Site icon NTV Telugu

Iran-Israel : ఇరాన్‌-ఇజ్రాయెట్‌ యుద్ధంలో అమెరికా పాత్రేంటి? ఇరాన్ లో దాడికి ట్రంప్‌ ప్లాన్ చేస్తున్నారా?

Trump

Trump

Iran-Israel : ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనూహ్య మలుపు తిరగటానికి సిద్ధంగా ఉంది. ఒకటి రెండు రోజుల్లో అమెరికా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా ఎంటరైతే.. జరగబోయే పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకూ సిచ్యువేషన్ రూమ్ లో వ్యూహం ఖరారైందా..? అమెరికా ముందున్న ఆప్షన్లేంటి..? ఇరాన్ లో ఏం చేస్తే అమెరికాకు లాభం..? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆ రెండు దేశాల పరిధి దాటిపోయింది. ఇప్పుడు యుద్ధం కొనసాగింపు, ముగింపుపై అమెరికాదే తుది నిర్ణయం అయ్యేలా ఉంది. జీ-7 సదస్సు నుంచి అర్థంతరంగా తిరిగొచ్చిన ట్రంప్.. సిచ్యువేషన్ రూమ్ లో కీలక సమావేశం జరపడం.. ఏదో జరగబోతుందనే సంకేతాలను స్పష్టంగానే ఇస్తోంది. ఇరాన్ కు పెను ముప్పు పొంచి ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలతో కలకలం రేగింది.

ఇరాన్ అణ్వాయుధాల తయారీకి పూనుకుంటోందనే కారణంతో..ఇజ్రాయెల్ ఆకస్మికంగా భీకర దాడి చేసింది. చిరకాల శత్రువుకి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని ఇరాన్ కూడా దీటుగా ఎదురుదాడులకు దిగింది. ఇరాన్ మొదట ఇజ్రాయెల్ దాడులు ఆపితే.. తామూ ఆపేస్తామని చెప్పింది. కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ ను తుడిచిపెడతామని ప్రకటన చేశారు. దీంతో రెచ్చిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కౌంటరిచ్చారు. అదే ఊపులో ఐరన్ డోమ్ కు తూట్లు పొడిచిన ఇరాన్.. యథేచ్ఛగా టెల్ అవీవ్ పై విరుచుకుపడుతోంది. దీంతో ఇటు టెల్ అవీవ్.. అటు టెహ్రాన్ బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. మూడు లక్షల మందికి పైగా పౌరులు టెహ్రాన్ ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. టెల్ అవీవ్ లో కూడా పౌరులు బంకర్లలో తలదాచుకుంటున్నారు. వారం రోజులుగా సాగుతున్న యుద్ధం.. ఇప్పటివరకు ఇరాన్, ఇజ్రాయెల్.. ఈ రెండు దేశాల మధ్యే ఉంది. ద్వైపాక్షిక చర్చలతో ఆగే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అమెరికా రూపంలో మూడో పక్షం యుద్ధంలోకి ఎంటరయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇరాన్ కు కఠిన హెచ్చరికలు జారీ చేయడం యుద్ధం మరోస్థాయికి చేరుతుందన్న సంకేతాలనిస్తోంది. ఒక్కసారి అమెరికా దిగితే.. ఇక యుద్ధం ఆపడం.. కొనసాగించడం పూర్తిగా వైట్ హౌస్ నిర్ణయం మీదే ఆధారపడుతుందనడంలో సందేహం లేదు. పశ్చిమాసియలో తన సైనిక స్థావరాలకు యుద్ధ విమానాలు, సైనిక బలగాల్ని తరలిస్తున్న అమెరికా.. ఇప్పటికే ఇరాన్ పై దాడికి తయారుగా ఉన్నట్టు చెబుతున్నారు. సంధికైనా, సమరానికైనా సిద్ధమేనని అమెరికా రక్షణ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. ట్రంప్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇప్పటికే సిచ్యువేషన్ రూమ్ లో ప్లాన్ రెడీ చేసిన ట్రంప్.. ఒకటి రెండు రోజుల్లోనే ఇరాన్ పై దాడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

ఇరాన్ అణ్వాయుధాల తయారీపై అమెరికాకు కూడా అభ్యంతరాలున్నాయి. అందుకే ఇజ్రాయెల్ దాడికి పరోక్ష మద్దతిచ్చింది. మొదట ఇజ్రాయెల దాడులతో తమకు సంబంధం లేదన్న ట్రంప్.. తర్వాత మాట మార్చారు. తామిచ్చిన ఆయుధాలతోనే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేస్తోందని చెప్పేశారు. కానీ ఇజ్రాయెల్ ఎంతగా దాడులు చేస్తున్నా.. భూగర్భంలో ఉన్న ఇరాన్ అణుకేంద్రాలు దెబ్బతినే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం కొందరు అణు శాస్త్రవేత్తల్ని చంపినంత మాత్రాన ఇరాన్ అణుకార్యక్రమానికి వచ్చే నష్టం లేదనే చర్చ జరుగుతోంది. అణుకేంద్రాల్ని పూర్తిస్థాయిలో దెబ్బతీయాలంటే.. బంకర్ బస్టర్ బాంబులు కావాలి. ఇవి కేవలం అమెరికా దగ్గరే ఉన్నాయి. ఆ బాంబుల్ని జారవిడిచే బాంబర్ విమానాలు కూడా అమెరికా అమ్ములపొదిలోనే ఉన్నాయి. అందుకే యుద్ధంలో అమెరికా ఎంట్రీ తప్పని పరిస్థితి వచ్చిందనేది అగ్రరాజ్యంలో వ్యూహకర్తల మాట. ఏదోలా అమెరికాని ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్న నెతన్యాహుకు.. ఇరాన్ కు నష్టం తప్పదన్న ట్రంప్ ప్రకటన కొత్త జోష్ ఇస్తుందనడంలో సందేహం లేదు. అమెరికా ఇరాన్ అణుకేంద్రాలు నాశనం చేస్తే.. మిగతా పని ఐడీఎఫ్ పూర్తిచేస్తుందని నెతన్యాహు భావిస్తున్నారు. ఆ రకంగా ఇరాన్ ను తుడిచిపెట్టాలనే తమ లక్ష్యం నెరవేరుతుందనేది ఆయన ఆశ.

ఒక్కసారి అమెరికా రంగంలోకి దిగితే యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్ని ఖండించిన గల్ఫ్ దేశాలు అమెరికాపై ఒత్తిడి తెస్తాయా.. లేదా అనేది కీలకం కావచ్చు. కొద్ది రోజుల క్రితమే ట్రంప్ సౌదీ అరేబియా, యూఏఈలో పర్యటించారు. యూఏఈ ఏకంగా ట్రంప్ కు విమానం బహూకరించింది. ఇరాన్ గౌరవాన్ని కాపాడాలని ఆ రెండు దేశాలు కంకణం కట్టుకుంటే.. అప్పుడు ట్రంప్ ఏం చేస్తారనేది యుద్ధాన్ని కీలక మలుపు తిప్పుతుంది. గల్ఫ్ దేశాలు ఇన్నాళ్లు తటస్థంగా ఉన్నాయి కాబట్టి.. అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి పూర్తిస్థాయిలో సైనిక వ్యూహాలు అమలు చేయగలుగుతోంది. కానీ ప్రస్తుతం ఇరాన్ అనుకూల వైఖరి తీసుకున్న గల్ఫ్ దేశాలు అమెరికా దాడులకు అడ్డుచెప్పే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే అమెరికా దగ్గర ప్లాన్ బీ ఉందా.. లేదా అనే చర్చ జరుగుతోంది. గల్ఫ్ దేశాల్ని కన్విన్స్ చేయటానికి ట్రంప్ ఏం చేస్తారు.. ఏం చెబుతారనేదే కీలకం అవుతుంది. గల్ఫ దేశాలతో వ్యూహాత్మక చమురు అవసరాలున్న అమెరికా.. కోరి వాటితో వైరం తెచ్చుకోదు. మరి ట్రంప్ వ్యూహరచన చేసే ముందే.. ఆ దేశాలను కాంటాక్ట్ చేశారా.. లేదా అనేది కూడా తేలాల్సి ఉంది.

అమెరికా ఎప్పుడూ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తుందనేది చారిత్రక సత్యం. యుద్ధం ఇజ్రాయెల్ ఒకందుకు మొదలుపెడితే.. ఇరాన్ మరొకందుకు ప్రతిఘటిస్తోంది. మధ్యలో అమెరికా దిగితే.. అటు ఇజ్రాయెల్.. ఇటు ఇరాన్ ఎవరి లక్ష్యాన్నీ పూర్తిచేయకుండా.. సొంత లక్ష్యం నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు. అదే జరిగితే ఇటు ఇరాన్ కు, అటు ఇజ్రాయెల్ కు రెండు దేశాలకూ ఝులక్ తప్పదు. ఇజ్రాయెల్ మిత్రదేశం కాబట్టి దానికి అమెరికా పూర్తి అనుకూలంగా ఉంటుందనుకోవడం భ్రమే కావచ్చు. అమెరికా గేమ్ మొదలుపెట్టాక.. మిత్రుడు, శత్రువని చూడదు. ఇక ట్రంప్ వైఖరిని కొన్ని నెలలుగా ప్రపంచం చూస్తూనే ఉంది. అలాంటి దేశం.. ఇలాంటి అధ్యక్షుడు కలిసి యుద్ధాన్ని ఎటు తీసుకెళ్తారనేది ఊహించడం కష్టం.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టడం కాదు..వీలైనన్ని పిట్టల్ని కొట్టాలనుకుంటుంది అమెరికా. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తో పశ్చిమాసియాలో ఉన్న దేశాలన్నింటికీ మెసేజ్ ఇవ్వాలనుకుంటే.. తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్ లో మరోసారి తనకు అనుకూల సర్కారును గద్దెనెక్కించే అవకాశం వచ్చిందని అనుకుంటే.. వ్యూహం మరోలా ఉంటుంది. అప్పుడు ఖమేనీని హతమార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్ లో అమెరికా అనుకూల సర్కారే ఉండేది. కానీ ఇస్లామిక్ విప్లవంతో ఆ సర్కారును కూలదోసిన ఖమేనీ.. క్రమంగా యూఎస్ కు దూరం జరిగారు. ఇప్పుడు కూడా ఖమేనీ ఇజ్రాయెల్ ను హెచ్చరించినా లైట్ తీస్కున్న ట్రంప్.. అమెరికాకే హెచ్చరిక జారీ చేసేసరికి.. ఇక లాభం లేదని ట్రిగ్గర్ రెడీ చేశారు. మరి ఆ ట్రిగ్గర్ ఎప్పుడు నొక్కుతారా అని ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తోంది.

