America: గగనతలంలో గుర్తు తెలియని వస్తువులపై అమెరికా దండయాత్ర కొనసాగుతోంది. ఆదివారం మరో వస్తువును అమెరికా వాయుసేన కూల్చివేసింది. దానికి ముందురోజే కెనడా గగనతలంలో ఇలాంటి ఘటన జరిగిన సంగతి తెలిసిందే. మొత్తంమీద పది రోజుల వ్యవధిలో నాలుగు కూల్చివేతలు జరిగాయి. తాజా ఘటన మిషిగన్ రాష్ట్రంలోని హురాన్ సరస్సు వద్ద జరిగింది. సంబంధిత వస్తువు.. నేల నుంచి 20వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే గగనతలంలో ఈ గుర్తుతెలియని వస్తువుల గురించి అమెరికా క్లారిటీ ఇచ్చింది.
ఈ నెలలో ఉత్తర అమెరికా గగనతలంపై యునైటెడ్ స్టేట్స్ వరుసగా గుర్తుతెలియని వస్తువులను కూల్చివేసిన తర్వాత గ్రహాంతరవాసులు లేదా గ్రహాంతర కార్యకలాపాలకు సంబంధించిన సూచనలు ఏమీ లేవని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ సోమవారం తెలిపారు. ఫిబ్రవరి 4న సౌత్ కరోలినా తీరంలో చైనీస్ గూఢచారి బెలూన్‌ను కాల్చివేసినప్పటి నుంచి, యునైటెడ్ స్టేట్స్ మరో మూడు గుర్తుతెలియని ఎగిరే వస్తువులను కూల్చివేసింది, యూఎస్ గగనతలంలో రెండు, కెనడియన్ గగనతలంలో ఒకటి. గగనతలంలోని వస్తువులు జాగ్రత్తగా తొలగించబడ్డాయని, భూమిపై ప్రజలకు ముప్పు కలిగించలేదని , కమ్యూనికేషన్ సంకేతాలను పంపలేదని, అందులో మనుషులు లేరని వైట్ హౌస్ తెలిపింది. ఇటీవల కూలిపోయిన ఎగిరే వస్తువుల స్వభావం, ఉద్దేశాన్ని గుర్తించడానికి అమెరికా ఇప్పటికీ ప్రయత్నిస్తోంది.
Pulwama Attack: పుల్వామా సైనికుల త్యాగానికి నాలుగేళ్లు.. అమర జవాన్లకు దేశం నివాళులు
ఈ గుర్తుతెలియని వస్తువులను అధ్యయనం చేయాలని బైడెన్ సర్కారు అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అమెరికా నేల కూలిన వస్తువులను, శిథిలాలను సేకరించి విశ్లేషిస్తోంది. ఇదిలా ఉండగా, వారాంతంలో ఉత్తర అమెరికా గగనతలంలో కూల్చివేసిన మూడు గుర్తుతెలియని వస్తువుల నుంచి శిథిలాలను వెలికితీసేందుకు అమెరికా ఇంకా కృషి చేస్తోందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సోమవారం తెలిపారు.