Natural Star Nani: టాలీవుడ్‌లో ఎందరో యువ కథానాయకులు ఉన్నప్పటికీ, నేచురల్ స్టార్ నాని సొంతం చేసుకున్న క్రేజ్ విభిన్నమైనది. కెరీర్ తొలినాళ్ల నుంచే కుటుంబ కథా చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం అతడికి ఎంతో కలిసొచ్చింది. సినిమా కంటెంట్ సాధారణంగా ఉన్నా, కేవలం కుటుంబ ప్రేక్షకుల ఆదరణతోనే నాని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకునేవి. అయితే, మాస్ ఇమేజ్ సాధిస్తేనే స్టార్‌డమ్ మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో నాని తన పంథా మార్చుకుని భారీ యాక్షన్ చిత్రాల వైపు అడుగులు వేశాడు. ఈ క్రమంలో వచ్చిన ‘దసరా’ ఘనవిజయం సాధించడంతో, ఆ తర్వాత ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’ వంటి సినిమాల్లో హింస, రక్తపాతంతో కూడిన పాత్రలను ఎంచుకున్నాడు.
అయితే, సహజమైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన నాని, ఇలా రా అండ్ రస్టిక్ పాత్రల్లో విపరీతమైన హింసను పండించడం సాధారణ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ముఖ్యంగా ‘ది ప్యారడైజ్’ సినిమా తీవ్ర విమర్శలు, ట్రోలింగ్‌కు గురై పరాజయం పాలవడంతో నాని మార్కెట్‌పై ప్రభావం పడింది. ఇక, వరుసగా యాక్షన్ సినిమాలు చేసి విసిగిపోయిన నాని, దెబ్బతిన్న తన ఫ్యామిలీ హీరో ఇమేజ్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కొంతకాలం పాటు యాక్షన్ జానర్‌కు విరామం ఇచ్చి, కుటుంబ విలువలతో కూడిన కథలను తెరకెక్కించే దర్శకులకు ప్రాధాన్యత ఇస్తున్నాడట.
‘ది ప్యారడైజ్’, ‘ఓజీ’ చిత్రాల కంటే ముందే దర్శకుడు సుజిత్‌తో ‘బ్లడీ రోమియో’ అనే ప్రాజెక్ట్‌కు నాని అంగీకారం తెలిపాడు. ఈ చిత్రంలో యాక్షన్ పాళ్లు ఏ మేరకు ఉంటాయో కానీ, దీని తర్వాత చేయబోయే సినిమాలన్నీ పూర్తిగా ఫ్యామిలీ, ఎమోషనల్ జానర్‌లోనే ఉండేలా నాని జాగ్రత్త పడుతున్నాడట. అంతేకాకుండా, ‘ది ప్యారడైజ్’ కోసం రెండేళ్ల సుదీర్ఘ సమయం కేటాయించినట్లు కాకుండా, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే షూటింగ్ పూర్తయ్యేలా తన తదుపరి సినిమాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటున్నాడు.
ఇందులో భాగంగానే, తమిళంలో భావోద్వేగాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరుగాంచిన ప్రేమ్ కుమార్ చెప్పిన కథకు నాని ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా ’96’, కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో ‘సత్యం సుందరం’ వంటి హృదయాన్ని కదిలించే చిత్రాలను అందించిన ప్రేమ్ కుమార్, ఇప్పుడు నాని కోసం ఎలాంటి ఎమోషనల్ డ్రామాను సిద్ధం చేస్తారోనని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు, ‘ఇరుముడి’ వంటి భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు శివ నిర్వాణతోనూ నాని జతకట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో నాని నటించిన ‘నిన్ను కోరి’ చిత్రంతోనే శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన ‘టక్ జగదీష్’ నిరాశపరిచినప్పటికీ, ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్‌పై మళ్లీ అంచనాలు ఏర్పడ్డాయి. శివ నిర్వాణ చిత్రాలన్నీ కుటుంబ బంధాల చుట్టూనే తిరుగుతాయనే విషయం తెలిసిందే. నాని రాబోయే సినిమాల జాబితాను గమనిస్తే, ఆయన మాస్, యాక్షన్ బాటను పక్కన పెట్టి మళ్లీ తనకు ఎంతో కలిసొచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వైపు యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

