అమ్మతనం ఎంత మధురమైందో…అంత కఠినమైనది కూడా . ఆ మధురానుభూతిని అనుభవించడం అనే కన్నా ఆస్వాదించడంలో ఉన్న సంతోషం చెప్పలేనిది . ఆ అమ్మతనం దూరమైతే…జీవితకాలం ఆ మధురానుభూతి దక్కదని తెలిస్తే…మనసులో పుట్టే ఆ ఆలోచనలు ఆపడం ఎవరితరం కాదు . మంచి మనిషి అన్న ఆ మనుషులే దొంగ అనే వరకు వస్తుంది . హైదరాబాద్‌లో సరిగ్గా అదే జరిగింది..అమ్మతనం కోసం ఓ మహిళ ఏకంగా కిడ్నాపర్ అవతారం ఎత్తింది .
ఆమె కిడ్నాపర్…ఆరు నెలల బాబును ఎత్తుకుపోయిన కిలేడీ..ఆ లేడీ కిలేడీని పట్టుకునేందుకు..ఆరు రోజుల పాటు నాలుగు టీమ్స్ కంటిమీద కునుకులేకుండా గాలించారు . దొరికితే చావబాదాలన్నంత కోపం వచ్చింది పోలీసులకి . దాదాపు వంద సీసీ కెమరాలను జల్లడ పట్టి మరీ ఆ లేడీ కిలేడీని ఆమె భర్తను పట్టుకున్నారు . కిడ్నాప్‌కు గురైన బాలున్ని సేఫ్‌గా పేరంట్స్ వద్దకు చేర్చారు . అంతా బాగానే ఉన్నా…ఇప్పటి దాకా లేడీ కిలేడీ అని చెప్పుకున్న వారంతా…నోనో..ఆమె అలాంటిది కాదు అనేసారు . దొరికితే చావబాదాలన్నంత కోపంలో ఉన్న పోలీసులు కూడా …ఆమె చెప్పింది విని కంటతడిపెట్టుకున్నారు . బాబును పెరంట్స్‌కు అప్పజెప్పి తమ డ్యూటీ చేసేసామనుకున్న పోలీసులు…అమ్మతనం కోసం బాలున్ని ఎత్తుకెళ్లిన ఆ మహిళ తమ దృష్టిలో కిడ్నాపర్ కాదు అన్నారు ..తమ కొడుకును కిడ్నాప్ చేసిన ఆమెను ..క్షమించేసానని బాలుడి తల్లి అన్నది . నిజమే కదా…అమ్మతనానికి ఉన్న గొప్పతనం అది …అసలు విషయం తెలిస్తే…మీరు అయ్యె పాపం అంటారో ? లేడీకిలేడీ అంటారో చూడాలి .
హైదరాబాద్ శివారు గండిపేట ప్రాంతానికి చెందిన ఫరీదా తన తల్లితో పాటు ఇద్దరు కుమారులను నీలోఫర్ హాస్పిటల్‌కు తీసుకువచ్చింది . నాలుగేళ్ల పెద్దబ్బాయికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో…నీలోఫర్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్న ఫరీదా…తన తల్లిని పెద్ద బాబు వద్ద వార్డులో ఉంచి.. నెలల చిన్న బాబును తన దగ్గర ఉంచుకుంది . ముద్దుముద్దుగా కనిపిస్తున్న బాలున్ని చూసి…పక్కనే ఉన్న మమత కాసేపు ఆడుకుంది . ముద్దుముద్దుగా ఉన్నాడంటూ ఫరీదాతో చెప్పడంతో…ఆమె కూడా మురిసిపోయింది . వీరిద్దరినీ గమనిస్తున్న చుట్టుపక్కల వాళ్లంతా…వీరిది పాత పరిచయం కావచ్చు అనుకున్నారు . ఇంతలో..విజిటర్స్ కోసం భోజనం వెహికిల్ రావడంతో…ఐదు నిముషాలు తన బాబును చూడాలంటూ మమత కు చెప్పిన ఫరీదా…భోజనం కోసం వెల్లింది . సరిగ్గా పది నిముషాల్లో తిరిగొచ్చిన ఫరీదాకు…ఆమె చిన్న కొడుకు కనిపించలేదు . హాస్పిటల్ అంతా తిరిగింది…ఎక్కడా కనిపించలేదు . దీంతో తన బాబును ఎవరో ఎత్తుకెళ్లారంటూ బోరున విలపించింది . ఇది గమనించిన కొందరు..ఇప్పటిదాకా నీతో మాట్లాడిన లేడీనే బాబును తీసుకెళ్లింది అంటూ చెప్పారు . దీంతో బాదితురాలు ఫరీదా నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది .
నీలోఫర్ హాస్పిటల్‌లో బాబు కిడ్నాప్ అనగానే…పోలీసులు హడలెత్తిపోయారు . ఏమాత్రం ఆలస్యం చేసినా…భారీమూల్యం చెల్లించక తప్పదని భావించిన ఉన్నతాదికారులు…హుటాహుటిన నాలుగు టీమ్‌లు ఫామ్ చేసారు . టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు నాంపల్లి పోలీసులు రంగంలోకి దిగిపోయారు . హాస్పిటల్‌లో ఎంట్రీ , ఎగ్జిట్ గేట్ల వద్ద మాత్రమే సీసీ కెమరాలు పనిచేస్తున్నాయి . అక్కడ ఆ అనుమానిత మహిళకు సంబందించిన ఆనవాళ్లు ఏవీ కనిపించలేదు . పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు . వెంటనే రోడ్డుపై ఉన్న కెమరాలన్నీ జల్లడ పట్టారు . తన కొడుకును తీసుకెళ్తున్న మహిళ కనిపించడం చూసిన ఫరీదా…పోలీసులకు ఆమెను చూయించింది . ఇక అక్కడి నుండి ఇన్వెస్టిగేషన్‌ను స్టార్ట్ చేసిన పోలీసులు..నీలోఫర్ హాస్పిటల్ వద్ద సెల్‌ఫోన్ టవర్ లొకేషన్స్ , రోడ్డు పై ఉన్న సీసీ కెమరాలను పరిశీలిస్తూ..బాలున్ని ఎత్తుకెల్లిన మమత ఓ ఆటోలో వెల్లినట్టు గుర్తించి…ఆ ఆటోడ్రైవర్‌ను ప్రశ్నించారు . జూబ్లీబస్‌స్టేషన్‌లో బార్యాభర్తలతో పాటు చిన్న బాబును డ్రాప్ చేసానని చెప్పడంతో…జూబ్లీబస్‌స్టేషన్‌లోని సీసీ కెమరాలను చూసారు ..కామారెడ్డి జిల్లా భాన్స్‌వాడకు బస్సులో వెళ్లినట్టు గుర్తించి…హాస్పిటల్ వద్ద మమత ఫోన్ ఎవరికి చేసిందో కనిపెట్టేసారు . ఆ సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేస్తూ వెలితే…చివరకు మమత , ఆమె భర్త శ్రీను ల వద్ద బాబును గుర్తించారు . ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు…బాబును సేఫ్‌గా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు .
ఇక్కడి దాకా బాగానే ఉన్నా….అసలు బాబును ఎందుకు ఎత్తుకెళ్లావని ఇంటరాగేషన్ చేసిన పోలీసులకు…కళ్లల్లో నీళ్లు తిరిగాయి . భార్యా భర్తలు మమత , శ్రీనులు ఇద్దరూ హైపర్ విస్కోసిటీ సిండ్రోమ్ అనే వ్యాదితో బాద పడుతున్నట్టు తెలిసింది . ఈ వ్యాది ఏంటా అని గూగుల్‌లో సర్చ్ చేసిన పోలీసులకు…రక్తం యొక్క స్నిగ్దత పెరుగుదల అని తెలిసింది . ఈ వ్యాది ఉన్న వారికి మగ పిల్లలు పుడితే ప్రాణాలతో ఉండరని వైద్యులు సైతం పోలీసులతో చెప్పారు . మమత , శ్రీను ల విషయంలో అచ్చంగా అదే జరిగింది ..ఇద్దరు మగపిల్లలు పుట్టి ..డాక్టర్లు చెప్పినట్టే ఆ పిల్లలు చనిపోయారు . ఇప్పుడు 15 రోజుల క్రితం మరో మగపిల్లాడికి మమత జన్ననిచ్చింది . ఈ సారైనా ఆడపిల్ల పుడుతుంది అని ఆశతో ఉన్న మమతకు మగపిల్లాడే పుట్టడంతో…మల్లీ ఆందోళన మొదలైంది . డాక్టర్లు కూడా…పిల్లాడు బతకడు అని చెప్పడంతో…ఇక తనకు మాతృత్వం అనుభూతి పొందే అదృష్టం లేదని భర్తతో చెప్పుకుంది . వార్డులో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న కొడుకు వద్ద భర్త శ్రీను ఉన్నాడు ..వార్డు బయట ఫరీదాతో మాటలు కలిపిన మమతకు…ఫరీదా చిన్న కొడుకు ఆమె వంక చూడటం…ఆమెను చూసి నవ్వడం…ఆమెతో ఆడుకోవడం ..ఆమెలో ఆశను పెంచింది . అమ్మతనం కోసం ఈ చిన్న తప్పు చేసినా దేవుడు నన్ను శిక్షించడులే అనుకుంది…మాతృత్వం రుచి చూసేందుకు ఇదే అదునైన అవకాశం అనుకున్న మమత…ఫరీదా చిన్న కుమారున్ని తీసుకుని నీలోఫర్ హాస్పిటల్ బయటకు వెళ్లింది ..భర్త శ్రీనుకు ఫోన్ చేసి…మల్లీ ప్రాణాలు పోయే కొడుకు దగ్గర ఏముంటావు… మనం ఓ బాబుతో ఊరెళ్లిపోదాం రమ్మని చెప్పింది. దీంతో శ్రీను కూడా మమతతో జతకలిసి.. బాబును తీసుకుని తమ ఊరెళ్లిపోయారు . చివరకు పోలీసుల ఎంట్రీతో మల్లీ బాబు ఫరీదా చెంతకు చేరాడు .
ఇప్పుడు మమతను కిడ్నాపర్ అనాలా ? మాతృత్వం కమ్మదన్నాన్ని ఆస్వాదించేందుకు ఈ పొరపాటు చేసింది అనాలా ? ఓ వైపు బాబును ఎత్తుకెళ్లినందుకు పోలీసులు కటకటాల్లోకి నెడుతున్నారు…మరోవైపు ఎప్పుడు చనిపోతాడో తెలియని కొడుకు కళ్లముందే ఇంకా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు …మమత చేసిన పొరపాటును తోటి మహిళగా ..అమ్మ అన్న పిలుపు కోసం చేసిన తప్పుగా భావించి మమత ను క్షమించేసింది . ప్రస్తుతానికి..హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న మమత , శ్రీను ల కుమారుడి వద్దే వీళ్లిద్దరినీ ఉంచుతామనీ…మాతృత్వం కోసం మమత ఆరాటపడిందని భావిస్తూ…ఆ బాబును బ్రతికించడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తామన్నారు డిసిపి వెంకటేశ్వర్లు .
బాబును ఎత్తుకెళ్లిన మమత , శ్రీను దంపతులు చేసింది పోలీసుల దృష్టిలో ముమ్మాటికీ తప్పే..అలా అని జాలిపడి వదిలేస్తే..ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మతనం కోసం మమత వేసిన తప్పటడుగు ఆమె జీవితాన్నే మార్చేసి..కటకటాల పాలు చేసింది . మమత వ్యాది గురించి విన్న ఎవరికైనా అయ్యో పాపం అనిపించక మానదు..అలా అని మరో తల్లి ఒడిలోని బిడ్డను ఎత్తుకెళ్లడం కూడా నూటికి నూరు శాతం తప్పే . ఈ కేసులో శిక్ష అనుభవిస్తుందో లేదో తెలియదు కానీ…నీలోఫర్ హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతున్న మమత , శ్రీనుల కుమారుడు ప్రాణాలతో బయటపడి…అమ్మతనం తీపిని వారికి అందించాలని మనమంతా కోరుకుందాం .