NTV Telugu Site icon

Konidela NagaBabu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు!

Konidela Nagababu

Konidela Nagababu

శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమాచారం ఇచ్చారు. నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ ఆదేశించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు.

ఇటీవల ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కోరిక మేరకు ముందుగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం భావించారు. కానీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంకు ఎంపిక చేశారు. దాంతో నాగబాబుకు రాజ్యసభ అంటూ వస్తున్న ప్రచారానికి జనసేన తెరదించింది. నాగబాబుకు సినిమాటొగ్రఫీ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లకు మార్చి 10 చివరి గడువు. ప్రభుత్వ సెలవు రోజులు మినహాయించి.. మిగిలిన ఏ రోజైనా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ శాసనసభ భవనంలో నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. మార్చి 11న ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన, మార్చి 13న మధ్యాహ్నం 3 గంటల్లోపు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.