కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. 10 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ జాబితా ప్రకటించగా.. కొందరు సీనియర్ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ ముంబై యూనిట్ ఉపాధ్యక్షురాలు, నటి నగ్మా కూడాఉన్నారు. 2003-2004లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రాజ్యసభ అవకాశం ఇస్తామని సోనియా హామీ ఇచ్చారని.. అయితే 18 ఏళ్లు దాటినా తనకు అవకాశం ఇవ్వలేదని నగ్మా ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్ గర్హిని అవకాశం కల్పించారని.. తనకు అర్హత లేదా అని ఆమె ప్రశ్నించారు. తన 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు తక్కువైందా అని వాపోయారు.
Bharatiya Janata Party: రాజ్యసభ స్థానాలకు తొలి జాబితా ప్రకటన
కాగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ కూడా ఆదివారం తొలి జాబితాను ప్రకటించింది. రాజ్యసభలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 29 మంది సభ్యులున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో రాజస్థాన్‌లో 3, ఛత్తీస్‌గఢ్‌లో రెండు, తమిళనాడు, జార్ఖండ్, మహారాష్ట్రలో ఒక్కోటి చొప్పున రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడం పక్కాగా కనిపిస్తోంది. హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ ఒక్కో స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో పెద్దల సభలో కాంగ్రెస్ బలం 33కి చేరే అవకాశం ఉంది.