NTV Telugu Site icon

PM Modi: ఎన్డీఏ సీట్లపై మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు

Mdoe

Mdoe

సార్వత్రిక ఎన్నికలపై ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి (NDA) 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఆశాభావం వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం మహారాష్ట్రలోని యావత్మాల్‌లో పీఎం కిసాన్‌ నిధులు విడుదలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఈ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

పదేళ్ల క్రితం తాను ఛాయ్‌ పే చర్చ కోసం యావత్మాల్‌కు వచ్చినప్పుడు మీరు తనను ఆశీర్వదించారని తెలిపారు. దేశ ప్రజలు ఎన్డీయేను 300కు పైగా సీట్లలో గెలిపించారు. మళ్లీ 2019 ఫిబ్రవరిలో కూడా ఇక్కడికి వచ్చా. అప్పుడూ కూడా ఎంతో ప్రేమ చూపించారన్నారు. ఆ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 350 మార్కుదాటిందని వివరించారు.

ఈరోజు 2024 ఎన్నికల ముందు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చినప్పుడు దేశమంతా అదే స్వరం ప్రతిధ్వనిస్తోందని తెలిపారు. ఈసారి ఎన్డీయేకు 400కు పైగా సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. గత యూపీయే ప్రభుత్వ హయాంలో దేశంలో పరిస్థితి ఎలా ఉండేదో మీకు గుర్తుందా? అప్పట్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి మహారాష్ట్రకు చెందినవారేనని. విదర్భ రైతుల పేరిట ఢిల్లీ నుంచి ప్రకటించిన ప్యాకేజీని మధ్యలోనే తినేశారని ఆరోపించారు. రైతులు, పేదలు, గిరిజనులకు ఏమీ అందలేదని విమర్శించారు. కానీ ఈరోజు చూస్తే.. తాను ఒక బటన్‌ని నొక్కగానే పీఎం కిసాన్ నిధులు దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి చేరుతున్నాయని.. ఇదీ మోడీ హామీ అని చెప్పుకొచ్చారు.