భారీ వర్షాలు, ప్రళయకారక వరదలతో నేపాల్ తీవ్రంగా విలవిలలాడుతోంది. కొండచరియలు విరిగిపడి, నదులు ఉప్పొంగడంతో వందలాది ఇళ్లు, మౌలిక వసతులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో జనాలు తమ సర్వస్వాన్ని కోల్పోయి వీధిన పడ్డారు. ఇలాంటి మహా విపత్తు సమయంలో విపరీతమైన నష్టం, ప్రాణనష్టం వాటిల్లుతుండగా, మానవత్వంలోని రెండు విభిన్న కోణాలు బయటపడ్డాయి. ఒకవైపు వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహం నుంచి కొందరు ఆభరణాలను దొంగిలించిన దారుణ ఘటన కలకలం రేపింది. నారాయణి నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహం నుంచి కొందరు దుండగులు బంగారు కమ్మలను దొంగిలించగా.. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవ్వగా.. ఆ ఘటనకు కారణమైన ఇద్దరు వ్యక్తులను నేపాల్ పోలీసులు వెనువెంటనే అరెస్టు చేశారు.
అయితే ఇదే సమయంలో మానవత్వాన్ని, ప్రామాణికతను చాటిచెప్పే మరొక సంఘటన వెలుగుచూసింది. త్రిశూలి నది వరద ఉధృతికి మట్టితో కూడిన ఒక కబోర్డ్ కొట్టుకొచ్చింది. నిర్మల్ పర్సాయి అనే యువకుడు, అతని స్నేహితులు ఆ కబోర్డును తెరిచి చూడగా.. అందులో పెద్ద మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు లభించింది. ఆ అల్మారాలోని ఒక బిల్లుపై ‘జై శ్రీ మహాలక్ష్మి గోల్డ్ అండ్ సిల్వర్ షాప్’ అని రాసి ఉండటాన్ని వారు గమనించారు.
కోట్లాది రూపాయల విలువైన ఆ సంపదను చూసి ఎలాంటి ఆశకు పోకుండా ఆ యువకులు సోషల్ మీడియా వేదికగా లభించిన బంగారం నగదు వివరాలను వెల్లడించారు. అంతేకాకుండా.. వాటి యజమానులు సరైన ఆధారాలతో తమను లేదా స్థానిక పోలీసులను సంప్రదించి తమ సొత్తును తీసుకెళ్లాలని కోరారు. నేపాల్‌లో వరదలు సృష్టిస్తున్న ఈ విషాద సమయంలోనూ, స్వార్థం లేకుండా బాధితుడికి ఆస్తిని తిరిగి అందించేందుకు ముందుకొచ్చిన ఆ యువకుడి నిజాయితీకి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు తీవ్రంగా ప్రశంసిస్తున్నారు.

