Site icon NTV Telugu

Baby Found In Toilet: పబ్లిక్‌ టాయిలెట్‌లో నవజాత శిశువు.. మాతృత్వాన్ని మరిచిన తల్లి

Baby Found In Toilet

Baby Found In Toilet

Baby Found In Toilet: హర్యానా రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసిన కన్నతల్లే పుట్టిన పసికుందును బస్టాండ్‌లోని టాయిలెట్‌ వదిలివెళ్లిన ఘటన అందరి మనసులను కలిచివేస్తోంది. అమ్మ ఒడిలో ఉండాల్సిన, తల్లి పాలు తాగుతూ సేద తీరాల్సిన పసికందు మరుగుదొడ్డిలో, మురుగువాసన మధ్య ఉన్న ఈ ఘటన ఆవేదన కలిగిస్తోంది. అమ్మ లేక అనాథగా మారిన ఆ శిశువు ఆకలితో ఏడుస్తూ కనిపించిన హృదయ విదారక ఘటన హర్యానాలోని అంబాలా కాంట్‌లో చోటుచేసుకుంది.

హర్యానాలోని అంబాలా కాంట్‌ బస్టాండ్‌లోని టాయిలెట్‌లో నాలుగైదు రోజుల ముందు పుట్టిన నవజాత శిశువును వదిలేసింది ఓ కర్కశ తల్లి. పేగు పాశం మరిచిపోయి.. అమ్మ అనే పదానికి మాయని మచ్చను తెచ్చిపెట్టింది. అంబాలా కాంట్ బస్టాండ్‌లోని టాయిలెట్‌లో నవజాత శిశువును వదిలేసిన ఆ చిన్నారిని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. పాప కామెర్లతో బాధపడుతోందని.. వయస్సు నాలుగైదు రోజులు ఉండొచ్చని వారు వెల్లడించారు.

PM Narendra Modi: 5జీ టెక్నాలజీ విద్యను మరో స్థాయికి తీసుకెళ్తుంది..

ఓ మహిళా ప్రయాణికురాలు మరుగుదొడ్డి వద్ద నేలపై శిశువును వదిలి వెళ్లినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో పనిచేసే ఓ ఉద్యోగి చిన్నారిని సివిల్‌ ఆసుపత్రిలో చేర్పించి లాల్‌కుర్తి పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాడు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారని, బస్టాండ్ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని విశ్లేషిస్తామని అంబాలా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామ్ కుమార్ తెలిపారు.

మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బీహార్‌కు చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు టాయిలెట్‌కు వెళ్లినట్లు అంబాలా కాంట్ బస్టాండ్ ఇన్‌ఛార్జ్ రాజేష్ కుమార్ తెలిపారు. టవల్‌లో చుట్టి ఉన్న శిశువును చూసి అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. బస్టాండ్‌లోని ఒక అధికారి మహిళా సిబ్బందితో టాయిలెట్‌కి వెళ్లి అక్కడి నుంచి అతడిని రక్షించారని కుమార్ తెలిపారు.

Exit mobile version