MS Dhoni: IPLకు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని.. గురువుగా సరికొత్త అవతారం..

Ms Dhoni Retire

Ms Dhoni Retire

భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీ తన సుదీర్ఘ ఐపీఎల్ ఆటగాడి ప్రయాణానికి ముగింపు పలికారు. 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకు వెన్నెముకగా నిలిచిన ‘తలా’, ఇకపై మైదానంలో బ్యాట్, గ్లవ్స్‌తో కనిపించకపోవడం అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే అయినా, ఆయన జట్టుతోనే కొనసాగనుండటం ఊరటనిస్తోంది.

ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో  చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా ఈ కీలక ప్రకటన చేసింది. ధోనీకి జట్టు ‘టీమ్ మెంటార్’ బాధ్యతలు అప్పగిస్తున్నామంటూ సీఎస్కే అధికారిక పోస్ట్ పెట్టింది. జట్టు ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ CSK ప్రయాణంలో అత్యంత కీలక భాగంగా ఉన్నారని, ఫ్రాంచైజీ ఎన్నో విజయాలు సాధించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఎన్నో కష్టకాలాల్లోనూ ధోనీ జట్టుకు అండగా నిలిచారని గుర్తుచేస్తూ, ధోనీతో CSKకి ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఇకపై డగౌట్ నుంచి యువ ఆటగాళ్లకు మార్గదర్శకత్వం చేయనున్న ధోనీ, కొత్త తరం సూపర్ కింగ్స్ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో తన అపార అనుభవాన్ని పంచుకోనున్నారు. ధోనీ ఎప్పటికీ CSK గుర్తింపులో భాగంగానే ఉంటారని, చెన్నై నగరం ఎప్పటికీ ఆయనకు సొంత ఇల్లులాంటిదని ఫ్రాంచైజీ భావోద్వేగంగా వెల్లడించింది.

ధోనీ ఐపీఎల్ ప్రస్థానం చరిత్రలో నిలిచిపోయేది. 2008లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, 2008 నుంచి 2015 వరకు వరుసగా 8 సీజన్ల పాటు CSK తరఫున ఆడారు. ఆ తర్వాత 2016, 2017 సీజన్లలో CSKపై నిషేధం విధించబడిన కారణంగా ధోనీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

నిషేధం ముగిసిన అనంతరం 2018లో మళ్లీ తన సొంత గూటికి చేరుకున్న ధోనీ, 2018 నుంచి 2026 వరకు CSKతోనే కొనసాగారు. 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 45 ఏళ్ల ధోనీ, పిక్క గాయం కారణంగా గత 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. వరుస గాయాలు, వయసు రీత్యా ఆటగాడిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

తన కెప్టెన్సీలో సీఎస్కేకు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన ధోనీ, జట్టు తరఫున అత్యధికంగా 272 మ్యాచ్‌లు ఆడి 5,314 పరుగులు సాధించారు. ధోనీ రిటైర్మెంట్ నిర్ణయంతో రాబోయే ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో అదనంగా రూ. 4 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. ధోనీ లేని సీఎస్కేను ఊహించుకోలేమని ఫ్రాంచైజీ యజమాని ఎన్. శ్రీనివాసన్ పేర్కొనగా, యువ ఆటగాళ్లున్న జట్టుకు ధోనీ అనుభవం ఎంతో కీలకమని సహ-యజమాని రూప గురునాథ్ అభిప్రాయపడ్డారు.