ప్రస్తుతానికి అమెరికా ఇరాన్ పై దాడి చేయడం ఖాయమే. అయితే ఆ దాడి ఎలా ఉంటుందనే అంశంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమేనీని ఇప్పుడే చంపబోమన్న ట్రంప్.. తన ప్రకటనకు కట్టుబడతారా.. అనూహ్యంగా వ్యూహం మారుస్తారా అనేది తేలాల్సి ఉంది. అమెరికా ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. ఇజ్రాయెల్ కోరిక ప్రకారం ఇరాన్ అణుకేంద్రాల్ని ధ్వంసం చేయొచ్చు. మరో అడుగు ముందుకేసి.. ఖమేనీని కూడా హతమార్చి.. తన అనుకూల సర్కారుకు రంగం సిద్ధం చేయొచ్చు. అలా కాదనుకుంటే కేవలం పరిమిత దాడులతో షో నడపొచ్చు. అలా కాకుండా అందర్నీ ఆశ్చర్యపరచాలనుకుంటే.. ఇరాన్ తో పాటు ఇరాన్ అనుకూల సాయుధ గ్రూపుల ఆట కూడా కట్టించేలా వ్యూహాత్మక దాడులకు దిగొచ్చు. అలా అమెరికా స్థావరాల్ని కూడా కార్నర్ చేయాలన్న ఇరాన్ వ్యూహాన్నీ చావుదెబ్బ కొట్టొచ్చు.

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పాకిస్తాన్ ను అమెరికా ఎలా వాడుకుంటుందనేది కూడా కీలకమైన అంశం. సిచ్యువేషన్ రూమ్ లో వ్యూహరచన జరిగిన కొన్ని గంటల్లోనే పాక్ ఆర్మీ చీఫ్ కు ట్రంప్ వైట్ హౌస్ లో విందివ్వడం చాలా ప్రాధాన్యత గల పరిణామంగా భావిస్తున్నారు. ఇప్పటికే పాక్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను అమెరికా అనధికారికంగా ఉపయోగించుకుంటోంది. మరిన్ని ఎయిర్ బేస్ లు వాడుకుంటుందా.. పాక్ కూడా పరోక్షంగా సాయపడాలని కోరుతుందా అనేది అతి రహస్యం. ఒక్కసారి యుద్ధం చేస్తే.. వ్యూహాత్మక లక్ష్యాల్ని కూడా నెరవేర్చుకోవడం అమెరికాకు మొదట్నుంచీ అలవాటు. కేవలం పైకి కనిపించే లక్ష్యాలే కాకుండా.. ఎవ్వరి ఊహకూ అందని అసలు లక్ష్యాన్ని కూడా సాధించేలా అమెరికా వ్యూహరచన చేస్తోంది. మరి పశ్చిమాసియాలో మరోసారి తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకునేలా అమెరికా ఎలాంటి వ్యూహంతో యుద్ధంలో దిగుతుందనేది ఆసక్తికర అంశం.

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పటివరకూ ఓ స్థాయిలో జరిగింది. కానీ అమెరికా రంగంలోకి దిగితే అది మరో స్థాయికి వెళ్లడం ఖాయం. ఇప్పటికే ఖమేనీ ఇజ్రాయెల్ తో పాటు అమెరికాకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా యుద్ధంలోకి దిగితే.. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్ స్థావరాల్ని కార్నర్ చేసే వ్యూహం కూడా ఇరాన్ రెడీగా పెట్టుకుంది. అప్పుడు గల్ఫ్ దేశాల కార్యాచరణ కూడా కీలకం అవుతుంది.

