Pawan Kalyan: వారాహిని టచ్ చేస్తే.. నేనేంటో చూపిస్తా
తన వారాహి వాహనాన్ని టచ్ చేస్తే.. తానేంటో చూపిస్తానంటూ వైసీపీ వర్గాలకు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన వద్ద అక్రమంగా సంపాదించిన డబ్బులు లేవని, అభిమానులు ఇచ్చిన విరాళాలతోనే పార్టీని నడుపుతున్నానని, పార్టీ నడపడం బాధ్యత అని అన్నారు. అన్నం పెట్టిన నేలకి మేలు చేయకుండాపోతే అదేం బ్రతుకని ధ్వజమెత్తారు. అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే.. అది క్షేమం కాదన్నారు. రాష్ట్రంలో మూడు వేల పైచిలుకు రైతులు చనిపోయారన్నారు. ప్రభుత్వ బాధ్యత తన చేతిలో పెడితే.. ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానని హామీ ఇచ్చారు. ఏ జిల్లాలోనూ రైతు క్షేమంగా లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి పాల్గొననున్న కమల్‌హాసన్!
నటుడు కమల్ హాసన్ డిసెంబర్ 24న జరగనున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి పాల్గొననున్నారు. నటుడిగా మారిన రాజకీయ నాయకుడు వచ్చే వారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో చేరనున్నారు. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం ప్రకారం సూపర్ స్టార్‌ను యాత్రలో పాల్గొనమని రాహుల్ గాంధీ ఆహ్వానించారు. భారత్ జోడో యాత్ర డిసెంబర్ 24న ఢిల్లీలోకి ప్రవేశించనుంది. దాదాపు ఎనిమిది రోజుల తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్, హర్యానాకు వెళ్లి వచ్చే నెలలో జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించే ముందు పంజాబ్‌లోకి ప్రవేశిస్తుంది.
‘రాష్ట్రానికే ఖర్మ’ అంటూ.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ధ్వజం
టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను అధికారంలో లేకపోతే.. గుడులు, బడుల్ని సైతం తగలబెట్టి చలి కాల్చుకునే తత్వం చంద్రబాబుదని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతోనే.. బాబు తనలోని రాక్షసత్వాన్ని బయటపెడుతున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం రాష్ట్రానికే ఖర్మ అంటూ ధ్వజమెత్తారు. మాచర్లలో జరిగిన ఘర్షణని ఉద్దేశించి.. ఈ విధంగా ట్విటర్ మాధ్యమంగా విజయసాయిరెడ్డి స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులారా బీజేపీలోకి రండి.. బహిరంగంగా ఆహ్వానిస్తున్నా
రేవంత్ రెడ్డి వ్యవహారంలో నేను చేసిన విమర్శలను ఆనాడు ఎవరు పట్టించుకోలేదని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికైనా కాంగ్రెస్ సీనియర్ నేతలు బీజేపీలోకి రావాలని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడిందని అన్నారు రాజగోపాల్ రెడ్డి. ప్రజా సమస్యల కోసం కోసం పోరాడిన చరిత్ర…. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఉద్యమం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డికి లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దేశం, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పై నేను విమర్శలు చేస్తే మునుగోడు వేదికగా కాంగ్రెస్ సీనియర్లు నాపై దమ్ము ఎత్తిపోసారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ఇప్పటికైనా కాంగ్రెస్ సీనియర్లు కాంగ్రెస్ను వీడి బీజేపీ చేరాలని, బహిరంగంగా ఆహ్వానిస్తున్నానని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలు రగిల్చిన చిచ్చు పతాకస్థాయికి చేరకుంది. సీనియర్లలలో ఇప్పటికే చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు సమావేశమై చర్చించారు. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వంటి నేతలు హాజరై తాజా పరిస్థితులపై చర్చించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేసిన వలస వచ్చినవారికి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను కాపాడుతున్న తమపై కోవర్టులంటూ సోషల్ మీడియాలో ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో చీలికలు.. రెండుగా చీలిన హస్తం
తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. నిన్నటి వరకు సీనియర్లు తమకు సముచిత గుర్తింపు దక్కడం లేదంటూ.. నేటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌ను బైకాట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా పీసీసీ కమిటీలో పదవులు దక్కి సీనియర్లతో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు వచ్చిన నేతలు పీసీసీ పదవులకు రాజీనామాలు చేశారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఓవైపు రేవంత్ రెడ్డి వర్గం.. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ వర్గం ఎవరికి వారు విమర్శలు చేస్తున్నారు. మాకు పని మాత్రమే ముఖ్యమని పదవులతో సంబంధం లేదని రేవంత్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. ఇదే సమయంలో.. ఎన్టీవీతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ప్రజలంతా టీఆర్ఎస్ మీద అసంతృప్తితో ఉన్నారని,
కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు కానీ నాయకుల వ్యవహార శైలి ప్రజలని అసంతృప్తికి గురిచేస్తుందన్నారు. మాకు పదవులు ఇవ్వడమే పెద్ద నేరం అన్నట్లు నిన్న మాట్లాడిన నేతలు భావిస్తున్నారని, కేసీఆర్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవాలని భావనతో ప్రజలు ఉన్నారని, ఇలా నాయకులం పోట్లాడుకోవడం ప్రజలు సహించరన్నారు. కేసీఆర్‌తో కొట్లాడటానికి సీనియర్ నేతలకు మా పదవులే అడ్డంకి అని భావిస్తున్నారని, మా పదవులే అడ్డంకి అనుకుంటే మాకు పదవులు అక్కరలేదన్నారు. అందుకే మేము మా పదవులకు రాజీనామా చేస్తున్నామని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి మేం పని చేస్తామని సీతక్క వ్యాఖ్యానించారు.
భర్తపై భార్య అత్యాచారం.. 29 గంటలపాటు ఏకధాటిగా
సాధారణంగా అమ్మాయిల మీద అబ్బాయిలు అత్యాచారం చేస్తూ ఉంటారు.. ఈ మధ్య అమ్మాయిలు కూడా అబ్బాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారు అని వింటూనే ఉన్నాం. ఇక తాజాగా ఒక భార్య.. భర్తపై అత్యాచారం చేసింది.. అందులోనూ ఏకధాటిగా 29 గంటలపాటు హింసించి మరీ అత్యాచారం చేసింది.. ఏంటి వింటుంటే ఈమె కామ పిశాచి.. అసలు ఆడదేనా అని తిట్టేసుకుంటున్నారా..? ఆగండాగండి.. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇదంతా భార్యతో విడాకుల కోసం ఒక భర్త కోర్టులో ఆడిన ఒక అబద్దం. ఈ వింత కేసు దక్షిణ కొరియాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియాలో ఒక 40 ఏళ్ల వ్యక్తి భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఎన్నో ఏళ్ళు హ్యాపీగా ఉన్న వారి సంసారంలో కలతలు వచ్చాయి. దీంతో అతడి భార్య విడాకులు కోరుకున్నది. కానీ, కోర్టులో వీరు విడాకులు తీసుకోవడానికి సరిపడ్డా కారణాలు లేవు. అందుకే సదురు భర్త, తన భార్య తనను వేధిస్తోందని, తనను ఇంట్లో బంధించి 29 గంటల పాటు అత్యాచారానికి పాల్పడిందని చెప్పుకొచ్చాడు. ఆ బాధ భరించలేకే విడాకులు తీసుకొంటున్నట్లు తెలిపాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. తన భర్తను అత్యాచారం చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఈ వింత కేసుపై కోర్టు తీర్పునిస్తూ.. ఇలాంటి ఘటనను తామెప్పుడూ వినలేదని పేర్కొంది. వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.
