Site icon NTV Telugu

Tejaswi Yadav: బీజేపీ బడా ఝూఠా పార్టీ.. ఇప్పుడు ఎన్డీయే అనేదే లేదు..

Tejaswi Yadav

Tejaswi Yadav

Tejaswi Yadav: బీజేపీ బడా ఘూఠా పార్టీ(అబద్ధాల పార్టీ) అంటూ బిహార్‌ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి జేడీ(యూ), అకాలీదళ్, శివసేన వైదొలిగాయని ఆయన వెల్లడించారు. హర్యానాలోని ఫతేహాబాద్‌లో మాజీ ఉప ప్రధాని దేవిలాల్ 109వ జయంతి వేడుకలు ఆదివారం జరిగాయి. ఐఎన్‌ఎల్‌డీ నిర్వహించిన ఈ మహా సభకు ప్రతి పక్షాలకు చెందిన అగ్ర నేతలు తరలివచ్చారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జేడీ(యూ) చీఫ్‌, బిహార్ సీఎం నితీశ్ కుమార్, బిహార్‌ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, సీపీఎం నేత సీతారాం ఏచూరి, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సహా పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తేజస్వీ యాదవ్‌.. బీజేపీ తప్పుడు వాదనలు, వాగ్దానాలు చేస్తోందని కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ పెద్ద అబద్ధాల పార్టీ అంటూ విమర్శించారు. శుక్రవారం బీహార్‌లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. పూర్ణాలో లేని ఎయిర్‌పోర్ట్‌ గురించి కూడా ఆయన మాట్లాడారని ఎద్దేవా చేశారు. మరోవైపు ఎన్డీయేతో ప్రస్తుతం ఏ మిత్రపక్షం లేదని.. ఇప్పడు ఎన్డీయే అనేదే లేదని ఆయన అన్నారు.

Boat Capsized: ఘోర ప్రమాదం.. పడవ బోల్తా పడి 20 మంది దుర్మరణం, పలువురు గల్లంతు

అనంతరం మాట్లాడిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, వామపక్షాలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలని పిలుపునిచ్చారు. ఈ “ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్” 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు.బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమైతే దేశాన్ని నాశనం చేసేందుకు పని చేస్తున్న వారిని తరిమికొట్టగలమని, హిందువులు, ముస్లింల మధ్య ఎలాంటి గొడవలు లేవని, అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జాతీయ స్థాయిలో మనమంతా ఒక్కతాటిపైకి రావాలన్నదే నా కోరిక.. మరిన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని నితీష్‌ కుమార్ అన్నారు.

Exit mobile version