NTV Telugu Site icon

Mudragada Padmanabham: 80 అసెంబ్లీ సీట్లు, సీఎం పదవి అడగాల్సింది.. పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ లేఖ!

Mudragada Padmabham

Mudragada Padmabham

Mudragada Padmanabham Writes Letter to Janasena Chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా 80 అసెంబ్లీ సీట్లు, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి అడిగి ఉండాల్సిందని.. ఆ సాహసం మీరు చేయకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెరగడానికి మీరే కారకులు అని, ప్రజలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలనుకున్నారు అని ముద్రగడ లేఖలో రాశారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదు, రాకూడదని దేవుని కోరుకుంటున్నాను అని ముద్రగడ పేర్కొన్నారు.

‘2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్ళొచ్చిన తరువాత కిర్లంపూడి వస్తానని మరోకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నానండి. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారండి. వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్దపడ్డానండి. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను కాని దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదండి’ అని ముద్రగడ పద్మనాభం తన లేఖలో రాశారు.

‘చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడరు బయటకు రావడానికి భయపడి ఇళ్ళకే పరిమితం అయిపోయారు. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకి వెళ్ళి వారికి భరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదు. చరిత్ర తిరగరాసినట్టు అయ్యింది. వారి పరపతి పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా.. మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలను. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మలను ఉన్నత స్థానంలో చూడాలని తహతహాలాడారు. పవర్ షేరింగు కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాల్సింది. ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం’ అని పద్మనాభం లేఖలో పేర్కొన్నారు.

Also Read: AP Congress: నేటితో ముగియనున్న కాంగ్రెస్ ధరఖాస్తుల పరశీలన!

’40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయలేదు. భగవంతుడ్ని ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటాన్నా. కానీ మీలాగ గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా.. తుప్పు పట్టిన ఇనుము లాంటివాడినిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి, రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవు, ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు, రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ లేఖ రాశారు.

Show comments