ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. వారి కోసం ఎంతో శ్రమిస్తారు. తమ పిల్లలు ప్రయోజకులైతే ఆ పేరెంట్స్‌కు అంతకంటే సంతోషం ఏముంటుంది. ముకేశ్ అంబానీ ఇంట్లో కూడా సుఖదుఖాలు కూడా ఉన్నాయని చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) మాటలతో అర్థమైంది. కుమారుడి మాటలకు ఆ తల్లిదండ్రులు ఎంతగానో భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి ముకేశ్ అంబానీ అయితే దుఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), రాధికా మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు (Pre-wedding event) గుజరాత్ జామ్‌నగర్‌లో గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతిరథమహరథులంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకలను ఉద్దేశించి అనంత్ మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ అనంత్ ఆవేదనకు గురయ్యారు. కుమారుడి మాటలు విన్న ముకేశ్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
తన సంతోషం కోసమే తల్లిదండ్రులు ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహిస్తున్నారని అనంత్ తెలిపారు. ఇంత ప్రత్యేకంగా చేసేందుకు తన కుటుంబం చాలా కష్టపడిందని అనంత్ చెప్పుకొచ్చారు. తన సంతోషం కోసం అమ్మ ఎంతో కష్టపడ్డారని.. దాదాపు రోజుకు 18-19 గంటల పాటు శ్రమించారని గుర్తుచేశాడు. రెండు నెలల నుంచి కుటుంబ సభ్యులంతా కేవలం 3 గంటలే నిద్రపోతున్నారని చెప్పుకొచ్చాడు. తన జీవితం ఏ మాత్రం పూలపాన్సు కాదని.. ఎన్నో ముళ్లు గుచ్చుకున్నా.. దు:ఖాన్ని భరిస్తూనే వచ్చినట్లు తెలిపారు. చిన్ననాటి నుంచి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా.. తన తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడూ అండగానే ఉన్నారని వివరించాడు. అనుకున్నది సాధించేలా ప్రోత్సహిస్తూనే ఉన్నారని.. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని అనంత్ వ్యాఖ్యానించారు. దీంతో కుమారుడి మాటలకు తండ్రి ముకేశ్ అంబాన్నీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇకపోతే శుక్రవారం ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ జామ్‌నగర్‌లో ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పాప్ సింగర్ రిహన్నా.. ఆమె బృందం ఇచ్చిన ప్రదర్శనలు అమితంగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. శని, ఆదివారాల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖలంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
