NTV Telugu Site icon

Nagarjuna Akkineni: సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు.. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటా..

Nagarjuna

Nagarjuna

Nagarjuna Akkineni: హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎన్‌-కన్వెన్షన్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయని నాగార్జున పేర్కొన్నారు. ఎన్‌ కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి అని, ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదన్నారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని ప్రత్యేక న్యాయస్థానం ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్(నిషేధ) చట్టం ప్రకారం 2014 ఫిబ్రవరి 24న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగిందన్నారు. ప్రస్తుతం , నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించామన్నారు. న్యాయస్థానం తీర్పుకు తాను కట్టుబడి ఉంటానని నాగార్జున వెల్లడించారు. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని అభిమానులు, శ్రేయోభిలాషులను నటుడు నాగార్జున అభ్యర్థించారు.

హీరో అక్కినేని నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్షన్‌ను హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) బృందం కూల్చివేసింది. తుమ్మిడి చెరువును క‌బ్జా చేసి ఈ నిర్మాణం చేప‌ట్టార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మూడున్నర ఎక‌రాలు క‌బ్జా చేసి క‌న్వెన్షన్‌ను నిర్మించార‌నే ఫిర్యాదులు అధికారుల‌కు అందాయి. ఈ నేప‌థ్యంలో శ‌నివారం తెల్లవారు జాము నుంచే అధికారులు ఎన్ క‌న్వెన్షన్ కూల్చివేత ప‌నుల‌ను చేపట్టారు.

 

Show comments