Site icon NTV Telugu

Top Headlines@1PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
గద్వాల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే హైకోర్టు తీర్పుపై కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం అందించారని కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అంతేకాదు.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే హైకోర్టు తీర్పుపై కృష్ణమోహన్‌రెడ్డి సుప్రీంను ఆశ్రయించాగా.. ఈ క్రమంలో ఇవాళ ( సోమవారం ) సుప్రీం కోర్టులో బండ్ల పిటిషన్‌పై విచారణ జరిగింది. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు తెలిపింది. ఇక, అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారంటూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికపై హైకోర్టులో డీకే అరుణ పిటిషన్‌ దాఖలు చేయగా.. అయితే.. ఎన్నికల అఫిడవిట్ లో బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పకపోవడం తన తప్పని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఒప్పుకున్నారు. ఆ ఖాతాలు మాత్రం తన భార్యవని, అవి సేవింగ్స్‌ ఖాతాలని తన తరపు న్యాయవాది ద్వారా బండ్ల వాదనలు వినిపించారు. ఇక.. వ్యవసాయ భూమిని 2018 ఎన్నికలకు ముందే అమ్మివేశాను.. దానివల్ల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం పడలేదని కోర్టుకు కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. అయితే.. వివరాలు వెల్లడించకపోవడం ఖచ్చితంగా చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని డీకే అరుణ తరఫున న్యాయవాది కోర్టులో వాదించారు. ఇక, ఇప్పటికే డీకే అరుణను కేంద్ర ఎన్నికల కమిషన్ ఎమ్మెల్యేగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.

 

*ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాలు..
ఏపీలోని నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది సర్కార్.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు..ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఏపిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలని నిర్ణియంచారు. ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఈ నియామక ప్రక్రియను నిర్వహించనుంది.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీ అభ్యర్థులు-42 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాలు, దివ్యాంగులు 52 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాలలోపు ఉండాలి.. ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసేవారు. ఎంబీబీఎస్ మెరిట్, ఇంటర్న్‌షిప్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇకపోతే ఈ పోస్టులకు ధరఖాస్తూ చేసుకొనేవారు ముందుగా దరఖాస్తు ఫీజు రూ.1000. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500 గా నిర్ణయించారు.. ఇకపోతే అభ్యర్ధులు ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 13 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు ఆఖరి తేదీ సెప్టెంబరు 24గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్.. https://dme.ap.nic.in/ పరిశీలించగలరు.. దరఖాస్తుల ను ఈ నెల 24 సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు.. అప్లై చేసుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు.

 

