Nam vs SA: Nam vs SA: క్రికెట్‌లో మరో భారీ సంచలనం నమోదైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న నమీబియా.. పటిష్టమైన సౌతాఫ్రికాకు షాకిచ్చింది. నమీబియా టీ20 ట్రై సిరీస్ 2026లో భాగంగా ఆగస్టు 28న విండ్‌హోక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో నమీబియా 18 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. దీంతో సౌతాఫ్రికాపై టీ20 ఇంటర్నేషనల్స్‌లో నమీబియా తన 100% విజయాల రికార్డును కొనసాగించింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే నమీబియా బ్యాటర్లు ఆ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఓపెనర్లు లారెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్ తొలి వికెట్‌కు ఏకంగా 84 పరుగులు జోడించి జట్టుకు మంచి శుభారంభం అందించారు. స్టీన్‌క్యాంప్ 29 బంతుల్లో 41 పరుగులు చేయగా, ఫ్రైలింక్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 38 బంతుల్లో 60 పరుగులు సాధించాడు. ఆ తర్వాత వికెట్లు వరుసగా పడినప్పటికీ.. నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ప్రెనెలన్ సుబ్రాయెన్ 3 వికెట్లు, బ్జోర్న్ ఫోర్టుయిన్ 2 వికెట్లు పడగొట్టారు. అయితే నమీబియాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆ జట్టు బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే నమీబియా బౌలర్లు షాకిచ్చారు. టాప్ ఆర్డర్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో సౌతాఫ్రికా కష్టాల్లో పడింది. అయితే డెవాల్డ్ బ్రేవిస్ అద్భుతమైన పోరాటం చేశాడు. ‘బేబీ ఏబీ’గా గుర్తింపు పొందిన బ్రేవిస్ 50 బంతుల్లో 75 పరుగులు చేశాడు. బ్రేవిస్ క్రీజులో ఉన్నంతసేపు సౌతాఫ్రికా విజయంపై ఆశలు కొనసాగాయి. అయితే 18వ ఓవర్‌లో అతడు ఔట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా నమీబియా వైపు మళ్లింది. చివర్లో డువాన్ జాన్సెన్ 17 బంతుల్లో నాటౌట్‌గా 25 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెల్‌మన్, జేజే స్మిత్ చెరో 3 వికెట్లు.. జాక్ బ్రాసెల్, మాక్స్ హెయింగో చెరో వికెట్ తీశారు. దీంతో నమీబియా 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో నమీబియా సౌతాఫ్రికాపై టీ20 ఇంటర్నేషనల్స్‌లో అరుదైన రికార్డు సృష్టించింది. ఇరు జట్లు ఇప్పటివరకు రెండు టీ20 మ్యాచ్‌ల్లో తలపడగా, రెండింటిలోనూ నమీబియానే విజయం సాధించింది. ఇంతకుముందు 2025లో జరిగిన ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికాను నమీబియా 4 పరుగుల తేడాతో ఓడించింది. తాజాగా మరోసారి విజయం సాధించడంతో సౌతాఫ్రికాపై నమీబియా 100% విజయాల రికార్డును కొనసాగించింది. ఈ విజయంతో సౌతాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్టును టీ20 ఇంటర్నేషనల్స్‌లో రెండుసార్లు ఓడించిన తొలి అసోసియేట్ జట్టుగా నమీబియా నిలిచింది. ఇప్పటివరకు సౌతాఫ్రికాను టీ20 ప్రపంచకప్‌లో ఓడించిన మరో అసోసియేట్ జట్టుగా నెదర్లాండ్స్ ఉంది.

