NTV Telugu Site icon

Neom: ప్రాజెక్టు అడ్డుపడ్డ వారిని చంపేయండి.. సౌదీ అరేబియా కీలక వ్యాఖ్యలు

Neom

Neom

సౌదీ అరేబియా డ్రీమ్ ప్రాజెక్టు నియోమ్. ఆ ప్రాజెక్టుకు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే చంపేయమని చెప్పింది. ఈ విషయాన్ని ఆ దేశ దళాల్లో పనిచేసిన కర్నల్‌ రభిహ్‌ ఎలెన్జీ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. గతేడాది యూకేకు శరణుకోరి వచ్చిన ఆయన.. తాజాగా నియోమ్‌ స్మార్ట్‌ సిటీ నిర్మాణం విషయంలో సౌదీ పాలకులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో చెప్పుకొచ్చారు. సౌదీ అరేబియాలో పెట్రోల్‌ నిల్వలు క్రమంగా తగ్గతున్నాయి. ప్రపంచం కూడా చమురు నుంచి గ్రీన్‌ ఎనర్జీ వైపు వేగంగా మళ్లుతోంది. సౌదీ ఆదాయానికి గండిపడే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అక్కడి పాలకులు దేశాన్ని పర్యాటక ప్రదేశం, గ్లోబల్‌ హబ్‌గా తీర్చి దిద్దేలా చేపట్టిందే ‘నియోమ్‌’ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు రూపొందించారు. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మానసపుత్రికగా ఈ ప్రాజెక్టును భావిస్తున్నారు.

READ MORE: Election Commission: డీబీటీ పథకాల అమలు.. సీఎస్‌కు ఈసీ కీలక ఆదేశాలు..

ఈ ప్రాజెక్టుకు 500 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఎర్ర సముద్ర తీరంలో మొత్తం 26,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 రకాల రీజియన్లను నిర్మించనున్నారు. 2030 నాటికి ఇక్కడి జనాభా 20 లక్షలకు చేరుకోవచ్చు. ఇక ది లైన్‌ ప్రాజెక్టును 100 మీటర్ల ఎత్తులో 200 మీటర్ల వెడల్పుతో 170 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 90 లక్షల మంది నివసించవచ్చని చెబుతున్నారు. ఈ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి ది లైన్‌ ప్రాజెక్టు 2030 నాటికి కేవలం 2.4 కిలోమీటర్ల మేరకే నిర్మాణం పూర్తవుతుందనే అంచనాలున్నాయి. దీని పనుల్లో ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ ప్రాజెక్టుకు చాలా భూసేకరణ అవసరం. దీంతో మూడు గ్రామాలను ఖాళీ చేసేందుకు 2020లో సౌదీ బలగాలు తీవ్రంగా యత్నించి విజయం సాధించాయి. ఇక్కడి ప్రజలు హువైటీ తెగకు చెందినవారు. అప్పట్లో అబ్దుల్‌ రహీం అల్‌ హువైటీ అనే వ్యక్తి తన భూమిలోకి అధికారులను రానీయలేదు. దీంతో అతడిని మర్నాడే దళాలు కాల్చేశాయి. ఆ తర్వాత జరిగిన ఆందోళనలకు సంబంధించి మొత్తం 47 మంది గ్రామస్థులను ఉగ్ర నేరాలపై అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఎవ్వరు అడ్డు వచ్చినా సహించేది లేదని ఆ దేశం వెల్లడించింది.

Show comments