*చాలా స్కిల్డ్‌గా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ చేశారు..
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. స్కిల్‌ స్కామ్ పాత్రధారి, సూత్రధారి చంద్రబాబేనని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు తన అధికారాన్ని దోపిడీ కోసమే ఉపయోగించుకున్నారని విమర్శించారు. అధికారాలున్నాయి కాబట్టే కోర్టు రిమాండ్‌కు పంపిందని తెలిపారు. స్కిల్‌ స్కామ్‌ జరగలేదని, తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పగలిగారా అంటూ మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబు లాయర్లు కుంటిసాకులపైనే వాదించారని అన్నారు. చంద్రబాబు దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. బోగస్‌ కంపెనీలతో దోచుకున్న కరప్షన్‌ కింగ్‌ అని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయాడని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై కక్షసాధించే అవసరం తమకు లేదని తెలిపారు. వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టింది ప్రజల కోసమని పేర్కొన్నారు. పక్కా ఆధారాలతో దొరికితే కొందరు గగ్గోలు పెడుతున్నారని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీ అధికారులు చంద్రబాబుకు లేఖ రాసిన మాట నిజం కాదా అంటూ మంత్రి ప్రశ్నించారు. స్కిల్‌ స్కామ్‌లో ఈడీ విచారణ జరిపింది నిజం కాదా అంటూ ప్రశ్నలు సంధించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసుకొని ఇన్నాళ్లూ తప్పించుకున్నారన్నారు. దత్తపుత్రుడు చంద్రబాబు అవినీతిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నలు గుప్పించారు టీడీపీ నేతలు, పవన్‌ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తప్పు చేసి ఇంకా బకాయిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ బంద్‌ను ప్రజలు పట్టించుకోలేదని మంత్రి రోజా చెప్పారు.. సాక్ష్యాధారాలతో దొరికిపోయి బంద్‌కు పిలుపునిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ పేరు చెబితే ఎన్నో పథకాలు గుర్తొస్తాయన్నారు. చంద్రబాబు పేరు చెబితే అన్ని స్కాంలే గుర్తొస్తాయన్నారు. చాలా స్కిల్డ్‌గా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ చేశారన్నారు. అమరావతిలో భూముల్ని దోచుకున్నారని ఆమె విమర్శించారు. పోలవరం, పట్టిసీమ వరకు అవినీతి చేశారని, ప్రజల నెత్తిన టోపీ పెట్టి నిధులు దోచేశారన్నారు. కక్షసాధింపులకు పాల్పడిన చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు సానుభూతి రాజకీయాలు ప్రజలు నమ్మరని ఆమె వ్యాఖ్యానించారు. జనసేన పార్టీని పవన్‌ కళ్యాణ్ చంద్రసేనగా మార్చేశారని, అవినీతికి పాల్పడిన వ్యక్తికి ఆయన మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ బంద్‌కు సపోర్టు చేయకున్నా పవన్‌ ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు పవన్‌ పవర్‌ స్టార్‌ కాదు.. ప్యాకేజ్‌ స్టార్‌ అంటూ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతిపై గతంలో పవన్‌ మాట్లాడటం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ప్యాకేజీ కోసమే పవన్‌ చంద్రబాబుకు మద్దతిచ్చారని ఆమె పేర్కొన్నారు.

*చంద్రబాబు ఎన్నో స్కామ్ లు చేశారు..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకి వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సంకల్పంతో పని చేసిన, బలమైన, పట్టుదలతో పనిచేసిన అధికారి చేతిలో చంద్రబాబు దొరికిపోయారని ఆయన తెలిపారు. 1977 నుంచి చంద్రబాబు స్కాములు చేశారన్న నానీ.. ఇన్నేళ్లూ పట్టుబడకుండా నక్కజిత్తుల స్టేలు తెచ్చుకుంటూ కాలం గడిపారని అన్నారు. చంద్రబాబుకి ప్రతీ వ్యవస్థలో తన మనుషులు, స్లీపర్ సెల్స్ లా ఉన్నారన్న మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. అవినీతికి పాల్పడుతూ.. సమాజానికి చంద్రబాబు నీతులు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-15లో కూడా తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకు ఓటుకు లంచం ఇస్తూ.. ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని తెలిపారు. ఆ కేసులో 10 ఏళ్ల పాటూ.. ఏపీ ప్రజలు అనుభవించాల్సిన హైదరాబాద్‌ని కేసీఆర్‌కి అమ్మేసి, చంద్రబాబు డ్రామా ఆడారు. గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మాత్రం పాపం పండిందని ఆయన పేర్కొన్నారు. విద్యను నేర్చించే పేరుతో రూ. 371 కోట్లను చంద్రబాబు దొచేశారని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు. ఈ కేసు ఒక తీగ మాత్రమే.. ఇంకా డొంకంత కదిలి తీరాల్సి ఉంది. ఖచ్చితంగా కదులుతుందని ఆయన అన్నారు. పవన్, లెఫ్ట్ పార్టీలు, పురంధేశ్వరి.. చంద్రబాబును కాపాడటమే పనిగా పెట్టుకున్నారని పేర్నినాని అన్నారు. నన్ను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు రెండు రోజుల ముందే ఎలా చెప్పారు.. సీఐడీ అరెస్ట్ చేస్తుందనే సమాచరం ఆయనకు ఉంది.. కాల్వ శ్రీనివాసులు, ఇతర నేతలంతా రాత్రంత్రా నంద్యాలలోనే ఎలా ఉన్నారని ప్రశ్నించారు. 3 గంటల పాటు బస్సు డోర్ కొడితే నిద్ర పోతున్నట్లు నటిస్తున్న చంద్రబాబు ఎందుకు బయటకు రాలేదు.. స్కార్ జరుగలేదని ఎక్కడ ఎవరు చెప్పారు కానీ.. అరెస్ట్ మాత్రం అన్యాయం అంటారు ఇదేక్కడి వింత ప్రచారమో అర్థం కావడం లేదని పేర్నినాని అన్నారు. సీఐడీ అధికారులు నంద్యాల నుంచి హెలికాప్టర్‌లో తీసుకెళ్తామంటే దానికి చంద్రబాబు ఒప్పుకోలేదు.. కాన్వాయ్‌లో ఎందుకు వెళ్లారని పేర్నినాని ప్రశ్నించారు. దీన్ని కక్షసాధింపు అంటే ఎలా అని ఆయన నిలదీశారు. నంద్యాల నుంచి ఎక్కడా ఇబ్బంది లేకుండా చంద్రబాబును విజయవాడకు తీసుకొచ్చారని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే పడని చంద్రబాబు.. సీఐడీ ప్రశ్నించినప్పుడు మాత్రం ఏమో, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ ఎన్టీఆర్ సినిమాల్లో డైలాగ్స్ మాత్రం చెప్పారని పేర్నినాని సెటైర్ వేశారు.

*చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో రాజకీయ కోణం లేదు..
చంద్రబాబు అరెస్టు, రిమాండ్ విషయంలో రాజకీయ కోణం లేదని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ప్రజాసేవలో ఉన్నవాళ్లు పాలిటిక్స్ అంటే పీపుల్స్ మేనేజ్మెంట్ కాదు.. సర్వింగ్ టూ పీపుల్ అనే కాన్సెప్ట్ వంట బట్టించుకుంటే బాగుండేది.. ఆ పాయింట్ మిస్ అయ్యారన్నారు. ఆయన బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్ళటం కాదు.. తప్పు జరిగిందా లేదా అనేదే ముఖ్యమన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మేనిఫెస్టోలో ఉన్న ప్రధాన అంశాన్ని ముడుపులు తీసుకోవటానికి వాడుకున్నారని స్పష్టమైందన్నారు.స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ అంశం చాలా చిన్నదని.. ఇప్పుడు చూసింది గోరంత.. చూడాల్సింది కొండంత అని పేర్కొ్న్నారు. అమరావతి, టిడ్కో హౌస్ స్కాం లాంటివి చాలా ఉన్నాయన్నారు. చంద్రబాబు అయినా, లోకేష్ అయినా అవినీతికి పాల్పడితే వదిలేదే లేదన్నారు. ప్రతీ స్కాం వెలికి తీస్తామన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందన్నారు. బందులతో నానా యాగీ చేయటం అనేది టీడీపీ కేడర్ కూడా నమ్మలేని పరిస్థితిలో ఉండటం వల్ల సరిగ్గా జరగటం లేదన్నారు.

 

*తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాల్లో భారీ వానలు
తెలంగాణలో వచ్చే ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇక, నిన్న (ఆదివారం) హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి నగరం మేఘావృతమై ఉంది. ఒక్కసారిగా భారీ వర్షంతో జనం వణికిపోయారు. రెండు గంటలకు పైగా వర్షం పడింది. భారీ వర్షంతో నగరంలోని రోడ్లన్ని జలమయం అయ్యాయి. పంజాగుట్ట, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, గచ్చిబౌలి లాంటి ప్రధాన కూడళ్లలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. లోతట్టు ప్రాంతాలు మరోసారి మునిగిపోయాయి. మరోవైపు, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, గుంటూరు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు చెప్పారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు పడే అవకాశం ఉందన్నారు. నిన్న (ఆదివారం) పార్వతీపురం మన్యం, అనంతపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు.