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎప్పుడోసారి అమెరికా రంగంలోకి దిగక తప్పదని మొదట్నుంచీ అందరూ అనుకుంటున్నదే. ఆ సంగతి ఇరాన్ కు కూడా బాగా తెలుసు. అందుకే అమెరికా దిగితే.. అగ్రరాజ్యాన్ని కార్నర్ చేసే వ్యూహం ముందే రెడీ చేసుకుంది. ఇరాన్ కు ప్రస్తుతం ఇరాక్, సిరియా, యెమెన్ లో కొన్ని అనుకూల సాయుధ గ్రూపులున్నాయి. వాటితో కోఆర్డినేట్ చేసుకుని.. ఆయా దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై గెరిల్లా దాడులు చేయాలనే ప్లాన్ ఉంది. అలాగే పర్షియన్ గల్ఫ్ లో ఉన్న అమెరికా నౌకల్ని కార్నర్ చేసి.. మొత్తంగా 40 వేల అమెరికా మిలటరీ సిబ్బంది ప్రాణాలు ప్రమాదంలో పెట్టే వ్యూహం కూడా రెడీగా ఉంది. ఈ వ్యూహం రెడీ చేసుకున్న తర్వాతే.. ఖమేనీ యూఎస్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ఇరాన్ దగ్గర పదివేల కి.మీ దూరంలో ఉన్న అమెరికాపై నేరుగా దాడి చేసే క్షిపణులు లేకపోవచ్చు. కానీ పశ్చిమాసియాలో అమెరికా మిలటరీ బలగాల్ని చీకాకుపరిచే శక్తి అయితే ఉందని కొందరు యుద్ధ నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే ఈ సంగతి అమెరికాకి తెలియదనుకోలేం. దీనికి కౌంటర్ గా యూఎస్ కూడా ప్లాన్ చేస్తుందని, అయితే సమయం వచ్చేదాకా ఆ వ్యూహం గోప్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. ఇరాన్ బలహీనంగా ఉందనుకున్న అంచనా తప్పని ఇప్పటికే రుజువైంది. ఇజ్రాయెల్ దుర్భేధ్యమని భావించిన ఐరన్ డోమ్ కు ఇప్పటికే ఇరాన్ తూట్లు పొడిచింది. టెహ్రాన్ గగనతలంపై నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ ప్రకటించిన ఒకటి, రెండు రోజులకే టెల్ అవీవ్ గగనతలంలో తమకూ అడ్డు లేదని ఇరాన్ ప్రకటించింది. ఇక్కడ ఇరాన్ వి కేవలం ప్రగల్భాలు కాదు. టెల్ అవీవ్ లో జరుగుతున్న దాడుల వీడియోలు చూస్తే.. అక్కడా భారీ నష్టం జరుగుతోందని అర్థమవుతోంది. పైగా ఇరాన్ దగ్గర కూడా సీక్రెట్ వెపన్స్ ఉన్నాయా అనే కొత్త సందేహాలు కూడా పుట్టుకొస్తున్నాయి.

ఇప్పటివరకూ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంగా ఉన్న పోరు.. రాబోయే రోజుల్లో అమెరికా ఇరాన్ వార్ గా పరిణమిస్తుందా అనే ఆందోళన లేకపోలేదు. అదే జరిగితే గల్ఫ్ దేశాలు పోషించే పాత్ర కీలకం కాబోతోంది. ఇరాన్ ఆత్మగౌరవమే ముఖ్యమని గల్ఫ్ దేశాలు స్టాండ్ తీసుకుంటే.. అమెరికా కూడా ఎంతోకొంత దాడుల తీవ్రత తగ్గించాల్సి రావచ్చనే అంచనాలున్నాయి. కానీ ఖమేనీ ఆ స్థాయిలో గల్ఫ్ దేశాల మద్దతు సంపాదించగలరా అనేది చూడాలి. అమెరికా యుద్ధంలోకి దిగేముందే.. ఇవన్నీ చూసుకుంటుంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ కు పరోక్ష సాయం చేసిన అమెరికా.. భవిష్యత్తులో టార్గెట్లు విభజించి.. మా టార్గెట్స్ మేం ఛేదిస్తాం.. మీ టార్గెట్స్ మీరు చూసుకోండి అనే ప్రతిపాదన కూడా తెస్తుందనే ఊహాగానాలున్నాయి. అంతేగానీ నిజంగా ఇజ్రాయెల్ కోసం పూర్తిస్థాయి యుద్ధం చేస్తుందా అనే అనుమానాలు లేకపోలేదు. ప్రపంచంలో యుద్ధాలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చిన ట్రంప్.. యుద్ధాన్ని తీవ్రం చేసి ఎలా సమర్థించుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే యుద్ధాన్ని ముగింపు దిశగా తీసుకెళ్లేలా అమెరికా వ్యూహాత్మక దాడులకే ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇరాన్ కు కొంత నష్టం జరిగినా.. ఖమేనీని లొంగదీసుకుంటే చాలని ట్రంప్ భావిస్తున్నారా అనేది మరో ప్రశ్న. ఇరాన్ తో ఇజ్రాయెల్ కు భవిష్యత్తులోనూ ముప్పు ఉండకూడదని నెతన్యాహు అంటున్నారు. మరిప్పుడు ట్రంప్ ఏం ఆలోచిస్తారనేది చూడాలి. ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరడంతో పాటు ఇరాన్ లో అమెరికా అనుకూల సర్కారు ఉండేలా ప్రయత్నం చేస్తారా అనేది ఆసక్తికరం. ఖమేనీని హతమార్చాల్సిన అవసరం ఉందా.. లేదా అనే విషయంపై కూడా ఇప్పుడు ట్రంప్ నిర్ణయానికి వచ్చినట్టు లేదు. అందుకే ఆయన్ను ప్రస్తుతానికి హతమార్చే ఉద్దేశం లేదని చెప్పారు. కానీ ఎప్పటికైనా ఖమేనీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టే. మరి ఆయనతో లోపాయికారీగ చర్చలు జరిపి.. అమెరికాకి అనుకూలంగా మార్చుకుంటారా.. ఉపయోగం లేదనుకుంటే ఖతం చేసి.. కొత్త సర్కారును ప్రతిష్ఠిస్తారా అనేది.. రాబోయే రోజుల్లో ఇరాన్ వైఖరి మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి అమెరికా ఇగో దెబ్బతింటే.. అప్పుడు గల్ఫ్ దేశాల్ని కూడా సైలంట్ చేయడం పెద్ద విషయం కాదని ట్రంప్ అనుకుంటుండొచ్చు.

ఇరాన్ కూడా కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. ఓవైపు ఇజ్రాయెల్ పై కత్తి దూస్తూనే.. మరోవైపు అమెరికాతో చర్చలకు సిద్ధమని లోపాయికారీ సంకేతాలిస్తోంది. వీటిని ఎలా ఉపయోగించుకుంటారనేది యుద్ధ గతిని నిర్దేశిస్తుంది. ఇరాన్ తో అణు ఒప్పందం కుదిరితే.. ఇజ్రాయెల్ కూడా చేసేదేం ఉండదు. అమెరికాని కాదని నెతన్యాహు మరీ దూకుడుగా ముందుకెళ్లే అవకాశాలు తక్కువ. ఒకవేళ అలాంటి సాహసం చేస్తే.. ఆయన్ని ఎలా కట్టడి చేయాలో ట్రంప్ కు బాగా తెలుసు. ఏం చేసైనా యుద్ధాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని అమెరికా భావిస్తుంది.

చారిత్రకంగా చూసినా.. ఏ యుద్ధంలోనూ ఏదో ఒక దేశం కొమ్ముకాయడం అమెరికాకు తెలియని విద్య. అలా చేసినట్టు కనిపిస్తూనే.. తన లక్ష్యాలు తాను చాకచక్యంగా సాధించుకుంటుంది. ఇప్పుడు పశ్చిమాసియాలో అనుకోకుండా ట్రంప్ కు ఛాన్స్ వచ్చింది. నిజానికి యుద్ధం తొలిరోజుల్లోనే ముగించాలని యూఎస్ ప్రయత్నం చేసింది. కానీ అటు ఇరాన్ .. ఇటు ఇజ్రాయెల్ మంకుపట్టు పట్టాయి. దీంతో యుద్ధం తీవ్రమైంది. ఇప్పుడు తీవ్రమైన యుద్ధాన్ని కూడా ముగించడం తమకు మాత్రమే సాధ్యమని అమెరికా ప్రూవ్ చేయాలనుకుంటోంది. దాని కోసం ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందనేది చూడాలి.

కొంతకాలంగా అమెరికా సైనిక శక్తి మీదా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అప్ఘనిస్తాన్ ను తాలిబన్లకు వదిలేసి.. అమెరికా దాదాపు పారిపోయినంత పని చేసిందని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. మరి అక్కడ పోయిన ప్రతిష్ఠను ఇరాన్ లో నిలబెట్టుకోవాలని యూఎస్ ఆలోచిస్తుందా అనేది చూడాలి. ఇరాన్ ను ఇజ్రాయెల్ తో కలిసి దెబ్బతీయటం అమెరికాకి పెద్ద విషయమేం కాదు. తద్వారా అమెరికా సైనికంగా ఇంకా సూపర్ పవరే అని నిరూపించుకోవచ్చు. అలాగే అమెరికా చనువిచ్చింది కదా చంకనెక్కాలనుకోవద్దని ఇజ్రాయెల్ కూ ఝలక్ ఇచ్చే అవకాశాలు సృష్టించుకోవచ్చు. చివరకు అటు ఇరాన్ ను, ఇటు ఇజ్రాయెల్ ను దారికి తెచ్చుకుని తనకు అనుకూలంగా డీల్స్ చేసుకోవచ్చని కూడ ట్రంప్ ఆలోచిస్తే ఆశ్చర్యమేం లేదు.

ఒక్కసారి అమెరికా రంగంలోకి దిగాక యుద్ధం ఇజ్రాయెల్ అనుకున్నట్టు జరగకపోవచ్చు. అసలు అగ్రరాజ్యం దిగకుండా ఉంటే బాగుండేదేమో అని నెతన్యాహు పశ్చాత్తాపపడ్డా ఆశ్చర్యం లేదు. అలాగే ఇలాంటి యుద్ధం చేసేకంటే.. ఆపేయడం బెటరేమో అనే ఆలోచన కూడా వచ్చేలా యూఎస్ చేయొచ్చు. అటు ఇరాన్ కూడా త్వరగా అణు ఒప్పందం కుదర్చుకుని ప్రస్తుతానికి బయటపడదాం.. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం అనే నిశ్చయానికి రావచ్చు. అమెరికా దేనికైనా సమర్థురాలే అని రెండు దేశాలకే కాదు.. మొత్తం ప్రపంచానికి బాగా తెలుసు. అందుకే పుతిన్ ముందే ఖమేనీని హెచ్చరించారు. కొన్నిరోజులు ఇరాన్ ను విడిచ సురక్షిత ప్రాంతానికి వెళ్లమని సలహా ఇచ్చారు. కానీ ఖమేనీ పుతిన్ హెచ్చరికను బేఖాతరు చేయడమే కాకుండా.. అమెరికాకే హెచ్చరికలు జారీ చేసి దుస్సాహసం చేశారు. మరిప్పుడు అమెరికా దాడుల్ని ఇరాన్ ఎలా కాచుకుంటుందనేది తేలాల్సిన విషయం.

ట్రంప్ పాత విషయాలు మర్చిపోయే రకం కాదు. యుద్ధం ఆపాలన్న తన సలహాను నెతన్యాహు ఎలా లెక్కచేయలేదో.. ఇరాన్ ఎలా లైట్ తీస్కుందో ఆయనకు బాగా గుర్తుంటుంది. కచ్చితంగా సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్పాలనే అనుకుంటారు. అసలు అందుకే యుద్ధరంగంలోకి దిగుతున్నారా అనేది కూడా అనుమానమే. అమెరికా మాట కాదంటే ఏం జరుగుతుందో.. మొత్తం ప్రపంచానికే చూపించాలనే పట్టుదలతో ప్రయత్నించొచ్చు. ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ కు అవకాశం రాలేదు. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణను కూడా నివారించలేకపోయారు. ఇండియా పాక్ యుద్ధం తానే ఆపానని చెప్పుకున్నా.. భారత్ గాలి తీసేసింది. దీంతో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని అయినా ఆపాలనుకున్నారు. కానీ ఇక్కడా అనుకున్నట్టు జరగలేదు. ఎలాగూ యుద్ధం ఆపలేకపోయాం.. కనీసం ముగిద్దాం అనే ఉద్దేశంతో ట్రిగ్గర్ నొక్కచ్చు. ఇంతకూ ట్రంప్ ట్రిగ్గర్ టార్గెట్ ఏమిటా అని ప్రపంచమంతా టెన్షన్ పడుతోంది. ఎందుకంటే అమెరికా అనుకుంటే యుద్ధాన్ని దీర్ఘకాలిక యుద్ధంగా మార్చగలదు. తలుచుకుంటే కొన్ని గంటల్లోనూ ముగించగలదు. కానీ ట్రంప్ ఏం ఆలోచిస్తారనేదే అంతుచిక్కని విషయంగా ఉంది.

అమెరికా ఇజ్రాయెల్ కు ఎప్పట్నుంచో మిత్రదేశం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ గల్ఫ్ దేశాలతో సంబంధాలు చెడినా పర్లేదనే వైఖరి తీసుకుంటుందా.. లేదా అనేది చూడాల్సి ఉంది. కేవలం ఇరాన్ మాత్రమే సీన్ లో ఉంటే అమెరికా పెద్దగా ఆలోచించకపోవచ్చు. కానీ గల్ఫ్ దేశాలు కూడా వ్యతిరేకం అవుతాయనుకుంటే.. వ్యూహాత్మక అవసరాల్ని పక్కనపెట్టి.. నిజంగా ఇరాన్ ను తుడిచిపెట్టే పనికి పూనుకుంటుందా.. అనేది ఆలోచించాల్సిన విషయం.

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వ్యూహాత్మకంగా కీలకమైన పశ్చిమాసియాలో జరుగుతోంది. ఈ యుద్ధం ఈ ప్రాంతంలో సరికొత్త రాజకీయ సమీకరణాల్ని సృష్టించే అవకాశం లేకపోలేదు. ఎక్కడో పదివేల కి.మీ దూరంలో ఉన్న అమెరికా పశ్చిమాసియాలో దాదాపుగా ప్రతి దేశంలో సైనిక స్థావరాలు ఏర్పాటుచేసుకోవడమే..అగ్రరాజ్యం ఈ ప్రాంతానికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో తెలుస్తుంది. ప్రపంచ చమురు అవసరాలు తీర్చేది పశ్చిమాసియాలో ఉన్న గల్ఫ్ దేశాలే. ఆ చమురు లావాదేవీలన్నీ అమెరికా డాలర్లలోనే జరుగుతాయి. ఈ కారణంగానే అమెరికన్ డాలర్ ప్రపంచ కరెన్సీగా చలామణీ అవుతోంది. అందుకే గల్ఫ్ దేశాల రక్షణకు కూడా అమెరికా పూచీకత్తు తీసుకుంది. అలాంటి పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ కు దశాబ్దాలుగా వైరం ఉంది. ఎప్పటికప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ను అవసరమైనప్పుడు నియంత్రిస్తోంది. తనకు నచ్చినప్పుడు దాడులకు ప్రోత్సహిస్తోంది. అందుకే ఇజ్రాయెల్ ఏం చేసినా అమెరికాకు చెప్పకుండా చేయదని ఇరాన్ భావిస్తుంది.

