంటరిగా ఉన్న ఆ చిన్నారికి డబ్బులు ఆశ చూపించి ఇంట్లోకి పిలిపించుకొని లైంగిక దాడి చేసేవాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక తండ్రి అడగగా..కొద్దిరోజులుగా ఘనశ్యామ్ దాస్ బాబా తనని తన ఇంటికి పిలిపించి అసభ్యకర పనులు చేసేవాడని బాధితురాలు తన తండ్రితో చెప్పింది. ప్రతిఫలంగా డబ్బులు ఇచ్చేవారు, దీంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడని వాపోయింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఘనశ్యామదాస్‌ను అరెస్టు చేశారు.నిందితుడి ఇంటి నుంచి పెద్ద ఎత్తున గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..ఈ ఘటన పై వార్తలు వైరల్ కావడంతో అతన్ని ఉరి తీయ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

*వెన్నెల కిషోర్ కు అమ్మాయిల పిచ్చి.. వాళ్ళ కాలనీలో అమ్మాయిలు
ప్రెసిడెంట్ మంచు విష్ణు, కమెడియన్ వెన్నెల కిషోర్ ల మధ్య ఒక సరదా యుద్ధం నిత్యం జరుగుతున్న విషయం తెల్సిందే. వారిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ముఖ్యంగా దూసుకెళ్తా సినిమాలో వీరి కామెడీ హైలైట్ అని చెప్పాలి. ఇక ఈ మధ్యనే వీరిద్దరి మధ్య కరెన్సీ నోట్ల గురించి ఒక చిన్న పాటి యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు.. 2 వేల నోటు బ్యాన్ చేసినప్పుడు.. కుప్పలు కుప్పలుగా రెండు వేల నోట్లకట్టలు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వెన్నెల కిషోర్ గారింటికి వెళ్ళినప్పుడు ఈ ఫోటో తీశాను.. ఇప్పుడాయన ఈ డబ్బును ఏంచేస్తారో అని రాసుకొచ్చాడు. ఇక ఈ ఫొటోకు వెన్నెల కిషోర్ ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆ తరువాత ఇదంతా మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహమని, సీరియస్ గా తీసుకోవద్దని.. అది జోక్ అని చెప్పుకొచ్చాడు విష్ణు. ఇక తాజాగా మరోసారి వెన్నెల కిషోర్ గురించి ఘాటు ఆరోపణలు చేశాడు. అంటే అవి కూడా సరదాకే అనుకోండి. గత కొన్ని రోజులుగా వెన్నెల కిషోర్ హోస్ట్ గా ఒక కపుల్ షో చేస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఈ షోకు నటుడు శివబాలాజీ, అతని భార్య మధుమిత గెస్ట్ లుగా వచ్చి సందడి చేశారు. ఇక వీరి ప్రేమ కథ గురించి చెప్పుకొచ్చారు. ఇక చివర్లో శివబాలాజీ.. మంచు విష్ణుకు కాల్ చేసి మాట్లాడాడు.. ఇక తాను వెన్నెల కిషోర్ షోలో ఉన్నాను అని చెప్పగానే.. ” వెన్నెల కిషోర్ కాలనీలో అమ్మాయిలు.. ఆయన షూటింగ్ కు వెళ్లారు అని తెలిసిన తరువాతే బయటికి వస్తారు” అని అనేశాడు. దానికి వెన్నెల కిషోర్.. మీ గురించి కాదిక్కడ నా గురించి మాట్లాడుతున్నారు అని కౌంటర్ వేశాడు. ఇక దానికి నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావ్ అని విష్ణు అనడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఇక దీంతో వెన్నెల కిషోర్ కు అంత అమ్మాయిల పిచ్చి ఉందా..? ఆయన వెళితే కానీ కాలనీలోని అమ్మాయిలు బయటికి రారా.. ఏయ్ ఏయ్ కిషోర్ అన్నా అంటూ సరదాగా ఆట పట్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version