Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..

Nitin

Nitin

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆగస్టు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలపరచడం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను నిర్ణయించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఆగస్టు 17న సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయనకు విశాఖపట్నంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు.

ఆగస్టు 18న ఉదయం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం విశాఖలో జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీలు, రాష్ట్ర పదాధికారులతో కీలక సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై సమీక్షిస్తారు. ఉదయం 11 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరించి, ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించి సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేసిన తర్వాత, పార్టీ కార్యకర్తలతో కలిసి భోజన కార్యక్రమంలో పాల్గొంటారు.

సాయంత్రం 4 గంటలకు విశాఖ నోవాటెల్ వరుణ్ బీచ్‌లో జరిగే ‘యువ సమ్వాద్’ కార్యక్రమంలో 200 మందికి పైగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్‌తో వికసిత్ భారత్, ఇన్నోవేషన్, డిజిటల్ లీడర్‌షిప్ వంటి అంశాలపై ముఖాముఖి చర్చిస్తారు. అంతేకాకుండా.. పార్టీ ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా భేటీ అయి పార్లమెంటరీ కార్యక్రమాలు, నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై విస్తృతంగా సమీక్షించనున్నారు.