తెలంగాణలకు శుభవార్త.. ఈనెల 28న రైతుబంధు
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసిఆర్ ఆదేశించారు. రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం గాను రూ. 7,600 కోట్లను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. అయితే.. ప్రతీ ఏడాది తెలంగాణ సర్కార్ రెండు విడతలుగా అంటే వానాకాలం సీజన్‌కు ముందు, యాసంగి సీజన్‌కు ముందు ఎకరానికి రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడికి సాయంగా అందిస్తోంది. అయితే.. ఇది డైరెక్ట్ గా రైతుల బ్యాంక్ అకౌంట్‌లో నగదు జమ అవడం, మధ్యలో ఎలాంటి వారికి డబ్బులు చెల్లించాల్సి రాకపోవడంతో ఈ పథకం పట్ల బాగా ఆకర్షితులయ్యారు రైతులు. టీఆర్ఎస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి ఈ పథకం కీలక పాత్ర పోషిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మిసెస్ వరల్డ్‌గా సర్గం కౌశల్
భారతదేశానికి చెందిన సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022గా గెలిచి 21 సంవత్సరాల తర్వాత తిరిగి కిరీటాన్ని తెచ్చిపెట్టింది. లాస్ వెగాస్‌లో జరిగిన గాలా ఈవెంట్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్గమ్ కౌశల్ ఈ రోజు మిసెస్ వరల్డ్ కిరీటాన్ని పొందారు. శ్రీమతి కౌశల్ 63 దేశాల నుండి పోటీదారులను ఓడించి 21 ఏళ్ల తర్వాత భారతదేశానికి టైటిల్‌ను తీసుకువచ్చారు. సర్గం కౌశల్ జమ్మూ కాశ్మీర్‌కు చెందినవారు.మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఈ వార్తను ఇన్‌స్టాగ్రామ్ ఈ వార్తను వెల్లడించింది. దాదాపు 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం దక్కిందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సర్గమ్ కౌశల్ కూడా టైటిల్ గెలుచుకున్నందుకు ఎంత ఉల్లాసంగా ఉందో వివరిస్తూ వీడియోను పంచుకున్నారు. “21-22 ఏళ్ల తర్వాత మళ్లీ కిరీటాన్ని అందుకున్నాం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. లవ్ యూ ఇండియా, లవ్ యూ వరల్డ్” అని కొత్తగా కిరీటం పొందిన మిసెస్ వరల్డ్ సర్గం కౌశల్ అన్నారు. కౌశల్ ఇన్‌స్టా పోస్ట్‌ల ప్రకారం.. ఆమె ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉంది. ఆమె గతంలో వైజాగ్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. తన భర్త ఇండియన్ నేవీలో పనిచేస్తున్నారని కూడా పంచుకున్నారు.
రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన ఉత్తర కొరియా
కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణి ప్రయోగాలు చేసి పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా చేపట్టింది. ఉత్తర కొరియా ఆదివారం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ మరోసారి కవ్వింపు చర్యలను మొదలుపెట్టింది. ప్యోంగ్యాంగ్ గత నెలలో అత్యంత అధునాతన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంతో సహా అపూర్వమైన ఆయుధ పరీక్షలను నిర్వహించడంతో ఈ సంవత్సరం కొరియా ద్వీపకల్పంలో సైనిక ఉద్రిక్తతలు బాగా పెరిగాయి. ఉత్తర ప్యోంగాన్ ప్రావిన్స్‌లోని టోంగ్‌చాంగ్-రి ప్రాంతం నుంచి ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను గుర్తించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఈ క్షిపణులను ఉదయం 11:13 (0213 GMT) నుంచి మధ్యాహ్నం 12:05 గంటల వరకు తూర్పు సముద్రంలోకి ప్రయోగించారని దక్షిణ కొరియాతో పాటు జపాన్ ధ్రువీకరించింది. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. మరోవైపు.. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సైతం దీనిని ధ్రువీకరించారు. ఈ క్రమంలో జపాన్ ప్రధాని ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. ఈ క్షిపణులు దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించి గరిష్టంగా 550 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాయని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. టాంగ్‌చాంగ్రిలో ఉత్తరకొరియాకు చెందిన సోహే శాటిలైట్ లాంఛింగ్ సెంటర్ ఉంది. గతంలో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అవసరమైన రాకెట్లు ఇక్కడ పరీక్షించింది. దీనిపై అప్పట్లో ఐరాస మండిపడింది. రాకెట్ల ముసుగులో ఖండాంతర క్షిపణి టెక్నాలజీని పరీక్షిస్తోందని ఆరోపించింది. గురువారం ఇక్కడ అత్యంత శక్తిమంతమైన ఘన ఇంధన మోటార్‌ను ఉత్తరకొరియా ఇదే కేంద్రంలో పరీక్షించింది. దీనిని తమ వ్యూహాత్మక ఆయుధంలో ఉపయోగిస్తామని ఉత్తర కొరియా చెబుతోంది. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ప్రతిగానే తాము క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉత్తరకొరియా సమర్థించుకొంటోంది.