NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!

  • నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీని ప్రకటించిన ఎన్‌టీఏ
  • జూన్ 21, ఆదివారం దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్ష నిర్వహణ
  • ప్రశ్నపత్రం లీక్‌, అవకతవకల ఆరోపణలతో పరీక్ష రద్దు
  • అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసిన ఎన్‌టీఏ..
Neet Ug 2026

Neet Ug 2026

NEET UG 2026: దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్రబిందువైన నీట్ (NEET) యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వెలువడింది. ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల ఆరోపణలతో రద్దైన ఈ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 21, ఆదివారం దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా వెల్లడించింది.

ఈ మేరకు ఎన్‌టీఏ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. విద్యార్థులు అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని చెప్పుకొచ్చింది.

నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. మే 3న నిర్వహించిన పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల నిరసనలు వ్యక్తమవ్వగా, కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం, పరీక్షా సంస్థలపై ఒత్తిడి పెరిగింది.

తాజాగా గురువారం అర్థరాత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో కీలక సమావేశం జరిగినట్లు సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం రీ-ఎగ్జామ్ తేదీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ అనుమతి అనంతరం ఎన్‌టీఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అధికారుల ప్రకారం, రీ-ఎగ్జామ్ ద్వారా విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి పరీక్ష నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రశ్నపత్రాల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలించాలని, అడ్మిట్ కార్డు విడుదల తేదీ, పరీక్ష సమయం వంటి వివరాలను ముందుగానే తెలుసుకోవాలని అధికారులు సూచించారు.