Nallimilli Rama Krishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. నిన్న బీజేపీ తన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా శివకృష్ణంరాజు పేరును ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. టీడీపీ కరపత్రాలను, జెండాలను కుప్పలుగా తగలబోసి అందులో ఓ సైకిల్‌ను వేసి కాల్చేశారు. అధిష్టాన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి గురైన నల్లమిల్లి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. వాస్తవానికి, పొత్తు కుదురకముందు అనపర్తి స్థానాన్ని టీడీపీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించింది. కానీ పొత్తుతో పరిస్థితులు మారిపోగా, అనపర్తి స్థానం బీజేపీకి కేటాయించారు. ఈ పరిణామంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఓ దశలో భావోద్వేగాలు భరించలేక కంటతడి పెట్టుకున్నారు. \
Read Also: AP High Court: మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట
పార్టీ అగ్రనాయకత్వం టికెట్ ఇవ్వకపోవడంపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటానని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. కుటుంబ సభ్యులతో సహా ప్రజల్లోకి వెళతానని స్పష్టం చేశారు. అటు, తన బిడ్డకు టికెట్ దక్కలేదంటూ నల్లమల్లి రామకృష్ణారెడ్డి తల్లి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడిని హత్తుకుని విలపించారు. ‘‘నాకు టికెట్ రాకుండా పెద్ద కుట్ర చేశారు. నాకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తా’’ అంటూ ఆయన కన్నీళ్లు పెట్టకున్నారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో ప్రజల్లోకి వెళ్తానన్న ఆయన.. ప్రజల నిర్ణయం మేరకు పోటీ చేస్తానని ప్రకటించారు. ‘‘నేను టీడీపీకి మద్దతివ్వను. బీజేపీకి కూడా ఓటు వేయమని చెప్పను. చంద్రబాబు నన్ను నమ్మించి మోసం చేశారు. నా నియోజకవర్గంలో ఏ మాత్రం బలం లేని బీజేపీకి ఎలా సీటు కేటాయిస్తారు?.. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చేది లేదు’’ అంటూ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.
అనపర్తిలో నల్లమిల్లి అనుచరుల ఆగ్రహావేశాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనపర్తి సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారంటూ నల్లమిల్లి అనుచరుల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. నల్లమిల్లికి టికెట్ దక్కకపోవడంతో ఆయన మద్దతుదారుల్లో ఇద్దరు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, మరొకు భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నించారు. ఇతర కార్యకర్తలు నచ్చజెప్పడంతో వారు ఆత్మహత్య ప్రయత్నం విరమించుకున్నారు. తమ నేతకు టికెట్ కేటాయించలంటూ నల్లమిల్లి మద్దతుదారులు టీడీపీ జెండాలను, ఫ్లెక్సీలను అగ్నికి ఆహుతి చేశారు.