ఘనంగా సంక్రాంతి సంబరాలు.. గోపూజ చేసిన సీఎం జగన్ దంపతులు
ముత్యాల ముగ్గులు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తుంది. అయితే, ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తొలుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతిమణీ వైఎస్ భారతి సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో పండుగ సంబరాలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత గంగిరెద్దులకు సారెను సమర్పించారు. అనంతరం గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. ఇక, ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఈ సంక్రాంతి వేడుకల్లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు జరిగాయి.
మరోసారి ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే
అమరావత రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లడుతూ.. టీడీపీ- జనసేన కలిసి సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. మా ప్రభుత్వం వచ్చాక అమరావతిని బంగారు రాజధానిగా నిర్మించుకుందామని తెలిపారు. జై అమరావతి, జై ఆంధ్రా అనే నినాదంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది అని ఆయన చెప్పారు. మరోసారి వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే.. రాజధాని రైతులకున్న కీడు, పీడ తొలగిపోయే రోజులు దగ్గర ఉన్నాయి.. రాజధాని రైతులు పడ్డ కష్టం ఇబ్బందులను తీర్చడానికి టీడీపీ – జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రైతుల కష్టాన్ని మేం తీరుస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటూ అదే వర్గాలను మోసం చేసింది వైసీపీ.. ముళ్ల కంచెలు వేసినా దాటుకుని రాజధాని రైతుల వద్దకు వచ్చాం.. మరోసారి వైసీపీ వస్తే రాజధానికి భవిష్యత్ చీకటేనని ఆయన వెల్లడించారు. అమరావతి వేదిక నుంచి తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.. వచ్చే ఏడాది జనసేన – టీడీపీ ప్రభుత్వంలో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుందాం.. ఈ సంక్రాంతి మార్పుతో వచ్చిన విప్లవ కాంతి.. క్రాంతితో కూడుకున్న కాంతి రావాలని ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇవాళ్టి నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ స్టార్ట్.. లెక్క పెట్టుకోండి
అమరావత రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇవాళ్టీ నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి అని పేర్కొన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టింది.. అమరావతే మన రాజధాని.. త్వరలో ఇక్కడ నుంచే పేదల పాలన మొదలు కాబోతోంది.. ఇక్కడే రాజధాని ఉంటుందని టీడీపీ – జనసేన పార్టీలు భరోసా ఇస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. సంక్రాంతి రోజున అంగన్వాడీలను రోడ్డున పడేశాడు.. యునతకు ఉపాధి కల్పించేలా టీడీపీ – జనసేన పార్టీ భరోసా ఇస్తుంది.. ప్రతి ఒక్కరికీ అండగా నిలిచే బాధ్యత మా రెండు పార్టీలదే.. కరవు మండలాలను కూడా పట్టించుకోకుండా కేంద్ర సాయం కూడా రాకుండా చేస్తోంది ఈ ప్రభుత్వం అని చంద్రబాబు అన్నారు. చీకటి జీవోలను మంటల్లో వేశామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. జగన్ అహంకారాన్ని కూడై మంటల్లో వేశాం.. భస్మాసురునికి వరం ఇచ్చినట్టు జగనుకు ప్రజలు ఓటేశారు.. పోలీసులను నేనేం అనలేను కానీ.. ప్రభుత్వం ఒత్తిడి వల్ల రాక్షసుల్లా పోలీసులు వ్యవహరించారు.. ఇదే పోలీసులు మీకు జిందాబాద్ కొట్టే పరిస్థితి వస్తుంది అని ఆయన అన్నా. ఏపీలో జరుగుతున్న అరాచరాలను కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.. ప్రపంచంలో మూడు రాజధానులనేవి ఎక్కడా లేదు అని చంద్రబాబు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని అన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్మదర్శి, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని హాట్ కామెంట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చని అన్నారు. కేసీఆర్ కి ప్రజాస్వామ్యం పై నమ్మకంలేదు… కుట్రలకు కేరాఫ్ కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పోరాటం తర్వాత… ముందు రాష్ట్రంలో బీఆర్ఎస్ ని బొంద పెడదామన్నారు. కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ వాళ్లు ఓ కన్నేసి ఉంచండి అంటూ హాట్ కామెంట్.. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ ఎక్కువ సంఖ్యలో ఎంపీలు గెలవాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావలన్న బీజేపీ గెలవాలన్నారు. యాదాద్రిని వ్యాపార కేంద్రంగా మార్చింది కేసీఆర్ అంటూ మండిపడ్డారు. యాదాద్రిలో కేసీఆర్ తన బొమ్మ చెక్కించుకున్నాడని గుర్తుచేశారు. మోడీ అయోధ్య లో తన బొమ్మ కానీ అయోధ్య చుట్టుపక్కల భూములు కొనుక్కోలేదని తెలిపారు.
