Site icon NTV Telugu

Salman Khan Case: కాల్పుల కేసులో మరో నిందితుడు అరెస్ట్

Salman

Salman

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై కాల్పుల కేసులో మరో నిందితుడ్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ రఫీక్ చౌదరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతడు సల్మాన్ ఖాన్ ఇంటి వీడియోను చిత్రీకరించినట్లుగా గుర్తించారు. అనంతరం దానిని గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్‌కు పంపించాడు. ఈ వీడియో ఆధారంగా షూటర్లు కాల్పులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువుర్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో నిందితులకు సంబంధించిన బంధువుల్ని అదుపులోకి తీసుకుని కూడా విచారించారు. ఇక అరెస్టైన నిందితుల్లో ఒకరు జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల అనూజ్‌ను ఏప్రిల్‌ 26న అరెస్ట్ చేశారు. బాత్రూమ్‌కు వెళ్లి బెడ్‌షీట్‌తో ఉరేసుకున్నాడు.

ఏప్రిల్‌ 14న సల్మాన్‌ ఇంటిపై కాల్పులు జరిగాయి. ఆయన నివాసం ఉంటున్న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో గల గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ దగ్గరకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన అనంతరం దుండగులు బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్‌ అయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కాల్పులు జరిపిన నిందితులు విక్కీ గుప్తా, సాగర్‌ పాల్‌ను అరెస్టు చేశారు. అనంతరం వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనూజ్‌ తపన్‌, సోను సుభాశ్‌ చందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా సభ్యులుగా పోలీసులు గుర్తించారు. సల్మాన్‌ ఇంటి దగ్గర కాల్పులకు పాల్పడింది తామేనంటూ లారెన్స్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. సల్మాన్‌ ఖాన్‌పై బిష్ణోయ్‌ గ్యాంగ్‌ గతంలోనూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది. దీంతో అప్పటి నుంచి నటుడికి వై ప్లస్‌ భద్రత కల్పిస్తున్నారు.

ఇదెలా ఉంటే సల్మాన్ ఖాన్ నివాసానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.

Exit mobile version