Site icon NTV Telugu

MS Dhoni: నాకు వయసు అయిపోయింది అనిపిస్తోంది!

Ms Dhoni Speech

Ms Dhoni Speech

యువ ఆటగాళ్లను చూస్తుంటే తనకు వయసు అయిపోయింది అని అనిపిస్తోందని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. ఇటీవల వైభవ్ సూర్యవంశీ తన కాళ్లకు నమస్కారం చేసినప్పుడు కూడా ఇలానే అనిపించిందన్నాడు. ఆండ్రీ సిద్ధార్థ్‌ తన కంటే సరిగ్గా 25 ఏళ్లు చిన్నవాడని తెలిసిందని, దీంతో తాను చాలా పెద్దవాడిని అయిపోయాననిపిస్తోందని ధోనీ చెప్పుకొచ్చాడు. 1981లో జన్మించిన మహీ వయసు ప్రస్తుతం 43 ఏళ్లు. వచ్చే జులై 7కి 44వ పడిలోకి అడుగెడతాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్‌తో మ్యాచ్‌ అనంతరం ధోనీ మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు.

‘చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని యువ ఆటగాళ్లను చూస్తుంటే నాకు వయసు అయిపోయింది అనిపిస్తోంది. రాజస్థాన్ మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ నా కాళ్లకు నమస్కారం చేసినప్పుడు ఇలానే అనిపించింది. ఇటీవల నేను డగౌట్‌లోని కూర్చొని ఉండగా.. చెన్నై ఆటగాడు ఆండ్రీ సిద్ధార్థ్‌ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నీ వయసెంత అని అడిగా. నా కంటే అతడు సరిగ్గా 25 ఏళ్లు చిన్నవాడు. దీంతో నేను చాలా పెద్ద వాడిని అయిపోయా అని అనిపిస్తోంది’ అని ఎంఎస్ ధోనీ చెప్పాడు.

ఐపీఎల్‌లో కొనసాగలా? వద్దా అనే విషయంపై 4-5 నెలల్లో నిర్ణయం తీసుకుంటానని ఎంఎస్ ధోనీ స్పష్టం చేశాడు. ‘విజయంతో ఈ సీజన్‌ను ముగించినందుకు ఆనందంగా ఉంది. గుజరాత్ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో మంచి ప్రదర్శన చేశాం. ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై నిర్ణయించుకోవడానికి నాకింకా 4-5 నెలల సమయం ఉంది. ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రొఫెషనల్ క్రికెట్. ఆటలో కొనసాగాలంటే ఫిట్‌నెస్‌ ముఖ్యం. చాలా రోజులుగా ఇంటికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు రాంచీకి వెళ్లి కుటుంబంతో గడుపుతాను. బైక్ రైడ్‌ ఆస్వాదిస్తా. ఐపీఎల్‌లో నా కెరీర్‌ ముగిసిందని చెప్పడం లేదు, తిరిగి ఆడతానని కూడా చెప్పడం లేదు. నాకు ఎంతో సమయం ఉంది. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటా’ అని మహీ తెలిపాడు.

 

Exit mobile version