Site icon NTV Telugu

MS Dhoni Birthday: కటౌట్ చూడు డూడ్.. ఎంఎస్ ధోనీపై తెలుగు ఫాన్స్ అభిమానం మాములుగా లేదు!

Ms Dhoni Cutout

Ms Dhoni Cutout

Telugu Fans Placed MS Dhoni’s 52 Feet Cutout in RTC X-Roads: 2004లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని చూసి భారత క్రికెట్‌నే మ‌లుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవ‌రూ అనుకోని ఉండరు. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా మంచి వికెట్ కీపర్ కోసం వెతుకుతున్న స‌మ‌యంలో జుల‌పాల జుట్టుతో మహీ జట్టులోకి వచ్చాడు. వికెట్ కీపర్ పాత్ర‌ను సమర్ధవంతంగా పోషిస్తే చాలు అని భారత మేనేజ్మెంట్ అనుకుంది. అయితే ధోనీ అద్భుత కీపింగ్‌తో పాటు ధనాధన్ ఆట‌తో జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు. కెరీర్ ఆరంభంలోనే అనుకోకుండా వ‌చ్చిన కెప్టెన్‌ అవ‌కాశాన్ని రెండు చేతులా ఒడిసిఎత్తుకుని.. టీమిండియాకు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే మోస్ట్ కూల్, స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. అలాంటి ధోనీ శుక్రవారం (జులై 7)తో 42వ పడిలోకి (MS Dhoni 42nd Birthday) అడుగుపెడుతున్నాడు.

తా ఆరాధ్య క్రికెటర్ ఎంఎస్ ధోనీ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఫాన్స్ అందరూ సిద్ధమయ్యారు. తెలుగు ఫ్యాన్స్ అయితే స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ వద్ద 52 అడుగుల భారీ కటౌట్‌ను సిద్ధం చేశారు. ధోనీ బర్త్‌డే సందర్భంగా రేపు ఈ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. కటౌట్‌లో ధోనీ గ్రౌండ్‌లోకి వస్తున్న ఫొటోను డిజైన్ చేశారు. కటౌట్‌ను ఆవిష్కరించిన అనంతరం భారీ కేక్ కటింగ్ కూడా ధోనీ ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ ప్లాన్ చేసిందట.

Also Read: Madhya Pradesh: వాడు మూత్రం పోశాడు.. సీఎం కాళ్లు కడిగాడు

ఎంఎస్ ధోనీ భారీ కటౌట్‌పై ‘తెలుగు ఎంఎస్‌డియన్స్’ అని రాసి ఉంచారు. ప్రస్తుతం ధోనీ కటౌట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ భారీ కటౌట్‌ హైదరాబాద్ నగర ప్రజలను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఏపీలోని నందిగామలో ఎంఎస్ ధోనీ తెలుగు ఫ్యాన్స్ అసోసియేషన్ 77 అడుగుల భారీ కటౌట్‌‌ను ఏర్పాటు చేసింది. గతేడాది కూడా వీరు 41 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. గతంలో 2018లో కేరళలో 35 అడుగులు కౌటౌట్‌, చెన్నైలో 30 అడుగుల కటౌట్‌ను ధోనీ ఫాన్స్ ఏర్పాటు చేశారు. ఇక ఎంఎస్ ధోనీ బర్త్‌డే సందర్భంగా ‘ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ’ మూవీని రీ-రిలీజ్ చేస్తున్నారు.

తనదైన సారథ్యంతో భారత క్రికెట్‌లోనే కాదు క్రికెట్ చరిత్రలోనే గొప్ప కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఘనతను తన పేరుపై లిఖించున్నాడు. 2007లో టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించిన ధోనీ.. 2011లో వన్డే ప్రపంచకప్‌ను, 2013లో చాంపియన్స్ ట్రోఫీని అందించాడు. మూడు భిన్న ఐసీసీ టైటిల్స్ గెలిచిన ఏకైక సారథిగా రికార్డుల్లో నిలిచాడు.

Also Read: IND vs WI: మూడు ఫార్మాట్‌లలో దక్కిన చోటు.. భవిష్యత్ స్టార్స్ ఈ నలుగురేనా!

Exit mobile version