Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*ఈనెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం
ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానున్నారు. ఈనెల 3న (ఆదివారం) ఎన్నికల ఫలితాలు రానుండగా.. మంత్రి వర్గ భేటీ ఏర్పాటు చేశారు. ఫలితాలు వెలువడే మరుసటి రోజే ఈ సమావేశం నిర్వహిస్తుండటంతో భేటీపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

*ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ.. వెంటనే నీరు తీసుకోవడం ఆపండి..
ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. వెంటనే సాగర్ ఉద్రిక్తతకు తెరదించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల విషయంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.. అయితే వెంటనే నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది. ఏపీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తమకు పిర్యాదు చేసిందని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. ఏపీ సాగు నీరు కావాలని తమను కోరలేదని లేఖలో కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. అక్టోబర్‌ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో పేర్కొ్న్నారు. నవంబర్ 30 తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేసింది. అయితే ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి. కాగా.. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులతో పాటు రాష్ట్రంలోని నీటిపారుదల అధికారులపై తెలంగాణ ఎస్పీఎఫ్‌ను ప్రయోగించారు. అర్థరాత్రి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని, ఏపీ పోలీసులు అనుమతి లేకుండా డ్యాం వద్దకు వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్ పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అటే ఏపీ వైపు పోలీసులు భారీగా మోహరించారు. సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేఆర్ఎంబీ అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

 

*పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఎల్లుండికి తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని పలు చోట్ల ఆది, సోమ వారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. తుపాను తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పంట కోతలపై అవగాహన కల్పించాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించింది. అలాగే, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలను కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గత వారం రోజులుగా ఏజెన్సీలో చలి ప్రభావం పెరుగుతోంది. చింతపల్లిలో కనిష్ఠంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళల్లో కాఫీ తోటలు, పంట పొలాలకు వెళ్లే కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వణుకుతూ ప్రయాణం చేస్తున్నారు. మరో వైపు, తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. గత రెండు రోజులుగా దంచికొడుతున్న వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై ప్రాంతాలకు అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అటు, బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ చెబుతోంది. రెండ్రోజుల్లో అది తుపానుగా మారొచ్చని భారత వాతావరణ అధికారులు అంచనా వేశారు.

 

*తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించారు. కాగా.. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్, ఫర్నిచర్, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అదే విధంగా మంటలు చెలరేగినప్పుడు కార్యాలయం కింద ఉన్న రెండు ఇన్నోవా కార్ల పై అగ్ని కీలలు పడటంతో అవి కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలో.. ఎన్నికల కోడ్ ఉల్లఘించిన పర్యాటక శాఖ ఎండీని మనోహర్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా.. ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే.. పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రమాద స్థలాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించి, పరిశీలించారు. ఈ అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉందని ఆయన ఆరోపించారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని కీలకమైన ఫైల్స్ ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి.. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందనే కారణం వల్లే ఈ ప్రమాదాన్ని సృష్టించారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి బాగోతం బట్టబయలు కాకుండా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల పర్యాటక శాఖ ఎండీ మనోహర్.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊడిగం చేయడం వల్లే ఎన్నికల కమిషన్ ఆయన్ను సస్పెండ్ చేసిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రమేయం పై విచారణ చేయాలి.. ఈ ఘటనపై హైలెవల్ ఎంక్వయిరీ చేయించాలి… అప్పుడే వాస్తవాలు బయటకి వస్తాయని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.

 

*ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. వార్షిక పరీక్షల ఫీజు గడువు పొడిగింపు..
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. జరగబోయే వార్షిక పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వివరాల లోకి వెళ్తే.. ఏపీలో ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 2024 మార్చిలో వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు 2024 మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు డిసెంబరు 5 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు 2024 మార్చిలో జరగబోయే వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఉన్న గడువు నవంబరు 30వ తేదీతో ముగిసిందని.. ఈ నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం ఫీజు చెల్లించాల్సిన గడువును మరో 5 రోజులు పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుందని.. కావున విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఎలాంటి ఆలస్యం రుసుం చెల్లించకుండానే ఎగ్జామ్ ఫీజులు చెల్లించవచ్చని ఆయన తెలిపారు. కాగా డిసెంబరు 5వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించని యెడల రూ.1000 ఆలస్య రుసుంతో డిసెంబరు 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉందని వెల్లడించారు. కనుక ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుం చెల్లించకుండానే డిసెంబరు 5వ తేదీ వరకు వార్షిక పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించు కోవాల్సిందిగా ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ సూచించారు.

