Site icon NTV Telugu

Nara Brahmani : నువ్వేంటో తెలియజేశావు.. లోకేష్‌పై బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్‌

Nara Bhahmani

Nara Bhahmani

ఐటీ, మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్ ఇవాళ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లోని 208వ నంబర్‌ గదిలోకి లోకేష్‌ ప్రవేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన ఐదు ఫైళ్లను పరిశీలించేందుకు మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై లోకేష్ సంతకం చేసి, సోమవారం సమావేశం కానున్న మంత్రివర్గానికి పంపారు. అయితే.. లోకేష్‌ మంత్రి బాధ్యతలు స్వీకరించడంపై నారా బ్రహ్మణి ఆసక్తికర ట్వీట్‌ చేశారు. “అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే, అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి, సిమెంట్ రోడ్లతో, ఎల్ఈడీ వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశావ్. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు. నీ వ్యక్తిత్వహననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్ల‌కు నువ్వేంటో తెలియజేశావు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొన్నావు. నీ సమర్ధతతో నేటితరం, భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది. కుటుంబపరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్ నారా లోకేష్” అంటూ నారా బ్రహ్మణి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

Exit mobile version