MS Dhoni Fan Died in Tamil Nadu: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ వీరాభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన ధోనీ అభిమాని గోపీ కృష్ణన్ (34) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడలూరు జిల్లా అరంగుర్‌లోని తన ఇంటిలో ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో కృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నాడని రామనాథం పోలీసులు చెప్పారు. ఈ ఘటనతో కృష్ణన్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మనస్తాపానికి గురైన గోపీ కృష్ణన్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి సోదరుడు రామ్ తెలిపాడు. ‘గోపీ కృష్ణన్‌కు పొరుగు గ్రామంలోని కొంతమంది వ్యక్తులతో ఆర్థిక వివాదం ఉంది. అన్నయ్య ఇటీవల వారితో గొడవ పడ్డాడు. ఈ సంఘటనలో గాయపడ్డాడు. ఆ తర్వాత మనస్తాపానికి గురయ్యాడు’ అని కృష్ణన్ సోదరుడు చెప్పాడు. కృష్ణన్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమార్తె 10 రోజుల క్రితమే పుట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: AUS vs WI: 9 వికెట్లతో హాజిల్‌వుడ్ విజృంభణ.. ఆస్ట్రేలియా చేతిలో చిత్తైన వెస్టిండీస్!
అరంగూర్‌కు చెందిన గోపీ కృష్ణన్.. చెన్నై సూపర్ కింగ్స్, ఎంఎస్ ధోనీకి వీరాభిమాని. అందుకే 2020లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను తలపించేలా పసుపు రంగులో తన ఇంటిని మార్చేసి ఫేమస్ అయ్యాడు. కృష్ణన్ తన ఇంటికి ‘హోమ్ ఆఫ్ ధోనీ ఫ్యాన్’ అని కూడా పేరు పెట్టాడు. ఈ ఇంటి వీడియో వైరల్ కాగా.. అది కాస్త ధోనీ వరకు చేరుకుంది. ఆ వీడియోపై మహీ స్పందిస్తూ.. ‘ఇది తేలికైన పని కాదు. ఇందుకు కుటుంబం మొత్తం అంగీకరించాలి. పూర్తి కుటుంబానికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు.