Himanta Biswa Sarma: ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను ‘‘మియా ముస్లింల’’ ఓట్లను ఆశించడం లేదని శనివారం అన్నారు. గౌహతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మియా ముస్లింలు ఎక్కువగా ఉన్నందున తాను మెడికల్ కాలేజీలను సందర్శించడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మియా అనేది బెంగాలీ మాట్లాడే, బెంగాల్ నుంచి అస్సాం వచ్చిన ముస్లింలకు ఉపయోగించే ఓ పదం. రాష్ట్రంలోని స్థానిక ముస్లింల అభివృద్ధిపై తాను, తమ పార్టీ బీజేపీ దృష్టి సారించిందని హిమంత అన్నారు. ‘‘ మేము అస్సాంలోని స్థానిక ముస్లింఅ అభివృద్ధిపై దృష్టి సారించాము. అస్సాంలోని స్థానిక ముస్లింలు తప్ప, నేను వేరే ముస్లింల ఓట్లను ఎప్పుడూ ఆశించను. ప్రతీ మెడికల్ కాలేజీలో మా స్థానిక యువత కన్నా మియా ముస్లింలు ఎక్కువగా ఉండటం బాధాకరం. వారు ఎక్కువగా ఉండే మెడికల్ కాలేజీలకు వెళ్లడం మానేశాను’’ అని హిమంత అన్నారు.
Read Also: World Cup: 2003-2019 వరల్డ్ కప్.. ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ వివరాలు ఇవే..!
అస్సాంలోని ముస్లిం కమ్యూనిటీతో కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ పార్టీలకు ఓట్లతో సంబంధం ఉందని, భయానక వాతావరణం సృష్టించడం ద్వారా వారి నుంచి ఓట్లు అడుగుతున్నారని సీఎం విమర్శించారు. వలస ముస్లింలతో రెండు పార్టీలకు సంబంధాలు ఉన్నాయి, కానీ వారి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వారికోసం రోడ్లు, వంతెనలు, పాఠశాలలు నిర్మించలేదని ఆరోపించారు. మొదటిదశగా స్థానిక అస్సామీ ముస్లింల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మేము చర్యలు తీసుకుంటున్నామని, వారిపై తర్వలోనే సర్వే నిర్వహిస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా.. అస్సాంకు చెందిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్, ధుబ్రీ ఎంపీ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ మాట్లాడుతూ.. మియా ముస్లింలు పనిచేయకుంటే గౌహతి ఎడారిగా మారుతుందని, గౌహతిలో మియా ముస్లింలు మూడు రోజులు పనిచేయకుంటే శ్మశాన వాటికలా తయారవుతుందని అన్నారు.