న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరగా, తాజాగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, రూమర్లపై నాని మరియు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఓపెన్‌గా మాట్లాడారు.
సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాలో రకరకాల వదంతులు హల్ చల్ చేశాయి. సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ ఉందని, వెయ్యి మందితో ఫైట్ ఉంటుందని, డైరెక్టర్ ఎవరినో కొట్టారంటూ ప్రచారం జరగడంపై నాని తీవ్రంగా స్పందించారు. అవన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఇక సినిమాలో తన లుక్ కోసం వేసుకున్న జడల బరువు గురించి వస్తున్న చర్చలపై స్పందిస్తూ.. ఆ యాక్షన్ సీక్వెన్స్‌లలో రోప్ వర్క్ కారణంగా జడలు ఇరుక్కుని స్కాల్ప్‌కు గాయాలయ్యాయని, ఆ కష్టాన్ని చూసి కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ ఎమోషనల్ అయి ఆ మాట అన్నారే తప్ప దాన్ని పెద్దది చేయవద్దని కోరారు.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. ఇది కేవలం తన సినిమా కాదని, ‘జనం సినిమా’ అని అభివర్ణించారు. కాళోజీ గారి మాటలను గుర్తు చేస్తూ.. ఒక సవారీ జాతి, తల్లి కొడుకుల మధ్య నడిచే బలమైన రెవల్యూషనరీ ఎమోషనల్ ఫిలిం ఇదని తెలిపారు. ఈ సినిమా కోసం అందరూ ప్రాణం పెట్టి పనిచేశారని, థియేటర్‌లో ఆడియన్స్‌కు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ దొరుకుతుందని నాని భరోసా ఇచ్చారు. ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఎలాంటి ట్రైలర్ ప్రమోషన్స్ లేకుండా నేరుగా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ ‘ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి!

