NTV Telugu Site icon

National Girlfriends Day 2024: జాతీయ గర్ల్‌ఫ్రెండ్స్ దినోత్సవం.. ప్రత్యేకత ఏంటంటే?

National Girlfriends Day

National Girlfriends Day

National Girlfriends Day 2024: ప్రస్తుత సమాజంలో గర్ల్‌ఫ్రెండ్ అనగానే ప్రేయసి అని.. బాయ్‌ఫ్రెండ్ అనగానే ప్రియుడు అనే అర్థం వచ్చేయడం బాధ పరిచే అంశం. ఈ క్రమంలోనే ఈ రోజుల్లో స్నేహితుల్ని ఇతరులకు పరిచయం చేయాలంటే ఇబ్బందికరంగా మారింది. కానీ జాతీయ గర్లఫ్రెండ్స్ దినోత్సవం ఉద్దేశం పూర్తిగా వేరు. ఇందులో ప్రేమకు చోటు లేదు.. కేవలం స్నేహానికి మాత్రం చోటు ఉంది. స్నేహితురాళ్ల గురించి అందరికీ చెప్పుకొని వారికి శుభాకాంక్షలు చెప్పడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. స్నేహితురాళ్లు చాలా మంది మంచి సూచనలు, వారి అభిప్రాయాలతో స్నేహితులను ముందుకు నడిపేందుకు సహకరిస్తూ ఉంటారు. ప్రతి మగాడి విజయం వెనకా ఓ ఆడది ఉంటుంది అంటూ అంటారు.. కదా.. అందులో స్నేహితురాలు కూడా ఉండొచ్చు. ఓ మంచి స్నేహితురాలు ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. ఆమె తరచుగా ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. స్నేహం నుంచి ప్రేమ పుట్టడం సహజమే కానీ.. ఈ దినోత్సవం మాత్రం స్నేహితుల్ని స్నేహితులుగానే చూసి శుభాకాంక్షలు చెప్పమంటోంది.

Read Also: Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఓటమి

ఈ డే స్నేహితురాలిదే..
ఈ దినోత్సవం ప్రత్యేకంగా స్నేహితురాలిదే అంటే అమ్మాయిది. సాధారణంగా అబ్బాయిలకు అబ్బాయిలతో స్నేహం ఒకలా ఉంటుంది.. అమ్మాయిలతో మరోలా ఉంటుంది. అబ్బాయిలు అబ్బాయిలతో రఫ్ అండ్ టఫ్‌గా వ్యవహరిస్తారు. అరేయ్, ఒరేయ్ అనుకుంటారు. ఇష్టమొచ్చిన జోక్స్ వేసుకుంటారు. అక్కడ హద్దులు అనేవి ఉండవు. అదే అమ్మాయితో స్నేహం దగ్గరకు వచ్చేసరికి గౌరవం, మర్యాద, బాధ్యత ఇలాంటివి చాలా ఉంటాయి. అలాంటి స్నేహాలు సమాజంలో అందరి మెప్పూ పొందుతాయి. అలాంటి స్నేహితులు ఉన్నవారు అదృష్టవంతులే. వారు ఇవాళ తమ స్నేహితురాళ్లకు శుభాకాంక్షలు చెప్పుకోవాలి.

జాతీయ గర్ల్‌ఫ్రెండ్స్ దినోత్సవం ఎలా వచ్చింది..
ఆగస్ట్ 1, 2004లో లగ్జరీ లైఫ్ స్టైల్ గురువైన సుశాన్ ఈ జాతీయ స్నేహితురాళ్ల దినోత్సవాన్ని సృష్టించారు. ఈ రోజున మహిళా స్నేహితురాళ్లు.. ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. క్రమంగా ఇది మరింత విస్తరించింది. అబ్బాయిలు కూడా మహిళా స్నేహితురాళ్లకు ఇవాళ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ గర్ల్ ఫ్రెండ్ అనే పదం.. 1863 లో వాడుకలోకి వచ్చింది. 1920 లో గర్ల్ ఫ్రెండ్ అనే పదానికి క్రమంగా అర్థం మారిపోయి… ప్రియురాలు అనే మీనింగ్ తయారైంది. ఇదే సమస్యగా మారింది. ఇప్పుడు కొత్తగా నిబ్బీ, నిబ్బా వంటి పదాలు వాడుతున్నారు. 1978లో గర్ల్‌ఫ్రెండ్స్ అనే సినిమా రిలీజైంది. 2002లో ‘గర్ల్ ఫ్రెండ్స్ గేట్ వే’ పుస్తకం కూడా విడుదల కావడం గమనార్హం.

ఈ దినోత్సవం రోజున ఏం చేయాలంటే..
ఈ రోజున స్నేహితురాళ్లను రెస్టారెంటుకో, సినిమాకో, స్పా కో, షాపింగ్ కో… ఎక్కడికైనా తీసుకెళ్లి.. వారి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకోవాలట. ఇలా తీసుకెళ్లేవారు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. తీసుకెళ్లేది ఎవరన్నది విషయం కాదు.. స్నేహాన్ని ఎలా చాటుకున్నారన్నదే ముఖ్యం. ఇన్నాళ్లూ స్నేహం ద్వారా తోడుగా ఉంటూ… ఎన్నో కష్టాల్లో వెన్ను దన్నుగా నిలిచే స్నేహితురాళ్లకు ఇవాళ చిన్న సర్‌ఫ్రైజ్ చెయ్యొచ్చు. ఏదైనా గిఫ్ట్ ఇవ్వొచ్చు. ఆమె పేరుతో ఎవరైనా పేదవాళ్లకు సాయం చెయ్యొచ్చు. ఇలా ఏది చేసినా ఆమెకు సంతోషం కలిగించేది చెయ్యాలంటున్నారు.

Show comments