 

*జగన్ ప్రభుత్వంలో దళితుల తలరాతలు మారాయి.
పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందిస్తుంటే చంద్రబాబుకు కనిపించటం లేదని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఏదో విధంగా ఎస్సీలను మోసం చేయాలనే దుష్ట ఆలోచన చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే అన్ని వర్గాలను మోసం చేశాడని.. చంద్రబాబు హయాంలో దళితులు అలో లక్ష్మణ అంటూ బతికారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో దళితుల తలరాతలు మారాయని.. గౌరవంతో బతుకుతున్నామని వారు అంటున్నారని మంత్రి తెలిపారు. దళిత క్రైస్తవులు చంద్రబాబుకు కనిపించారా అంటూ ప్రశ్నించారు. దళిత క్రైస్తవులను దళితులకు అందే హక్కులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసిన నాయకుడు జగన్ అంటూ మంత్రి తెలిపారు. రాజధాని ప్రాంతంలో పేదవారికి ఇళ్ళ స్థలాలు ఇస్తే అడ్డుకున్నది ఎవరంటూ మంత్రి ప్రశ్నించారు. పేదవారికి ఇళ్ళ స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇన్‌బాలెన్స్ వస్తుందని చంద్రబాబు కోర్టుకు ఎక్కలేదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. అంబేద్కర్ భావజాలాన్ని అణగదొక్కాలని చూసింది చంద్రబాబు అంటూ ఆరోపించారు. ప్రపంచం గర్వించే విధంగా విజయవాడలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు సీఎం జగన్ అని మంత్రి వెల్లడించారు. చంద్రబాబు హయాంలో జరిగిన కారంచేడు, నీరుకొండ ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు. చంద్రబాబు హయాంలో దళితుల మీద దాడుల్లో రాష్ట్రం దేశంలోనే నాల్గవ స్థానంలో ఉండేదని.. జగన్ సామాజిక సాధికారతకు ప్రయత్నం చేస్తుంటే కనిపించటం లేదా అంటూ ప్రశ్నించారు. పేద వాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం చంద్రబాబు మానాలని హితవు పలికారు. దళితులకు మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.

 

*ఏపీవ్యాప్తంగా నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు
ఏపీవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆధార్ కేవైసీ రిజిస్ట్రేషన్ సమయంలో ఓపెన్ అవకపోవటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ముందు జనాలు గంటల తరబడి వేచి చూశారు. ఉదయం నుంచి వెయిట్ చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి వినియోగదారులు వెళ్లిపోయారు. ఇవాళ రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇదే సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. సర్వర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.

 

