Site icon NTV Telugu

No Helmet No Petrol : వాహనదారులకు షాక్‌.. ఆగస్టు 15 నుంచి వారికి పెట్రోల్‌ బంద్‌

Petrol

Petrol

దేశంలో ప్రతి రోజు ఎక్కడోకచోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే.. ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్‌ పోలీసులు నో హెల్మెట్‌-నో పెట్రోల్‌ నిబంధనను కఠినతరం చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ ట్రైసిటీలో ఆగస్ట్ 15 నుంచి హెల్మెట్ ధరించకుండా పెట్రోలు నింపుకోవడానికి పెట్రోల్ పంపుల వద్దకు వెళితే, మీరు ఖాళీగా వెనక్కి తిరిగిరావాల్సిందే. హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలా మంది ప్రమాదాల్లో మరణిస్తున్నందున, ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్లు పోలీసు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీల పరిధిలోని పెట్రోల్ పంపుల వద్ద ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఇప్పటికే ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 426 మంది మరణించగా, 1,106 ప్రమాదాల్లో 1,110 మంది గాయపడ్డారు. హెల్మెట్ ధరించడంలో విఫలమవడం వల్లే ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులు మరణించారని తరుణ్ జోషి అన్నారు. ఐఓసీ, హెచ్‌పీ, బీపీసీఎల్‌ తదితర పెట్రోల్‌ బంకులకు ఇప్పటికే 150 బ్యానర్లు పంపిణీ చేశామని ట్రాఫిక్ ఏసీపీ మధుసూధన్‌ తెలిపారు. నవంబర్ 1, 2021 నుండి పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ ధరించాలనే నిబంధనను పోలీసులు ఇప్పటికే అమలు చేశారు. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు జరిమానా విధించేందుకు ట్రాఫిక్‌తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 

Exit mobile version