Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు

Nims

Nims

Hyderabad: హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల సోదాలు ముగిశాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌ను ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించిన సంగతి తెలిసిందే. లక్ష్మీభాస్కర్ అరెస్టు అనంతరం నిమ్స్ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి సారించిన ఏసీబీ, సుమారు 20 మంది అధికారులతో కూడిన బృందంతో అర్ధరాత్రి రెండు గంటల వరకు విస్తృత సోదాలు నిర్వహించింది.

ఈ తనిఖీల్లో భాగంగా నిమ్స్‌లోని పలు విభాగాలకు సంబంధించిన కీలక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే లక్ష్మీభాస్కర్‌కు చెందిన బినామీల ఇళ్లల్లోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆమె డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన కాలంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న అభియోగాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా గతంలో ఆస్పత్రిలో కేటాయించిన పలు టెండర్లలో లక్ష్మీభాస్కర్ కీలక పాత్ర పోషించినట్లు ఏసీబీ భావిస్తోంది. నిమ్స్ సెక్యూరిటీ, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్, మెడికల్ షాప్, క్యాంటీన్, సర్జికల్ డిపార్ట్‌మెంట్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు లక్ష్మీభాస్కర్ అరెస్టు తర్వాత ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధించిన ఆధారాల సేకరణలోనే అధికారులు ఈ సోదాలు పూర్తి చేశారు.