ఏపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ కుట్ర పేరుతో జనసేనపై బురద జల్లుతున్నారని, దీనిపై రాష్ట్ర డీజీపీ విచారణ చేయించాలన్నారు. ఇటువంటి ప్రచారాలు మీడియాకు ఎవరి ద్వారా వెళ్లాయో మాకు తెలుసు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటమే జన సైనికులకు తెలుసు. జనసైనికులు, వీర మహిళలు వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలన్నారు మనోహర్. ఈమేరకు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది.
‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని జనసేన పార్టీ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది… ప్రజాస్వామ్య పద్ధతుల మీద జనసేనకు అపార గౌరవం ఉంది. జన సైనికులు, వీర మహిళలు వ్యవస్థలు, వ్యక్తుల మీద దాడులు చేసే సంప్రదాయానికి పూర్తి దూరం. ఏ ప్రజా పోరాటమైనా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటుంది. అలాంటి జనసేన పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న సాయంత్రం నుంచి వైసీపీ కొత్త కుట్ర మొదలుపెట్టింద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 మంది వైసీపీ ప్రజా ప్రతినిధులపై జనసేన పార్టీ శ్రేణులు ఏ క్షణమైనా దాడులు చేసే అవకాశం ఉందంటూ… పోలీసు ఇంటిలిజెన్స్ నివేదిక అంటూ సమాచారాన్ని మీడియాకు ఇచ్చి, కొత్త కుట్రల ప్రచారం మొదలుపెట్టారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వీడియో సందేశం ఇచ్చారు.
Read Also: Rishi Sunak: బ్రిటన్ ప్రధాని పదవికి అభ్యర్థిత్వం ప్రకటించిన రిషి సునాక్
‘‘శనివారం సాయంత్రం నుంచి మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పోలీసు ఇంటిలెజెన్స్ హెచ్చరికల పేరుతో ఓ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని 13 మంది వైసీపీ ప్రజాప్రతినిధుల మీద జనసేన పార్టీ శ్రేణులు దాడులు చేస్తాయని హెచ్చరించినట్లు ప్రచారం మొదలైంది. దీన్ని జనసేన పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. ఒక వేళ రాష్ట్ర పోలీసుశాఖ జారీ చేసిన ఉత్తర్వులు నిజమే అయితే కచ్చితంగా డీజీపీ దీనిపై చర్యలు తీసుకోవాలి. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ఇంటిలిజెన్స్ ఉత్తర్వులు ఎలా మీడియాకు వెళ్లాయో దర్యాప్తు చేయాలి.
మా ఫోన్లు, మా మీద నిఘా పెట్టడం మాని ఈ రహస్య అంశాలు ఎలా బయటకు వెళ్తున్నాయో డీజీపీ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి ద్వారా ఈ ప్రచారాలు బయటకు వెళ్తున్నాయో మాకు సమాచారం ఉంది. రోజురోజుకీ జనసేన పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న జనాదరణ చూసి అసూయ చెందుతున్న అధికార పక్షం ఇలాంటి కుట్రలకు తెర లేపుతోంది. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన ర్యాలీలో ఏకంగా డీసీపీని పవన్ కళ్యాణ్ వాహనంపైకి ఎక్కించి, ఎలాగోలా రెచ్చగొట్టాలని, గొడవలు సృష్టించాలని చూసిన ప్రభుత్వం అది సాధ్యం కాకపోవడంతో కొత్త కుట్రలకు తెరలేపింది.
అలజడి, అపోహలు, అయోమయం, అనుమానాలు ప్రజల్లో సృష్టించి దీని ద్వారా గొడవలు సృష్టించి, జనసేన పార్టీ మీద నెట్టేయాలన్నదే ఈ పాలకుల ఉద్దేశ్యం. వారి కుట్రలు పారలేదు. టెక్కలిలో జనసేన పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినా ఇప్పటి వరకు ఆ కేసులో పురోగతి సాధించని ఈ ప్రభుత్వం, కొత్త కుట్రలు మొదలుపెట్టిందనే విషయాన్ని జనసైనికులు గుర్తుంచుకోవాలి.
వచ్చే ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా తేల్చుకునేందుకు జనసేన సిద్ధంగా ఉంది. జనసేన పార్టీనా… వైసీపీనా అన్నది ప్రజలే తేలుస్తారు. ప్రజలు ఎవర్ని ఆదిరిస్తారో, ఎవరి వైపు నిలబడతారో తేలుతుంది. జనసేన పార్టీ మీద మీరు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రజాప్రతినిధులు రోజుకు 200 గడపలు తిరుగుతున్నారు. అదీ కూడా ముందుగానే ఆయా ప్రాంతాల వాలంటీర్లు ప్రజలకు సమాచారం ఇచ్చి, జాగ్రత్తలు చెప్పిన తర్వాతే ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు. మరి దీనిలో కూడా దాడులు జరుగుతాయి అని చెప్పడం వెనుక అంతర్యం ఏమిటీ..?
జన సైనికులెవరూ ప్రజా సమస్యలపై ఎప్పుడూ శాంతియుతంగా, ప్రజాస్వామికంగా పోరాడుతారు తప్పితే, ఎప్పడూ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పిన గీత దాటరు. నాయకుడు నేర్పిన క్రమశిక్షణ తప్పక పాటిస్తారు. వైసీపీ వారి కుట్రలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజా పోరాటాలను కచ్చితంగా జనసేన పార్టీ చేస్తుంది. వాటిని ఎక్కడా అప్రజాస్వామిక పద్ధతుల్లో మాత్రం చేయదు. ప్రభుత్వ కుట్రలను జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు బలంగా తిప్పికొట్టాలని నాదెండ్ల మనోహర్ ప్రకటనలో అన్నారు.
Read Also: Rishab Shetty: ‘కాంతార’ హీరో కఠిన నిర్ణయం.. ఆ సినిమాలే చేస్తాడట