NTV Telugu Site icon

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి

Hd Kumaraswamy

Hd Kumaraswamy

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదని స్పష్టం చేశారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి.. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ను పరిశీలించారు.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. స్టీల్ ప్లాంట్ మీద ఇక్కడ ప్రజలు, ఉద్యోగుల సెంటిమెంట్‌ను నేను గుర్తించాను అన్నారు.. ఇక్కడ గమనించిన ప్రతి అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తాను అన్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితులపై ప్రధానికి నోట్ సమర్పిస్తాను అన్నారు.

Read Also: Bhatti Vikramarka: రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా ఖరారు

ఇక, స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ఎవరు చెప్పారు..? అని ప్రశ్నించారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని తోసిపుచ్చారు ఉక్కు మంత్రి.. ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది అని అర్థమైందన్న ఆయన.. అధ్యయనం కోసం స్టీల్ ప్లాంట్ కు వచ్చాను.. ఇక్కడ పరిస్థితిని ప్రధానికి నివేదిస్తాను అన్నారు.. కార్మిక కుటుంబాలు, జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడి వాళ్ల అభిప్రాయాలు నాకు అర్ధం అయ్యిందన్నారు.. ఈ ప్లాంట్ ను పరిరక్షించడం మా బాధ్యత.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు, సహాయంతో ఈ ప్లాంట్ 100 శాతం సామర్థ్యం తో ఉత్పత్తి చేస్తుందని స్పష్టం చేశారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి.. కాగా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసినట్టు గతంలో పరిస్థితులు ఏర్పడ్డాయి.. పెట్టుబడుల ఉపసంహరణతో.. ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఇలా అంతా ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయం విదితమే.