*మరో సేల్‌ను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్‌.. వాటిపై 75 శాతం డిస్కౌంట్స్!
గత కొన్ని నెలలుగా ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వరుస సేల్‌లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’, ‘బిగ్ బిలియన్ డేస్’ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో సేల్‌ను ప్రకటించింది. ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ (Flipkart Grand Home Appliances Sale 2023)ను మరోసారి ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు కొనసాగనుంది. 7 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో కస్టమర్లకు ఆఫర్ల జాతర ఉంటుంది. ఇదివరకు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సేల్ ఆగష్టు 14 నుంచి 18వ తేదీ వరకు జరిగింది. ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ 2023లో భాగంగా టీవీ, హోమ్ అప్లియెన్సెస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. 4K స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్స్, ఏసీ, గీజర్, వాషింగ్ మిషన్స్, ఫాన్స్, హీటింగ్ మరియు కూలింగ్ అప్లియెన్సెస్, హోమ్ అప్లియెన్సెస్, మైక్రో వేవ్ ఓవెన్స్ లాంటి వాటిపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి. హోమ్ అప్లియెన్సెస్ కొనాలనుకునేవారికి ఈ సేల్ బాగా ఉపయోగపడనుంది. ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ 2023లో ఫ్లిప్‌కార్ట్‌ అందించే డిస్కౌంట్స్ సహా భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ, వన్ కార్డ్, కొటాక్ మహీంద్రా కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. దాదాపుగా 10 శాతం బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. దాంతో మీరు మొత్తంగా 85 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్‌లో భారీ బడ్జెట్ వస్తువులు కూడా సగం ధర కంటే తక్కువగా అందుబాటులో ఉంటాయి.

*రిజర్వ్‌ డేకు కూడా వర్షం ముప్పు!
ఆసియా కప్‌ 2023ని వర్షం వెంటాడుతూ ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో వర్షం కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దు కాగా.. సూపర్‌-4 మ్యాచ్‌లను కూడా వరుణుడు వదలడం లేదు. సూపర్‌-4లో భాగంగా ఆదివారం జరగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌ డే (సెప్టెంబర్‌ 11)కు వాయిదా పడింది. సోమవారం మిగిలిన మ్యాచ్ జరగనుంది. అయితే రిజర్వ్‌ డే రోజున మ్యాచ్‌ సాఫీగా సాగుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొలొంబో వాతావరణ శాఖ ప్రకారం సోమవారం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగే ఆర్ ప్రేమదాస స్టేడియంలో వర్షం కురిసే అవకాశం ఉంది. 99 శాతం​ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఓ సమయంలో చిరు జల్లులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉందట. దాంతో రిజర్వ్‌ డే రోజున మ్యాచ్‌ సాఫీగా సాగే అవకాశాలు తక్కువ. సోమవారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యమైతే.. పాక్ బ్యాటింగ్ చేయనుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ 24 ఓవర్లు ఆడేసింది. డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం.. ఫలితం తేలాలంటే.. ఒక్కో జట్టు 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక భారత్‌ను ‘రిజర్వ్‌ డే’ బ్యాడ్‌ లక్‌ కలవరపెడుతుంది. రిజర్వ డే రోజు పాక్‌పై భారత్‌ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. మరోవైపు 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ చివరిసారిగా ‘రిజర్వ్‌ డే’ రోజున మ్యాచ్‌ ఆడింది. మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ సెమీ ఫైనల్స్‌లో కివీస్ చేతిలో భారత్‌ ఓడిపోయింది. దాంతో రిజర్వ డే బ్యాడ్‌ లక్‌ రోహిత్ సేనకు కలవరపెడుతోంది. భారత్ ఈ సమస్యను అధిగమించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version