కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే.. మునుగోడులో గులాబీ జెండా ఎగురవేయాలని అధికార టీఆర్‌ఎస్ పార్టీ ధృఢనిశ్చయంతో ఉంది. కానీ.. ఆ నియోజకవర్గంలోని అసమ్మతి నేతలతో ఆ పార్టీకి సెగలు పుట్టిస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నిలబెట్టేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకునే యోచనలో ఉండగా.. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే మద్దతుగా ఉండలేమన్నట్లుగా నియోజకవర్గంలోని గులాబీదళం సంకేతాలు ఇచ్చింది. అయితే.. ఇప్పటికే ఓ సారి మంత్రి జగదీష్ రెడ్డి అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా.. ఈ మునుగోడు అసమ్మతి నేతలను నేరుగా పార్టీ అధినేత కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు మంత్రి జగదీష్ రెడ్డి. అయితే.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ అసమ్మతి లేదని, ఆశావాహులు మాత్రమే ఉన్నారంటూ వెల్లడించారు.
అయితే.. తాజాగా.. మునుగోడు టీఆర్ఎస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండు రోజుల క్రితం ప్రగతిభవంలో సమావేశమైనప్పటికీ అసమ్మతినేతలలో అసంతృప్తి చల్లారలేదు. ఓవైపు మంత్రి నియోజకవర్గంలో పర్యటిస్తుండగానే.. మరోవైపు అసమ్మతినేతల సమావేశం జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి ఒకవైపు అసమ్మతి లేదని మీడియా ముందు చెబుతుండగా…. మరోవైపు చౌటుప్పల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా 300 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశం నిర్వహిస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని తీర్మానం చేసుకున్నారు. ఈ పరిణామాలు మంత్రికి పెద్ద తలనొప్పిగా మారాయి.
