ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడితో దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, కేంద్ర బలగాలు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఢిల్లీ పేలుళ్ల ఘటనను తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలను ఇంత దారుణంగా చంపడాన్ని ఏ మతం కూడా సమర్థించదని అన్నారు. దర్యాప్తు కొనసాగుతుంది, కానీ మనం గుర్తుంచుకోవాలి.. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతి నివాసి ఉగ్రవాది కాదు లేదా ఉగ్రవాదులతో సంబంధం కలిగి ఉండడు. ఇక్కడ శాంతి, సామరస్యాన్ని నిరంతరం దెబ్బతీసింది కొంతమంది వ్యక్తులు మాత్రమే అని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
Also Read:Al Falah University: అల్-ఫలాహ్ యూనివర్సిటీకి ఎదురుదెబ్బ.. న్యాక్ షోకాజ్ నోటీసులు
జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతి నివాసిని, ప్రతి కాశ్మీరీ ముస్లింను ఒకే భావజాలంతో చూసి, వారిలో ప్రతి ఒక్కరినీ ఉగ్రవాదిగా భావించినప్పుడు, ప్రజలను సరైన మార్గంలో ఉంచడం కష్టమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సంఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలి, కానీ మనం అమాయకులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. యూనివర్శిటీ ప్రొఫెసర్లు ఇలాంటి పనుల్లో పాల్గొనడాన్ని మనం ఇంతకు ముందు చూడలేదా?… విద్యావంతులు ఇలాంటి పనుల్లో పాల్గొనరని ఎవరు చెప్పారు? వారు చేస్తారు. వారిని తొలగించడం నాకు ఆశ్చర్యంగా ఉంది, కానీ ఎలాంటి దర్యాప్తు జరిగింది?… ఎందుకు కేసు నమోదు చేయలేదు?… కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇస్తామని తెలిపారు.