మొదట్లో తన భూభాగానికి పరిమితమై ఇజ్రాయెల్ తో శత్రుత్వం పెంచుకున్న ఇరాన్.. తర్వాత పరిధి దాటింది. ఇజ్రాయెల్ పై పోరు కోసం చుట్టుపక్కల దేశాల్లోనూ సాయుధ గ్రూపుల్ని తయారు చేసి.. వాటిని ఉసిగొల్పుతోంది. ఈ గ్రూపులు కేవలం ఇజ్రాయెల్ కే కాకుండా అమెరికాకి కూడా తలనొప్పిగా మారాయి. హౌతీలు, హెజ్బొల్లాలు అడపాదడపా అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు దిగుతున్నారు. అమెరికాకు కంట్లో నలుసుగా మారారు. దీనికి కారణం ఇరాన్ అండదండలే అని.. అమెరికా ఎప్పట్నుంచో అదను కోసం చూస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టడంతో.. పనిలోపనిగా తన ప్రతీకారం తీర్చుకోవాలని అమెరికా ఆలోచిస్తోంది. అమెరికా ఆవేశాన్ని మరింత పెంచుతూ.. టెల్ అవీవ్ లో యూఎస్ రాయబార కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. దీంతో రాయబార కార్యాలయం మూసేయాల్సి వచ్చింది. ఈ చర్య తర్వాతే ట్రంప్ యుద్ధంలోకి దిగాలనే నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇంకా ఇరాన్ ను ఉపేక్షిస్తే.. పశ్చిమాసియాలో అమెరికా మిలటరీ బలగాలూ ప్రమాదంలో పడతాయనే ఆలోచనకు వచ్చి ఉండొచ్చు. దీనికి తోడుగా ఖమేనీ హెచ్చరికలు కూడా పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ చెబితే.. అమెరికా దిగితే మర్చిపోలేని బుద్ధి చెబుతామని ఖమేనీ వార్నింగ్ ఇవ్వడం చిన్న విషయం కానే కాదు. దీన్ని అమెరికా తీవ్రంగా పరిగణించే అవకాశాలే ఎక్కువ.

ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటోందా.. లేదా అనే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. అణ్వాయుధాలున్నాయనటానికి ఆధారాల్లేవు. కానీ యురేనియం నిల్వలు మాత్రం భారీగానే ఉన్నాయని తేలిపోయింది. ఇరాన్ చెబుతున్నట్టుగా శాంతియుత అవసరాల కోసం అంత నిల్వ అక్కర్లేదని, అవి కచ్చితంగా ఆయుధాల తయారీ కోసమేననే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కోణంలో ఆలోచిస్తే.. అమెరికా లక్ష్యాలు ఎలా ఉంటాయనేది ఊహించడం కష్టమే. ఇరాన్ ను తుడిచిపెట్టడం ఇజ్రాయెల్ ఏకైక లక్ష్యం. కానీ అమెరికాకూ అదే లక్ష్యం ఉండాలనే రూలేం లేదు. అందుకే యూఎస్ ఏం చేయబోతుందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

అమెరికా వ్యూహాలు కేవలం ట్రంప్ ఆలోచనలకు తగ్గట్టే ఉంటాయని అనుకోలేం. ట్రంప్ సహచర రిపబ్లికన్ల ఆలోచనలు కూడా కీలకమే. వారిలో కొందరు ఇటు ఇజ్రాయెల్.. అటు ఇరాన్ రెండు చోట్లా ప్రభుత్వాలు మారాలని కోరుకుంటున్నారనే ఊహాగానాలున్నాయి. అదే నిజమైతే ఆ లక్ష్యాన్ని అమెరికా ఎలా రీచ్ అవుతుందనేది ఆసక్తికరం. ఖమేనీ అమెరికా హెచ్చరికల్ని ఖాతరు చేయలేదు. అలాగని నెతన్యాహు కూడా ట్రంప్ మాటను గౌరవించలేదు. పైగా అమెరికా మద్దతిచ్చినా ఇవ్వకున్నా.. తాము ఒంటరిగా పోరాడతాం అని ప్రకటించారు. అమెరికా సాయం లేకుండా ఇరాన్ అణుకేంద్రాల్ని ధ్వంసం చేయలేమని తెలిసి కూడా నెతన్యాహు నోట ఇలాంటి మాటలు రావడాన్ని రిపబ్లికన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆయన సర్కారును కూడా మార్చాలని ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అప్పుడు రెండు కొత్త ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదర్చడం సులువని, భవిష్యత్తులోనూ యుద్ధం రాకుండా పరిస్థితిని అమెరికా నియంత్రించొచ్చని దూరాలోచన చేస్తున్నారు. ఇప్పటికే నెతన్యాహు సర్కారుపై ఇజ్రాయెల్ లో వ్యతిరేకత ఉంది. యుద్ధంతో ఆయన దాన్ని కవర్ చేసుకుంటున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. హమాస్ చెరలో బందీల విడుదలే లక్ష్యంగా హమాస్ పై దాడి చేసిన ఇజ్రాయెల్ .. అసలు సంగతి వదిలేసింది. బందీల్ని విడిపించకుండానే ఇరాన్ తో యుద్ధానికి దిగడం ఇజ్రాయెలీలకు నచ్చడం లేదు. ఈ పరిణామాన్ని తాము సానుకూలంగా వాడుకోవచ్చని అమెరికా అంచనా. అలాగే ఇరాన్ లోనూ ఖమేనీ మొండి పట్టుదల క్రమంగా వ్యతిరేకతకు దారితీస్తుంది. మంకుపట్టుతో యుద్ధాన్ని దేశంపై రద్దుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొన్నిరోజులు యుద్ధం కొనసాగితే.. ఇరాన్ కు మరింత నష్టం జరిగితే.. ఆ భావన మరింత బలపడుతుంది. అప్పుడు ఖమేనీని కూడా తప్పించవచ్చని అమెరికా ఆలోచిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ మాదిరిగా కేవలం సైనిక లక్ష్యాలే పెట్టుకుంటుందనుకోవడం భ్రమే. కచ్చితంగా రాజకీయ లక్ష్యాల సాధన కోసం సైనిక చర్యకు దిగుతుందని యుద్ధ నిపుణులు ఊహిస్తున్నారు.

