ఇటీవల సోషల్ మీడియాలో విడుదల అయిన రష్మిక మందన్నా ఫేక్ వీడియోపై సినీ ప్రముఖులు ఎంతో మంది ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఈ విషయం పై మొదట గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించారు..ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసే వారి పై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు..అలాగే తాజాగా టాలీవుడ్ నుంచి నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్ మరియు చిన్మయి శ్రీపాద లాంటి వాళ్లు కూడా సోషల్ మీడియా ద్వారా రష్మికకు మద్దతు తెలిపారు.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానిని దుర్వినియోగం చేస్తూ సదరు వ్యక్తుల పరువును బజారున పడేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై అందరూ స్పందించాలని, ఇలాంటి చర్యలను అరికట్టడానికి కఠినమైన చట్టాలను తీసుకురావాలని వారు అన్నారు.
రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. “టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న తీరు చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. ఇది భవిష్యత్తులో ఎక్కడికి దారి తీస్తుందో ఊహించుకుంటేనే ఎంతో భయమేస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటికి బాధితులవుతున్న వారిని రక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలి. ధైర్యంగా ఉండు రష్మిక” అని చైతన్య ట్వీట్ చేశాడు.అలాగే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రష్మిక అంశంపై మృణాల్ ఠాకూర్ స్పందించింది. “ఇలాంటి పనులు చేసే వారికి సిగ్గుండాలి. అలాంటి వాళ్ల మనస్సాక్షి చచ్చిపోయినట్లు నాకు అనిపిస్తోంది. దీనిపై ధైర్యంగా మాట్లాడినందుకు రష్మిక కు నా అభినందనలు. చాలా మంది దీనిపై ఇంకా మౌనంగా ఉన్నారు.ప్రతి రోజూ ఫిమేల్ యాక్టర్స్ ఫొటోలను ఇలా మార్ఫింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో రిలీజ్ చేస్తున్నారు… ఓ సమాజంగా అస్సలు మనం ఎక్కడికి వెళ్తున్నాం..మేమూ మనషులమే కదా. ఎవరూ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు. మౌనంగా ఉండకండి” అని మృణాల్ రాసుకొచ్చింది.ఇక సింగర్ చిన్మయి శ్రీపాద స్పందిస్తూ.. ఇలాంటి అంశాలపై దేశవ్యాప్తంగా బాలికలు మరియు మహిళల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అప్పుడే వీటిని అరికట్టగలుగుతామని ఆమె చెప్పింది.తనకు మద్దతుగా నిలుస్తున్న వారికి రష్మిక కృతజ్ఞతలు చెప్పింది.