ఆ ఎమ్మెల్సీ గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తున్నారా? ఓట్లు వేసి గెలిపించిన వర్గాన్ని గాలికొదిలేసి తన దారి తాను చూసుకుంటున్నారా? మరోసారి వాళ్ళెవరూ తనకు ఓట్లు వేయరన్న క్లారిటీతోనే సార్… సరికొత్త నిర్ణయాల వైపు అడుగులేస్తున్నారన్నది నిజమేనా? గద్దనెక్కాక గమ్యాన్ని మర్చిపోయారంటున్న ఆ శాసన మండలి సభ్యుడు ఎవరు? నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఏ వర్గం గుర్రుగా ఉంది?
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మూడు సార్లు గెలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. టీచర్స్ సమస్యలు తెలిసిన నేతగా… గట్టిగా నిలబడాల్సిన వ్యక్తి ఆ విషాలను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి ఆ వర్గాల్లో పెరిగిపోతోంది. సర్వీస్ రూల్స్, పీఆర్సీ, బదిలీలు, పదోన్నతులు, ఇలా… రకరకాల సమస్యలతో ఉపాధ్యాయులు రోడ్డెక్కుతుంటే.. ఎమ్మెల్సీ మాత్రం డీఎస్సీ నియామకాలపై మాట్లాడటమేంటని కొందరు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారట. ఇంట్లో ఈగల మోత… బయట పల్లకీ మోత అన్నట్టుగా… తమ సమస్యల్ని పక్కనపెట్టి వేరే అంశాలపై ఫోకస్ ఎందుకని అయ్యవార్లే ఆయన్ని నిలదీస్తున్నట్టు తెలుస్తోంది.
గెలిచింది ఉపాధ్యాయుల ఓట్లతోనే కదా.. మరి గెలిచాక ఎవరి కోసం గళం విప్పాలి అంటూ నిలదీస్తున్నారు. ఎమ్మెల్సీ వైఖరి కంటే చేను మేసినట్టుగా ఉందంటూ… ప్రత్యర్థి వర్గాలు ఎద్దేవా చేస్తుంటే మా సిగ్గుపోతోందని అంటున్నారు టీచర్లు. ఇక్కడే ఎమ్మెల్సీ వైఖరిపై సరికొత్త చర్చలు నడుస్తున్నాయి. ఆయన అధికార పార్టీ పెద్దలతో సాన్నిహిత్యం పెంచుకుంటూ ఉపాధ్యాయుల సమస్యల్ని గాలికొదిలేశారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. సమస్యలన్నీ అలాగే ఉండగా… ఆయన మాచారం అధికార పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టు చెబుతున్నారు. మామూలుగా ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు లాబీయింగ్ గట్టిగానే ఉంటుందని అంటారు. విద్యాశాఖలో పని అంటే… ఆయన చిటికెలో చక్కబెట్టేస్తారట. అదే సమయంలో… ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వస్తే మాత్రం నోరు మూసుకుంటే నొప్పి ఉండదన్నట్టుగా వ్యవహరిస్తారన్న అసంతృప్తి పెరిగిపోతోంది.
పీఆర్టీయూ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ… సమస్యల పరిష్కారం కోసం ఆ యూనియన్ పోరాడుతున్నా ఎలాంటి సపోర్ట్ ఇవ్వడం లేదంటున్నారు. గెలిపించిన వర్గాన్ని పక్కన పెట్టి… రాజకీయ పెద్దల చుట్టూ తిరగడం ఏంటన్న చర్చ ఉపాధ్యాయ వర్గాలలో పెరిగిపోతోంది. మూడు సార్లు అవకాశం ఇచ్చినా మాకేం చేశారంటూ ఉపాధ్యాయులే ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అయితే… రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు… శాశ్వత ప్రయోజనాలే ఉంటాయన్న సూత్రాన్ని ఎమ్మెల్సీ బాగా ఒంటబట్టించుకున్నట్టు కనిపిస్తోందంటున్నారు కొందరు. ఎవరు అధికారంలో ఉంటే… వారి వైపు అడుగులు వేయడం శ్రీనివాసులు నాయుడు రాజకీయ వ్యూహమని మాట్లాడుకుంటున్నాయి ఉపాధ్యాయ వర్గాలు.
తాను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సందర్భంలో గాదె వ్యవహరించిన తీరుపై కూడా అప్పట్లో చర్చ జరిగింది. సీఎంతో దిగిన ఫోటో చూసిన కొందరు ఉపాధ్యాయులు… అధికారం ముందు అందరూ చిన్నవాళ్లే అని కామెంట్స్ చేశారు. ఇక ఎమ్మెల్సీ వైఖరి గురించి మరో రకమైన డిస్కషన్ కూడా ఉంది. ఇన్నాళ్ళు ఉపాధ్యాయుల ఓట్లతో నెగ్గుకొచ్చాం. ఇక ముందు పరిస్థితి అలా ఉండకపోవచ్చనే అంచనాకు వచ్చాకే ఆయన రూట్ మార్చారని, అధికార పార్టీ అండ ఉంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందన్న లెక్కలతోనే స్టైల్ మార్చారని అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని గాదె కొందరు సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన అధికార పార్టీ తరఫున పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం సైతం ఉంది. మొత్తానికి… టీచర్ల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ ఇప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోకుండా… రాజకీయ లెక్కలు చూసుకోవటంపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి.

