సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మధ్యంతర బడ్జెట్‌ను దేశ ప్రజల ముందు ఉంచారు. వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎప్పుడూ గంటల తరబడి ప్రసంగించే సీతారామన్… ఈసారి మాత్రం గంటలోపే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు.
అతి చిన్నది ఇదే..
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగాల్లో ఫిబ్రవరి 1, 2024న ప్రవేశపెట్టిన బడ్జెట్ అతి చిన్నది. కేవలం 57 నిమిషాల్లోనే ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు. అంటే గంటలోపే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు.
పార్లమెంట్‌లో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మరో రికార్డ్ సృష్టించారు. అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డ్ సీతారామన్ ఖాతాలో చేరింది. 2020-21లో బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 నిమిషాల (2 గంటల 42) పాటు ప్రసంగించారు. బడ్జెట ప్రసంగాల్లో అదే టాప్.
ఇక 2019-20 బడ్జెట్‌ను దాదాపు 137 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది రెండో అతిపెద్ద ప్రసంగం. అంతకముందు 2003-04 బడ్జెట్‌ను జశ్వంత్‌సింగ్ 135 నిమిషాల పాటు చదివారు. ఇక 2022-23 ప్రసంగాన్ని నిర్మల 86 నిమిషాల్లో ముగించేశారు. తాజాగా 2024 బడ్జెట్ ప్రసంగాన్ని మాత్రం కేవలం 57 నిమిషాల్లోనే క్లోజ్ చేశారు.
తొలి మహిళ నిర్మలనే..
మోడీ సర్కార్ 2.0 ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్నుంచీ ఆమెనే ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పని చేసిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అదే కాకుండా 2019లో అధికారంలోకి రాగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రెండో మహిళగా నిర్మలకే దక్కుతుంది. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఆమె హిస్టరీ సృష్టించారు. అప్పుడామె కేవలం తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇక మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ సృష్టించారు.