Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్‌ ఫైర్!

  • విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం
  • ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి
  • బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి లోకేశ్‌
Nara Lohesh Steel Plant

Nara Lohesh Steel Plant

Nara Lokesh Visits Vizag Steel Plant Accident Victims: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ శ్రీభరత్ తదితరులు కేజీహెచ్‌ను సందర్శించి.. బాధిత కుటుంబాలను పరామర్శించారు.

కేజీహెచ్‌లో మృతుల కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి నారా లోకేశ్.. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న లోకేశ్.. అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే కేజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

×
×
Ad

మృతుల కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడికి చేరుకున్న వామపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రులను నిలదీశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌కు, వామపక్ష నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాలకు కేవలం ఆర్థిక సాయం ప్రకటించడం సరిపోదని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన నారా లోకేశ్.. ‘మేము ఇక్కడికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు. బాధిత కుటుంబాలకు అండగా నిలవడానికి వచ్చాం. ప్రభుత్వం తరఫున వారికి అన్ని విధాలా సహాయం అందిస్తాం’ అని స్పష్టం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇక ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే విచారణ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి బాధ్యులెవరు, భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించగా.. బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందించేందుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.