*ఖలిస్తానీ పన్నూ హత్యకు కుట్ర.. భారత్‌కి సీఐఏ చీఫ్‌ని పంపిన బైడెన్..
మొన్నటి వరకు ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా-ఇండియాల మధ్య వివాదంగా మారితే.. ప్రస్తుతం మరో ఖలిస్తానీ టెర్రరిస్ట్, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నం ఇప్పుడు భారత్-అమెరికాల మధ్య వివాదంగా మారింది. పన్నూను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు, ఆ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ హత్యాయత్నంలో భారత్ ప్రమేయం ఉందని అమెరికా నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికన్ పౌరుడైన పన్నూను అమెరికా గడ్డపైనే హతమార్చేందుకు ప్రయత్నించారనే విషయాన్ని అక్కడి బైడెన్ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. ఈ కేసులో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని చెక్ రిపబ్లిక్‌ దేశంలో అమెరికా అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిఖిల్ గుప్తాకు, భారత ప్రభుత్వ ఉద్యోగి సహకరించాడని యూఎస్ న్యాయశాఖ అభియోగపత్రాలు పేర్కొన్నాయి. ఆ భారత ఉద్యోగిని cc1 అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. ఇతనే గుప్తాకు డైరెక్షన్స్ ఇచ్చాడని అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే రెండు దేశాల మధ్య ఏర్పడిన ఈ వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన గూఢచారి సంస్థ సీఐఏ చీఫ్ విలియం బర్న్స్‌ని భారత్‌కి పంపినట్లు రాయిటర్స్ నివేదించింది. పన్నూ హత్యలో భారత ప్రమేయం ఉందని వస్తున్న నేపథ్యం ఆయన భారతదేశంలోని అత్యున్నత స్థాయిలో చర్చించడానికి, విచారణ కోసం భారత్ వస్తున్నట్లు తెలుస్తోంది. సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ ఈ ఏడాది ఆగస్టులో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (R&AW) చీఫ్ రవి సిన్హాతో భేటీ అయి.. భారతదేశం దర్యాప్తు చేసి బాధ్యులు జవాబుదారీగా ఉండాలని, మరోసారి ఇలాంటివి జరగకూడదని హమీ ఇవ్వాలని కోరినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. జూలై 2023 చివర్లోనే ఈ కుట్ర వెలుగులోకి వచ్చినట్లు యూఎస్ అధికారులు చెబుతున్నారు. దీనిపై భారత్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీ20 సదస్సులో ప్రధాని మోడీతో జోబైడెన్ సమావేశం జరిగిన సమయంలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తినట్లు తెలుస్తోంది.

 

*ఇజ్రాయిల్, హమాస్‌ మధ్య ముగిసిన స్వాప్ డీల్.. పునఃప్రారంభమైన వార్..
ప్రపంచ దేశాల నేతృత్వంలో ఇజ్రాయిల్ అలానే హమాస్‌ తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి. కాగా ఈ తాత్కాలిక ఒప్పందం వారం రోజుల తరువాత ఈరోజు ముగిసింది. కాగా ఒప్పందం ముగిసిన క్షణాలలోనే ఇజ్రాయిల్ హమాస్ పైన ఇజ్రాయిల్ దాడులను పునః ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని.. ఈ నేపథ్యంలో యుద్ధం మళ్లీ ప్రారంభమైందని పేర్కొన్నారు. కాగా యుద్ధం పునః ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే మరణాలు నమోదైయ్యాయి అని పాలస్తీనా ఆరోగ్య శాఖా అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం ప్రకారం.. ఇరుదేశాల మధ్య సంధి ముగిసిన మొదటి 90 నిమిషాలలో ఆటోమేటిక్ ఆయుధాలు కాల్పుల జల్లును కురిపించాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతం పేలుళ్ల శబ్దాలతో ఉల్లిక్కి పడింది. కాగా గాజా లోని హమాస్ లక్ష్యాలపై ఫైటర్ జెట్‌లు ప్రస్తుతం దాడి చేస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అలానే దక్షిణ గాజా లోని రఫా లోని అల్-నజర్ ఆసుపత్రి డైరెక్టర్ మార్వాన్ అల్-హమ్స్, ఇజ్రాయెల్ ఉత్తర భూభాగాన్ని విడిచిపెట్టమని హెచ్చరించారు. దీనితో చాలా మంది పాలస్తీనియన్లు అక్కడి నుండి పారిపోయారు. కాగా ఈ దాడుల్లో మొదటి 60 నిమిషాల్లో నలుగురు చిన్నారులతో పాటుగా మొత్తం 9 మంది మరణించారని తెలిపారు. కాగా యుద్ధం తిరిగి ప్రారంభమైన గంటలో గాజా సమీపం లోని అనేక ప్రాంతాల చుట్టూ సంభావ్య క్షిపణి కాల్పుల హెచ్చరిక సైరన్‌లు వినిపించాయని.. ఈ నేపథ్యంలో పాఠశాలలను మూసివేయడంతో సహా ఆ ప్రాంతంలో భద్రతా చర్యలను పునఃప్రారంభిస్తున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.

Exit mobile version