Kishan Reddy: ప్రచారం కోసమో, లైక్‌ల కోసమో యాత్ర చేయడం లేదు.. ‘నషా ముక్త్ భారత్’పై కేంద్ర మంత్రి..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: కేవలం ప్రచారం కోసమో, లైక్‌ల కోసమో తాము ఈ యాత్ర చేయడం లేదని, సమాజ హితం కోసమే ‘నషా ముక్త్ భారత్’ యాత్రను నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మహత్తర కార్యక్రమంపై మీడియా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు. ఒక విద్యార్థి డ్రగ్స్‌కు బానిస అయితే ఆ కుటుంబం మొత్తం నాశనం అవుతుందని, దాని ప్రభావం దేశంపై కూడా పడుతుందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మత్తుపదార్థాలు యువతలోని ప్రతిభను (టాలెంట్) దెబ్బతీస్తాయని, ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతలో ఉందని ఆయన పేర్కొన్నారు. నిన్న తాను నిర్వహించిన పాదయాత్రకు వచ్చిన స్పందన చూశాక, డ్రగ్స్ రహిత దేశం కోసం ప్రజలందరూ ముందుకు వస్తారనే పూర్తి విశ్వాసం కలిగిందని తెలిపారు.

కొందరు దేశద్రోహులు, మూర్ఖులు గిరిజన ప్రజలను, రైతులను మభ్యపెట్టి మోసం చేసి దట్టమైన అడవులలో (డీప్ ఫారెస్ట్) గంజాయి మొక్కలు పెట్టిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బస్తీ బస్తీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా అరికడతాయని స్పష్టం చేశారు. ఇక, ఈ రోజు జరిగే పాదయాత్రలో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, నిర్మాత బెల్లంకొండ సురేష్, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య తదితరులు పాల్గొంటారని కేంద్ర మంత్రి వెల్లడించారు. అలాగే ట్యాంక్ బండ్‌పై ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో కూడా వీరు పాల్గొంటారని, రేపు జరగబోయే యాత్రలో ప్రముఖ సినీ నటులు చిరంజీవి, అక్కినేని నాగార్జున పాల్గొంటారని తెలిపారు.