అమెరికా ప్రత్యేక ఆపరేషన్ల నుంచి పూర్తిస్థాయి యుద్ధం వరకు దేనికైనా సిద్ధమేనని ఇప్పటికే సంకేతాలిచ్చేసింది. తద్వారా అందరి ఊహాశక్తికి బాగానే పని చెప్పింది. ట్రంప్ ట్రిగ్గర్ నొక్కుతారని మాత్రమే అందరికీ తెలిసేలా చేసింది. త్వరలో నొక్కుతారని కూడా లీకిచ్చింది. కానీ ట్రిగ్గర్ నొక్కితే ఏ టార్గెట్లు ఛేదిస్తారనేది మాత్రం ఉద్దేశపూర్వకంగా రహస్యంగా ఉంచుతోంది. యుద్ధం ఎన్నిరోజులు జరిగితే తనకు ప్రయోజనమని అమెరికా భావిస్తుందో కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ను నిశితంగా గమనిస్తున్న అమెరికా తన వ్యూహంపై ఓ అంచనాకు వచ్చింది. ట్రంప్ ఆ వ్యూహాన్ని ఖరారు కూడా చేశారు. ఇరాన్ లో ఎక్కువ రోజులు దాడులు చేస్తే.. తన ప్రతిష్ఠ ఇనుమడిస్తుందనుకుంటే.. అమెరికా ఆ పనే చేయొచ్చు. అలా కాదు త్వరగా ముగిస్తే మంచి డీల్ కుదురుతుందనుకుంటే.. కొన్ని గంటల్లోనే పని ముగించొచ్చు. దేనికైనా సిద్ధంగా ఉండాలని ముందుగానే నెతన్యాహుకు అల్టిమేటం ఇవ్వొచ్చు. ఒక్కసారి అమెరికా రంగంలోకి దిగాక.. ఇజ్రాయెల్ ఎంతమాత్రం నిర్ణయాత్మక శక్తిగా ఉండలేదు. కేవలం సహాయ పాత్రకే పరిమితం కావాల్సి ఉంటుంది. ఎక్కువ మాట్లాడితే అమెరికా వ్యూహం ప్రకారమే దాడులు చేయాల్సి రావచ్చు. అమెరికాతో ఇజ్రాయెల్ కు దీర్ఘకాలిక అవసరాలుంటాయి కాబట్టి.. నెతన్యాహు కూడా మరీ మొండిపట్టు పట్టే ధైర్యం చేయకపోవచ్చు.

అసలు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేది ట్రంప్ డైరక్షన్ లో నెతన్యాహు చూపిస్తున్న సినిమా అని ఇరాన్ భావిస్తోంది. అదను చూసి డైరక్టరే హీరోని సైడ్ చేసి.. ఎంట్రీ ఇస్తారనే అంచనాతోనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ట్రంప్ చర్యలున్నాయి. ఇక ఇప్పట్నుంచి రాబోయే 48 గంటలు చాలా కీలకం. ఈ రెండు రోజులే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గతిని నిర్దేశించనున్నాయి. అమెరికా ఏ వైపు నుంచి ఎక్కడ్నుంచి దాడి చేస్తుందనేదీ ప్రాధాన్యం గల అంశమే. ఊహించని ప్రదేశం నుంచి ఊహించని రీతిలో అమెరికా దాడికి దిగితే మాత్రం ఇరానే కాదు.. మొత్తం ప్రపంచమే ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్న ట్రంప్.. అమెరికా సైనిక శక్తిని ఘనంగా చాటే ప్రయత్నం చేస్తే మాత్రం ఇరాన్ కు భారీ నష్టం తప్పకపోవచ్చు. మరి ఆ నష్టాన్ని తగ్గించుకోవటానికి ఇరాన్ ఏం చేస్తుందనేది చూడాల్సి ఉంది. ఇజ్రాయెల్ తో శాంతి అంటే సమస్య కానీ.. అమెరికాతో చర్చలు జరిపితే పర్లేదనే వైఖరి తీసుకుంటుందా.. లేదా అనేది కీలక ప్రశ్న. అలా కాకుండా గల్ఫ్ దేశాలతో అమెరికాపై పరిమిత స్థాయిలో అయినా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందా అనేది మరో ఆప్షన్. మొత్తం మీద ఏం జరిగినా అమెరికా మూడ్ ను బట్టే ఇక యుద్ధం జరుగుతుందనడంలో సందేహమే లేదు.

Exit mobile version