Nobel Peace Prize 2025: ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నోబెల్ శాంతి బహుమతి ప్రకటన శుక్రవారం వెలువడింది. ఈ అవార్డుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ కమిటి నుంచి మొండి చెయ్యి ఎదురయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపం ట్రంప్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఎవరికి ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం వరించిందో తెలుసా..
READ ALSO: AP Cabinet Decisions: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం..
ఆమె పోరాటానికి దాసోహం అయిన నోబెల్
వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో ఆమె అవిశ్రాంత కృషికి, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ 2025 నోబెల్ శాంతి బహుమతిని మరియా కొరినా మచాడోకు ప్రదానం చేసింది.
వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు తన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో, నియంతృత్వాన్ని ఎదుర్కోవడంలో చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి లభించిందని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ తెలిపారు. వెనిజులాలో ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలిగా, వెనిజులా ఉక్కు మహిళగా మరియా కొరినా మచాడోకు పేరు ఉంది. వెనిజులా దేశంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆమె కీలక వ్యక్తిగా ఎదిగారు. ఆమె అలుపులేని పోరాటానికి, ప్రజల తరుఫున నిలబడిన తీరుకు ఆమెకు నోబెల్ వరించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వెనిజులా సాపేక్షంగా ప్రజాస్వామ్య, సంపన్న దేశం నుంచి క్రూరమైన, నిరంకుశ రాజ్యంగా పరిణామం చెందింది. ప్రస్తుతం ఈ దేశం మానవతా, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చాలా మంది వెనిజులా ప్రజలు తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. దేశంలో అగ్రస్థానంలో ఉన్న కొద్దిమంది సంపన్నులు తమను తాము మరింత సంపన్నులు చేసుకుంటున్నప్పటికీ, అక్కడి ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పలు నివేదికల ప్రకారం.. ఇప్పటి వరకు దాదాపు 8 మిలియన్ల మంది దేశం విడిచి వెళ్ళారు. ఎన్నికల రిగ్గింగ్, చట్టపరమైన విచారణ, జైలు శిక్షల పేరుతో దేశంలో ప్రతిపక్షాన్ని ప్లాన్ ప్రకారం అణచివేశారని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Thyroid Diet Tips: థైరాయిడ్ సమస్యతో ఇబ్బందులా? అయితే డైట్ ఇలా ప్లాన్ చేస్తే సరి
