NTV Telugu Site icon

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు.. కుప్పంలో నాకు మద్దతు ఇస్తారా..? చంద్రబాబుకా?

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నిజం గెలవాలి పేరుతో వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె.. రెండు రోజుల క్రితం కుప్పం చేరుకున్నారు.. నిన్న, మొన్న, ఈ రోజు కుప్పంలో పర్యటిస్తున్నారు.. ఈ రోజు అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించిన భువనేశ్వరి.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సరదాగా మాట్లాడారు.. కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి మద్దతిస్తారా..? అంటూ సరదాగా సభలో పాల్గొన్నవారిని ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఆయనకు రెస్ట్‌ ఇస్తాం.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అంటూ భువనేశ్వరి చమత్కరించారు.

అయితే, ఇద్దరూ కావాలంటూ చేతులెత్తారు సభికులు.. అలా కుదరదు.. ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ సరదాగా అడిగారు భువనేశ్వరి.. సరదాగా అంటున్నా.. నేను చాలా హ్యాపీగా ఉన్నా.. రాజకీయాలకు నేను దూరంగా ఉంటానంటూ తర్వాత వ్యాఖ్యానించారు.. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు.. అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలన్నారు నారా భువనేశ్వరి.. అయితే, భువనేశ్వరి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. భువనేవ్వరి వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కొందరు నెగిటివ్‌ కామెంట్లు పెడుతుంటే.. మొత్తం వీడియో చూడాలంటూ.. తెలుగుదేశం పార్టీ కౌంటర్‌ ఎటాక్‌కు దిగుతోంది.