Site icon NTV Telugu

Nitish Kumar Reddy: తగ్గేదేలే.. ఆస్ట్రేలియాలో మొదటి సెంచరీతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి

Nitish Reddy

Nitish Reddy

Nitish Kumar Reddy: మెల్‌బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌ల సెంచరీ భాగస్వామ్యానికి అనుగుణంగా ఫాలోఆన్‌ను తప్పించుకోవడంలో టీమిండియా విజయం సాధించడమే కాకుండా, మ్యాచ్‌పై ఆస్ట్రేలియా పట్టును కూడా సడలించింది. నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ 8వ వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి 3 పరుగుల తేడాతో సచిన్ టెండూల్కర్ – హర్భజన్ సింగ్‌ల 16 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. దీనితో ఆస్ట్రేలియాలో 8వ వికెట్‌కు భారతీయులు సాధించిన అతిపెద్ద భాగస్వామ్యంగా రికార్డ్ సృష్టించారు. 8వ వికెట్‌కు ఆస్ట్రేలియాలో భారత్‌కు ఇది మూడో సెంచరీ భాగస్వామ్యం. ఇంతకుముందు 2008లో సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్ ఈ ఘనత సాధించగా, అదే సిరీస్‌లో అనిల్ కుంబ్లేతో కలిసి హర్భజన్ సింగ్ ఈ ఘనత సాధించాడు.

Also Read: Rishabh Pant: ‘స్టుపిడ్’ అంటూ రిషబ్ పంత్‌పై విరుచకపడ్డ గవాస్కర్

ఇక మరోవైపు టీమిండియా పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఐదు టెస్ట్‌ల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాల్గవ టెస్ట్‌లో అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీ సాధించాడు. 171 బంతుల్లో సెంచరీ కొట్టిన నితీష్, తన కెరీర్‌లో ఈ టెస్ట్‌లో తొలి సెంచరీ సాధించాడు. గత మూడు టెస్ట్‌ల్లో 41, 38 నాటౌట్, 42, 42, 16 పరుగులతో రాణించిన నితీష్, తాజా మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌ను ప్రదర్శించి సెంచరీ సాధించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీష్ కుమార్ రెడ్డి, 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ సెంచరీ నితీష్ కుమార్ రెడ్డి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.

Also Read: Nitish Kumar Reddy: తగ్గేదేలే.. పుష్ప స్టైల్‌లో నితీష్ కుమార్ రెడ్డి సెలెబ్రేషన్స్ అదుర్స్..

సుందర్, బుమ్రా వరుసగా ఔటవడంతో నితీష్ కుమార్ రెడ్డికి శతకం సాధించడం మీద ఉత్కంఠ నెలకొంది. అయితే, మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో మూడు బంతులు డిఫెన్స్ చేసి నితీష్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత బోలాండ్ బౌలింగ్‌లో రెండు బంతులను డిఫెన్స్ చేసిన నితీష్, మూడో బంతిని బౌండరీకి తరలించి తన శతకం పూర్తి చేశాడు. ఈ సందర్బాల్లో నితీష్ కుమార్ రెడ్డి శతకంతో గ్రౌండ్ లో ప్రెకషకుల మధ్య ఉన్న అతని తండ్రి ముత్యాల రెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు. నితీష్ బ్యాటింగ్ కు చూసేందుకే వైజాగ్ నుంచి మెల్‌బోర్న్ వెళ్లిన ఆయన కొడుకు సక్సెస్‌ను చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

Exit mobile version