ఢిల్లీ టు దావోస్ వయా మణిపూర్.. సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదిరోజుల పాటు బిజీ బిజీగా ఉండనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం శంషాబాద్ విమానశ్రయం నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ కొద్దిసేపటి క్రితం ఢీల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో పార్టీ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. అనంతరం రాహుల్ గాంధీతో మణిపూర్ వెళ్లి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆతరువార తిరిగి ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటారు. నాలుగైదు రోజులు అక్కడే ఉండి మరో మూడు రోజులు లండన్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనున్న విషయం తెలిసిందే.. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, బహుళజాతి కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతున్నారు. ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదానీ… వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు భారత్ నుంచి హాజరుకానున్నారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని తమ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్‌కు మిలింద్ దేవరా రాజీనామా.. నేడు శివసేనలో చేరిక!
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆదివారం ఉదయం సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తికి గురైన మిలింద్.. ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో నేడు మిలింద్ దేవరా చేరనున్నారని సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ప్రారంభ వేళ మిలింద్ పార్టీని వీడటం ఎదురుదెబ్బే అని చెప్పాలి. ‘ఈరోజుతో నా రాజకీయ ప్రయాణంలో ఓ ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి ఉన్న 55 ఏళ్ల అనుబంధం ముగిసింది. ఇన్నేళ్లు నాకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, సహచరులకు ధన్యవాదాలు’ అని మిలింద్ దేవరా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మురళీ దేవరా కుమారుడే ఈ మిలింద్. కాంగ్రెస్ పార్టీలోని యువ నాయకుల్లో మిలింద్ ఒకరు. దక్షిణ ముంబై లోక్‌సభ స్థానం నుంచి 2004, 2009లో విజయం సాధించారు. 2012లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే 2014, 2019లో శివసేన నేత అరవింద్ సావంత్ చేతిలో ఓటమి పాలయ్యారు.
74శాతం ముస్లింలు రామ మందిర నిర్మాణం పట్ల సంతోషంగా ఉన్నారు.. సర్వే నివేదిక
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో అనుబంధంగా ఉన్న ముస్లిం రాష్ట్రీయ మంచ్ (MRM), దేశంలోని చాలా మంది ముస్లింలు రామ మందిరానికి అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. రాముడు “అందరికీ” చెందినవాడని వారు విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని ఒక చారిటబుల్ ట్రస్ట్‌తో కలిసి నిర్వహించిన సర్వే ఆధారంగా, రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న ఉలేమాలు, మౌలానాలు, ప్రతిపక్ష నాయకులను మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు ‘బహిష్కరించాలని’ కోరుకుంటున్నారని ముస్లిం మంచ్ పేర్కొంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పట్ల 74 శాతం మంది ముస్లింలు సంతోషంగా ఉన్నారని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ నేతృత్వంలోని ఎంఆర్‌ఎం సర్వే నివేదికను ఉటంకిస్తూ పేర్కొంది. MRM చేపట్టిన సర్వేలో 74 శాతం ముస్లింలు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా రామ మందిరానికి అనుకూలంగా చెప్పారు. 72 శాతం మంది ముస్లింలు మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. 26 శాతం మంది ముస్లింలు మోడీ ప్రభుత్వంపై ఎలాంటి విశ్వాసం వ్యక్తం చేయలేదని, మత ఛాందసవాదం గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. “రాముడు విశ్వాసానికి సంబంధించిన ప్రశ్న అని ఈ వ్యక్తులు అంగీకరించారు, అయితే వారు రామ మందిరానికి వెళతారని వారు అనుకోరు లేదా బిజెపి ప్రభుత్వాన్ని విశ్వసించరు” అని MRM పేర్కొంది.
ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి.. విజేతగా సన్‌రైజర్స్ హైదరాబాద్!
ఇండియన్ పతంగ్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో హైదరాబాద్ పైచేయి సాధించింది. దాంతో ఇండియన్ పతంగ్ లీగ్ 2024 విజేతగా హైదరాబాద్ నిలిచింది. మకర సంక్రాంతి మరియు లోహ్రీ శుభ సందర్భంగా ప్రముఖ క్రీడా ఛానెల్ ‘స్టార్ స్పోర్ట్స్’ గాలిపటాల పోటీని అహ్మదాబాద్‌లో నిర్వహించింది. ఈ పోటీలో ఐపీఎల్ జట్ల అభిమానులు పోటీపడ్డారు.ఇక్కడ విశేషం ఏంటంటే.. 2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్‌లో బెంగళూరు, హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఐపీఎల్ 2024 మార్చి 24 నుంచి ఆరంభం కానుందని తెలుస్తోంది. షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే షెడ్యూల్‌పై కసరత్తు మొదలెట్టిందట. గత డిసెంబర్‌లో ఐపీఎల్ 2024కు సంబందించిన వేలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ వేలంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగాలను కొనుగోలు చేసింది. వేలంలో ఆస్ట్రేలియా పేసర్‌ను 20.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం గమనార్హం. ఇప్పటికే జట్టులో ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిక్ క్లాసెన్ లాంటి స్టార్స్ ప్లేయర్స్ ఉన్నారు. మరోవైపు వేలంలో బెంగళూరు కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంది. వేలానికి ముందు ఏస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, స్పిన్నర్ వనిందు హసరంగాలను విడుదల చేసింది. వేలంలో మిచెల్ స్టార్క్ కోసం వెళుతుందనుకున్నా అది జరగలేదు. అల్జారీ జోసెఫ్ కోసం 11.50 కోట్లు ఖర్చు పెట్టింది. విదేశీ పేసర్‌లుగా లాకీ ఫెర్గూసన్, టామ్ కుర్రాన్‌లు ఉన్నారు. బెంగళూరు ఇంకా టైటిల్ గెలవకపోవడానికి కారణం బలహీనమైన బౌలింగ్ అని నిపుణులు అంటున్నారు.
“రాజా సాబ్” కోసం భీమవరంలో భారీ డిజిటల్ కటౌట్..
భీమవరం… ఉప్పలపాటి ప్రభాస్ రాజు అడ్డా. ప్రభాస్ నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ అప్డేట్ బయటకి వచ్చినా భీమవరం దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఇలాంటిదే సంక్రాంతి పండగ రోజున జరగబోతుంది. జనవరి 15న సంక్రాంతి పండగ రోజున సూర్యుడు ఉదయించే సమయానికి భీమవరంలో ప్రభాస్ కటౌట్ నిలబడనుంది. ప్రభాస్ మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అప్డేట్ సంక్రాంతి రోజున బయటకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ చేస్తున్న సందర్భంగా భీమవరంలోని “వెంపకాసి కోడి పందెం బరి, పెదమేరం”లో ఉదయం 6:30 నిమిషాలకి ప్రభాస్ ఎల్ఈడీ డిజిటల్ కటౌట్ కౌంట్ డౌన్ ని లాంచ్ చేస్తున్నారు. ప్రభాస్ ని వింటేజ్ మోడ్ లో చూపిస్తామని మారుతీ అండ్ ప్రొడ్యూసర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో కనిపించిన ప్రభాస్ ని చూపిస్తే చాలు మారుతీ హిట్ కొట్టేసినట్లే. ఇదిలా ఉంటే ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపించింది కానీ ఇప్పుడు రాజా సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ని మేకర్స్ ఫస్ట్ లుక్ తో పాటు అనౌన్స్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయంలో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. మాకు థమన్ వద్దు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా టాక్ తర్వాత థమన్ ప్రభాస్ సినిమాకి వద్దు అనే మాట మరింత ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.
